రెవెన్యూ స్టాంప్ నో స్టాక్
* రెండు నెలలుగా పోస్టాఫీసుల్లో నిలిచిన విక్రయాలు
* బహిరంగ మార్కెట్‌లో ఐదు రెట్ల ధర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రెవెన్యూ స్టాంప్‌ల కొరత తీవ్రంగా ఏర్పడింది. 2 నెలలుగా పోస్టాఫీసుల్లో వాటి విక్రయాలు పూర్తిగా ఆగిపోయాయి. ఫలితం గా బహిరంగ మార్కెట్‌లో 2 నుంచి 5 రెట్లు అధిక ధరకు ఈ స్టాంపులను విక్రయిస్తున్నారు. నాసిక్ ముద్రణాలయం నుంచి సరఫరా నిలిచిపోవడంతో హైదరాబాద్ సర్కిల్ స్టాంప్ డిపోలో నిల్వలు లేకుండా పోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఉమ్మడి రాష్ట్రాల్లో మొత్తం 95 ప్రధాన పోస్టాఫీసులుండగా, వాటి పరిధిలో మరో 16,150 పోస్టాఫీసులున్నాయి.
ప్రతి నెలా 60 నుంచి 80 లక్షల వరకు రెవెన్యూ స్టాంప్‌ల డిమాండ్ ఉంటుంది. ఈ ఏడాది మార్చి 14న పోస్టల్ శాఖ జీపీవో చీఫ్ పోస్ట్‌మాస్టర్ సుమారు రూ.8 కోట్ల విలువైన రెవెన్యూ స్టాంప్‌లు సరఫరా చేయాలని స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు ఇండెంట్ పెట్టారు. కానీ, స్టాంప్‌ల సరఫరా లేకపోవడంతో తిరిగి 2 నెలల క్రితం కనీసం రూ.6 కోట్ల విలువైన స్టాంపులైనా ఇవ్వాలని మరో లేఖ రాశారు. నేటికీ అవి అందకపోవడంతో సర్కిల్ స్టాంప్ డిపోలో నిల్వలు నిండుకున్నాయి.
20 రోజుల్లో సరుకు వచ్చే అవకాశం ఉంది...
‘రెవెన్యూ స్టాంప్‌ల కోసం స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు రెండు పర్యాయాలు ఇండెంట్ పెట్టాం. 4 నెలలు కావస్తున్నా సరఫరా కాలేదు. రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు కమిషన్‌పై మాత్రమే పోస్టల్ శాఖ విక్రయిస్తుంది’ అని హైదరాబాద్ జీపీఓ చీఫ్ పోస్టుమాస్టర్ కె.జనార్దన్‌రెడ్డి చెప్పారు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ... ‘నాసిక్‌లో మాత్రమే రెవెన్యూ స్టాంపులు ముద్రణ జరుగుతుంది. సుమారు రూ.10 కోట్ల విలువగల స్టాంప్‌ల కోసం ఇండెంట్ పెట్టాం. 20 రోజుల్లో సరుకు వచ్చే అవకాశం ఉంది’ అన్నారు.