మంచు మనోజ్ ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబు మేనేజర్‌ను అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ఈ వివాదంపై మొత్తం మూడు కేసులు నమోదు చేశామని సీపీ తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా సెలబ్రిటీ బైండోవర్ తీసుకొచ్చామని అన్నారు. దీంతో పాటు మనోజ్‌ను ఏడాదిపాటు బైండోవర్ చేసినట్లు సీపీ వివరించారు. ఆయన నుంచి లక్ష రూపాయల పూచీకత్తు బాండ్ తీసుకున్నామని పేర్కొన్నారు.
మోహన్ బాబు మీడియాపై దాడి చేసిన ఘటనపై కూడా కేసు నమోదు చేసినట్లు సీపీ సుధీర్ బాబు స్పష్టం చేశారు. అంతేకాకుండా మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మోహన్ బాబు ఇంటి సమస్య వారి వ్యక్తిగతమని.. కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉంటే చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. మంచు విష్ణు, మంచు మనోజ్, మోహన్ బాబు బౌన్సర్లు గొడవ పడటమే వివాదానికి కారణమని సీపీ అన్నారు.
బైండోవర్ అంటే ఏంటో తెలుసా?
ఎవరి వల్ల అయితే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు భావిస్తే ఆ వ్యక్తిని తహసీల్దార్, ఆర్డీవో ఎదుట హాజరుపరుస్తారు. చట్ట వ్యతిరేక పనులు చేయనని బాండ్ పేపర్‌పై అతనితో లిఖితపూర్వకంగా సంతకం తీసుకుని సొంత పూచీకత్తుపై విడుదల చేస్తారు. దీన్నే బైండోవర్ అంటారు. బైండోవర్ అంటే బాండ్ ఫర్ గుడ్ బిహేవియర్. బాండ్ ఇచ్చిన రోజు నుంచి ఆరు నెలల వరకు ఎలాంటి నేరాలు చేయకూడదు. ఈ ఆరు నెలల్లో ఏదైనా నేరం చేసినా, కేసు నమోదైనా బైండోవర్ సమయంలో చేసిన డిపాజిట్ డబ్బులను ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తారు. భారత శిక్షాస్మృతి చట్టం ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు బైండోవర్ అయితే అతనిపై రౌడీషీట్ తెరవొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment