సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యాసంవత్సరం(2016-17) నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి అవసరమైన మార్పులు, చేర్పులు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునే డిగ్రీ లేదా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం బీసీ, ఈబీసీ విద్యార్థులు అంతకుముందు ఏడేళ్లు ఎక్కడ చదవారన్న వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. బీసీ సంక్షేమ శాఖ 2016-17 బడ్జెట్ ఫలితాల వివరణ పుస్తకంలో ఈ విషయాన్ని నిర్దేశించింది. దరఖాస్తులకు బదులు ఆన్‌లైన్ ద్వారా ఈ స్కాలర్‌షిప్‌లను మంజూరు చేస్తున్నట్లు వివరించింది.
ఈ ఆన్‌లైన్ వ్యవస్థను talanganaepass.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలియజేసింది. అయితే, బీసీ, ఈబీసీ విద్యార్థుల ఏడేళ్ల వివరాలు పొందుపరచాలని పేర్కొన్నారే తప్ప అవి ఉంటేనే స్కాలర్‌షిప్ ఇస్తామని చెప్పలేదు కదా అని బీసీ సంక్షేమ శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. దీంతో పాటు బీసీ వసతిగృహాల నిర్వహణను కూడా ఆన్‌లైన్‌లోకి మారుస్తున్నట్టు, హాజరు పట్టికల పర్యవేక్షణ, బిల్ క్లెయిమ్‌లు తదితరాలు కూడా bchostels.cgg.gov.in ద్వారా నిర్వహిస్తున్నట్లు బీసీ శాఖ తెలిపింది.
మరింత పారదర్శకత కోసం ప్రవేశపరీక్ష ద్వారా 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం, డిగ్రీ మొదటి సంవత్సరం బీసీ గురుకులాల్లో ప్రవేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. విద్యార్థులకు కేరీర్ కౌన్సెలింగ్, ట్రైనింగ్, నైపుణ్యాల మెరుగుదలకు, రీ ఓరియెంటేషన్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నట్లు, జనరల్ స్టడీస్ కోసం విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలను సమకూరుస్తున్నట్లు పేర్కొంది. కల్యాణలక్ష్మీ పథకం కింద 2016-17లో బీసీ, ఈబీసీ అమ్మాయిల వివాహాల కోసం రూ.300 కోట్లు కేటాయించినట్లు, ఈ ఏడాది 58,820 మందికి ప్రయోజనం కలిగించనున్నట్లు తెలియజేసింది.
‘రీయింబర్స్‌మెంట్’కు మార్పులు!
Published Wed, Mar 23 2016 4:37 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM
Advertisement