‘శ్రీవాసవి’ యజమానులకు రిమాండ్‌ | Remand to the Sri Vasavi officials | Sakshi
Sakshi News home page

‘శ్రీవాసవి’ యజమానులకు రిమాండ్‌

Published Sat, Mar 4 2017 3:58 AM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM

‘శ్రీవాసవి’ యజమానులకు రిమాండ్‌

‘శ్రీవాసవి’ యజమానులకు రిమాండ్‌

ఇంటర్‌ విద్యార్థులకు హాల్‌టికెట్ల నిరాకరణపై ఫిర్యాదు
⇒  వివరాలు వెల్లడించిన రాచకొండ కమిషనర్‌


హైదరాబాద్‌: ఇంటర్‌ విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసిన వనస్థలిపురం శ్రీవాసవి జూనియర్‌ కళాశాల యజమానులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. గురువారం గచ్చిబౌలి సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. సుభద్రానగర్, వనస్థలిపురానికి చెందిన వై.ఆత్మజ్యోతి స్థానిక శ్రీవాసవి జూనియర్‌ కళాశాలలో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాల ఫీజు రూ.9,000, పరీక్ష ఫీజు రూ.3,500 చెల్లించినా ఆమెకు యాజమాన్యం హాల్‌టికెట్‌ ఇవ్వలేదు. దీంతో ఈ నెల ఒకటిన వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌లో ఆత్మజ్యోతి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కళాశాల కరస్పాండెంట్లు వెంకటాపురం శీనయ్య(34), బండ శ్యాంసుందర్‌రెడ్డి (38)ని రిమాండ్‌కు తరలించామని కమిషనర్‌ తెలిపారు. మరో నిందితుడు గోపాల్‌గౌడ్‌ పరారీలో ఉన్నాడన్నారు. 102 మంది మొదటి సంవత్సరం, 144 మంది రెండో సంవత్సరం విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకపోవడంతో వారంతా ఓ విద్యా సంవత్సరాన్ని కోల్పోయినట్టు నిర్ధారించామన్నారు. విద్యార్థులను ప్రాక్టికల్‌ పరీక్షలకు కూడా యాజమాన్యం అనుమతించలేదన్నారు.

బాధ్యులందరిపైనా చర్యలు...
ఈ వ్యవహారంలో ఇంటర్‌ బోర్డు అధికారులు, సిబ్బంది పాత్రపైనా అనుమానాలున్నాయని కమిషనర్‌ చెప్పారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ప్రతి ఒక్కరినీ అరెస్టు చేస్తామని... పరీక్ష ఫీజు రూ.360 కాగా... రూ.3,500 చొప్పున కళాశాల వసూలు చేయడంపైనా విచారణ జరుపుతున్నామన్నారు. కళాశాల బ్యాంక్‌ అకౌంట్లు సీజ్‌ చేశామని, గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులకు సీపీ సూచించారు.

బోర్డు అధికారులకు డబ్బులిచ్చాం...
గత ఏడాది జూన్‌లో ఇంటర్‌ బోర్డు అధికారులు కళాశాలను పరిశీలించినట్లు శ్రీవాసవి జూనియర్‌ కళాశాల కరస్పాండెంట్‌ శీనయ్య తెలిపారు.  గుర్తింపు కోసం ఇప్పటికే రూ.2 లక్షలు చెల్లించినట్లు, మరో రూ.5 లక్షలిస్తేనే గుర్తింపునిస్తామని బోర్డు అధికారులు చెప్పినట్లు ఆయన వెల్లడించారు.

జరిగిందిలా...
సూర్యాపేట పట్టణంలో శ్రీనివాస్‌ నాయుడు అనే వ్యక్తి వరుణ్‌ జూనియర్‌ కాలేజీని ఏర్పాటు చేశారు. కళాశాలను వనస్థలిపురంలోని శ్రీమేధావి జూనియర్‌ కళాశాలకు మార్చారు. శ్రీమేధావిని మూసివేసి... శ్రీవాసవి జూనియర్‌ కళాశాలగా పేరు మార్చారు. శ్రీమేధావిలో రెండో సంవత్సరం చదువుతున్న 144 మంది విద్యార్థులను శ్రీవాసవిలో చేర్చుకున్నారు. దీనివల్ల విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోయారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement