ప్చ్ | release of the non-plan grants | Sakshi
Sakshi News home page

ప్చ్

Published Tue, Mar 7 2017 3:35 AM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

ప్చ్

ప్చ్

జీహెచ్‌ఎంసీకి సర్కారు మొండిచేయి
2016–17లో ప్లాన్‌ గ్రాంట్లు నిల్‌..
విడుదల కాని నాన్‌ప్లాన్‌ గ్రాంట్లు


సిటీబ్యూరో: రాష్ట్ర సర్కారు గ్రేటర్‌పై చిన్నచూపు చూస్తోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరం (2014–15) పదినెలల కాలానికి జీహెచ్‌ఎంసీకి రూ.74 కోట్లు కేటాయించి పుష్కలంగా నిధులు విడుదల చేసింది. రెండో ఏడాది (2015–16) బడ్జెట్‌లో రూ.81 కోట్లు కేటాయించి రూ.40 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇక 2016–17 బడ్జెట్‌లో రూ.68.97 కోట్ల ప్లాన్‌ గ్రాంట్ల కేటాయింపులు ఉన్నప్పటికీ, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. నాన్‌ప్లాన్‌ గ్రాంట్లు సైతం ఇంతకంటే భిన్నంగా ఏం లేదు. మరో మూడు వారాల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, ఇంతవరకు రూపాయి కూడా విదల్చలేదు. ఇక వచ్చే ఏడాది జీహెచ్‌ఎంసీ పరిస్థితి ఎంటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. తొలి సంవత్సరం మాత్రం కేటాయింపులకు అనుగుణంగా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం, మలి ఏడాది కేటాయింపుల్లో సగానికి కోత పెట్టడం.. ప్రస్తుతం కేటాయింపులు తప్ప నిధులు విడుదల కాకపోవడంతో జీహెచ్‌ఎంసీ పరిస్థితి దిగజారుతోంది.

ప్లాన్‌ గ్రాంట్లు లేనేలేవు..
ఏటా రాష్ట్ర బడ్జెట్‌లో జీహెచ్‌ఎంసీకి ప్లాన్, నాన్‌ ప్లాన్‌ గ్రాంట్లు రెండూ ఉండేవి. త్వరలో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016–17)లో ప్లాన్‌ గ్రాంట్ల కంటూ ఎలాంటి కేటాయింపులు చేయలేదు. అంతకుముందు సంవత్సరాల్లో ప్లాన్‌ గ్రాంట్ల కింద స్లమ్‌ ఫ్రీ పథకం, చార్మినార్‌ పాదచారుల పథకం, ఎంఎంఎస్‌ ఆర్టీఎస్, హరిత తెలంగాణ తదితర పథకాల కోసం వందల కోట్లలో కేటాయింపులుండేవి. వీటికోసం 2015–16 బడ్జెట్‌లో దాదాపు రూ.296 కోట్లు చూపినప్పటికీ రూ.17 కోట్లు మాత్రమే విడుదల చేశారు. అంతకుముందు 2014–15లో పదినెలల కాలానికి రూ.301 కోట్లు కేటాయింపులు చూపగా, రూ.185 కోట్లు విడుదలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం అసలు కేటాయింపులే చేయలేదు. ఇలా ఏటికేడు రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీపై చిన్నచూపు చూస్తుండడంతో పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఇక కొత్త ఆర్థిక సంవత్సరంలో (2017–18) కేటాయింపులు ఏ స్థాయిలో ఉంటాయో వేచి చూడాల్సిందే.

రావాల్సిన నిధులు రాక..
రాష్ట్ర  ప్రభుత్వం నుంచి జీహెచ్‌ఎంసీకి రావాల్సిన నిధులు రాకపోగా, మరోవైపు గత ఆర్థిక సంవత్సం (2015–16) జీహెచ్‌ఎంసీ ఖజానా నుంచే ఆర్టీసీకి రూ.336 కోట్లు చెల్లింపులు చేశారు. ఓవైపు ఉన్న నిధుల్ని ఉదారంగా మళ్లించడం.. మరోవైపు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో జీహెచ్‌ఎంసీలో చేపడుతున్న ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఒకప్పుడు మిగులు నిధులతో కళకళలాడిన గ్రేటర్‌ ఖజానా.. ప్రస్తుతం ఏ రోజుకారోజు అన్న చందంగా మారింది. కనీసం ప్రతినెలా ఉద్యోగుల జీతాలైనా చెల్లించగలమా.. అన్న సందిగ్ధంలో పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement