Revenue stamp
-
పుష్కలంగా రెవెన్యూ స్టాంపులు
* 8.28 కోట్ల స్టాంపులను సిద్ధం చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ * పోస్టాఫీసులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ అమ్మకాలు * బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు చర్యలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ స్టాంపుల కొరత ఏర్పడడంతో రిజిస్ట్రేషన్ల శాఖ అప్రమత్తమైంది. మహారాష్ట్రలోని స్టాం పుల ముద్రణాలయం నుంచి 8.28 కోట్ల రెవెన్యూ స్టాంపులను కొనుగోలు చేసింది. ఇందులో సుమారు 4 కోట్ల మేర స్టాంపులను మంగళవారం పోస్టల్ శాఖకు అందజేయనున్నట్లు రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులు తెలి పారు. వాస్తవానికి రెవెన్యూ స్టాంపులను విక్రయించే పోస్టల్ సిబ్బంది సకాలంలో రిజిస్ట్రేషన్ల శాఖకు సమాచారం అందించకపోవడమే రాష్ట్రవ్యాప్తంగా కొరత ఏర్పడడానికి కార ణంగా తెలుస్తోంది. రెండు నెలలుగా అన్ని జిల్లాల్లోనూ రెవెన్యూ స్టాంపులు లభించక వినియోగదారులు ఒక రూపాయి విలువైన స్టాంపును బ్లాక్ మార్కెట్లో రూ.5లకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెవెన్యూ స్టాంపుల బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టేందుకోసం అన్ని జిల్లాల్లో వినియోగదారులకు స్టాంపులను పుష్కలంగా అందుబాట్లో ఉంచాలని రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. పోస్టల్‌శాఖ పరిధిలోని అన్ని పోస్టాఫీసులతో పాటు రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ రెవెన్యూ స్టాంపులను వినియోగదారులకు అందుబాట్లో ఉంచాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడంతో పాటు స్టాంపులను బ్లాక్ చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి రూ.5వేలకు పైగా విలువైన చెల్లింపు రశీదులకు, ప్రామిసరీ నోటులకు తప్పనిసరిగా ఒక రూపాయి రెవెన్యూ స్టాంపు అవసరమౌతోంది. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ చట్టం ప్రకారం ఆయా లావాదేవీలకు ఒక రూపాయి స్టాంప్‌డ్యూటీ చెల్లించాల్సి ఉంది. ఈ విధంగా రూపాయి రెవెన్యూ స్టాంప్‌పై సంతకం చేసిన డాక్యుమెంట్లనే న్యాయస్థానం సరైన(వ్యాలిడ్) పత్రాలుగా భావిస్తుంది. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కావడంతో రైతులు బ్యాంకుల నుంచి, ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల నుంచి అప్పులు పొందేందుకు కూడా రెవెన్యూ స్టాంపుల అవసరమేర్పడింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లశాఖ రెవెన్యూ స్టాంపులను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెస్తుండడంతో ఒకట్రెండు రోజుల్లోనే స్టాంపుల బ్లాక్ మార్కెట్‌కు తెరపడనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే రెవెన్యూ స్టాంపులతో పాటు రిజిస్ట్రేషన్ స్టాంపులను కూడా మార్కె ట్లో పుష్కలంగా అందుబాటులో ఉంచామని, ఎంత విలువైన స్టాంపులనైనా వినియోగదారులు బ్లాక్మార్కెట్లో కొనే అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు. -
రెవెన్యూ స్టాంప్ నో స్టాక్
* రెండు నెలలుగా పోస్టాఫీసుల్లో నిలిచిన విక్రయాలు * బహిరంగ మార్కెట్లో ఐదు రెట్ల ధర సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రెవెన్యూ స్టాంప్‌ల కొరత తీవ్రంగా ఏర్పడింది. 2 నెలలుగా పోస్టాఫీసుల్లో వాటి విక్రయాలు పూర్తిగా ఆగిపోయాయి. ఫలితం గా బహిరంగ మార్కెట్లో 2 నుంచి 5 రెట్లు అధిక ధరకు ఈ స్టాంపులను విక్రయిస్తున్నారు. నాసిక్ ముద్రణాలయం నుంచి సరఫరా నిలిచిపోవడంతో హైదరాబాద్ సర్కిల్ స్టాంప్ డిపోలో నిల్వలు లేకుండా పోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఉమ్మడి రాష్ట్రాల్లో మొత్తం 95 ప్రధాన పోస్టాఫీసులుండగా, వాటి పరిధిలో మరో 16,150 పోస్టాఫీసులున్నాయి. ప్రతి నెలా 60 నుంచి 80 లక్షల వరకు రెవెన్యూ స్టాంప్‌ల డిమాండ్ ఉంటుంది. ఈ ఏడాది మార్చి 14న పోస్టల్ శాఖ జీపీవో చీఫ్ పోస్ట్‌మాస్టర్ సుమారు రూ.8 కోట్ల విలువైన రెవెన్యూ స్టాంప్‌లు సరఫరా చేయాలని స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు ఇండెంట్ పెట్టారు. కానీ, స్టాంప్‌ల సరఫరా లేకపోవడంతో తిరిగి 2 నెలల క్రితం కనీసం రూ.6 కోట్ల విలువైన స్టాంపులైనా ఇవ్వాలని మరో లేఖ రాశారు. నేటికీ అవి అందకపోవడంతో సర్కిల్ స్టాంప్ డిపోలో నిల్వలు నిండుకున్నాయి. 20 రోజుల్లో సరుకు వచ్చే అవకాశం ఉంది... ‘రెవెన్యూ స్టాంప్‌ల కోసం స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు రెండు పర్యాయాలు ఇండెంట్ పెట్టాం. 4 నెలలు కావస్తున్నా సరఫరా కాలేదు. రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు కమిషన్‌పై మాత్రమే పోస్టల్ శాఖ విక్రయిస్తుంది’ అని హైదరాబాద్ జీపీఓ చీఫ్ పోస్టుమాస్టర్ కె.జనార్దన్‌రెడ్డి చెప్పారు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ... ‘నాసిక్‌లో మాత్రమే రెవెన్యూ స్టాంపులు ముద్రణ జరుగుతుంది. సుమారు రూ.10 కోట్ల విలువగల స్టాంప్‌ల కోసం ఇండెంట్ పెట్టాం. 20 రోజుల్లో సరుకు వచ్చే అవకాశం ఉంది’ అన్నారు. -
‘ఉపాధి’ అక్రమార్కులు కటకటాలకు
కరీంనగర్ : జిల్లాలో ఉపాధిహామీ పథకంలో అక్రమాలకు పాల్పడిన వారిపై కోర్టు రెండోసారి కన్నెర్ర జేసింది. వరుసగా రెండోసారి శిక్షకు గురైంది భీమదేవరపల్లి మండల ప్రజాప్రతినిధులే కావడం గమనార్హం. ఈ మండలంలోని చాపగానితండా మాజీ సర్పంచ్ మాలోతు జ్యోతి, ఆమె భర్త, ప్రస్తుత జెడ్పీటీసీ రాంచందర్‌నాయక్ 2010లో రూ.2,99,791తో నాలుగు పాత బావుల్లో పూడికతీత చేపట్టారు. ఇందులో రూ.2,26,812 లెక్క తేలలేదు. ఫీల్డ్ అసిస్టెంట్ రవి ఆరుగురు ట్రాక్టర్ యజమానుల నుంచి తెల్లకాగితంపై రెవెన్యూ స్టాంప్ అతికించి డబ్బులు చెల్లించినట్లు రాతపూర్వకంగా తీసుకోగా, తమకు డబ్బే ఇవ్వలేదని గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 2012లో మాజీ సర్పంచ్ జ్యోతి, ఆమె భర్త రాంచందర్, ఫీల్డ్ అసిస్టెంట్ రవిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా నేరం రుజువైంది. జ్యోతి, రాంచందర్‌కు ఆర్నెల్ల జైలు, రూ.35వేల చొప్పున జరిమానా విధిస్తూ ప్రత్యేక సంచార న్యాయస్థానం జడ్జి కె. వెంకటేశ్వర్రావు బుధవారం తీర్పు చెప్పారు. ఫీల్డ్ అసిస్టెంట్ రవికి మూడు నెలల జైలు, రూ.5వేల జరిమానా విధించారు. కాగా, గత డిసెంబరు 31న అదే మండలం వంగర మాజీ సర్పంచ్ నల్లగోని ప్రభాకర్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి వెంకటేశ్వర్రావు తీర్పు చెప్పారు. ప్రభాకర్ సర్పంచ్‌గా ఉన్న సమయంలో నాలుగు పాత బావులను పూడ్చేందుకు ఉపాధి హామీ పథకం కింద రూ.12,38,564లతో పనులు మంజూరు చేయించుకుని, ఇందులో రూ.1.10లక్షలను సొంతానికి వాడుకున్నట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్ యజమానులకు తక్కువ మొత్తం చెల్లించాడని ఫిర్యాదు అందగా స్పెషల్ మొబైల్ కోర్టు వంగరలో విచారణ చేపట్టి మాజీ సర్పంచ్‌కు శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించారు. జిల్లాలో 300 ఫిర్యాదులు.. 60 కేసులు ఈజీఎస్‌లో అక్రమాలపై సామాజిక తనిఖీ బృందం చేపట్టిన విచారణలో జిల్లాలో మొత్తం 300 ఫిర్యాదులు వచ్చాయి. స్పెషల్ మొబైల్ కోర్టులో 60 కేసులు నమోదయ్యాయి. మెదక్‌లో 30 కేసులు నమోదు కాగా ఏడు కేసుల్లో శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చారు. ఉపాధిహామీ పథకంలో అవినీతి నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం 2012 ఫిబ్రవరి 28న స్పెషల్ మొబైల్ కోర్టులను ప్రారంభించింది. ఈ మేరకు కరీంనగర్-మెదక్ జిల్లాలకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి జడ్జిగా కె. వెంకటేశ్వర్రావు, పీపీగా వెంకటరాములును నియమించింది. రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలోని భీమదేవరపల్లి, చిగురుమామిడి, ఎల్కతుర్తి, మల్హర్, ధర్మపురి మండలాల్లో కేసులు అధికంగా నమోదయ్యాయి. మల్హర్ మండలంలో టెక్నికల్ అసిస్టెంట్ టి.రమేశ్‌రెడ్డిపై అత్యధికంగా తొమ్మిది కేసులు నమోదు కాగా వచ్చే నెల 18న కొయ్యూరులో మల్హర్ మండలానికి చెందిన కేసులను ప్రత్యేక న్యాయస్థానం విచారిస్తుందని ఏపీడీ లీగల్ అరుణ్‌రాజ్ బాపూజీ తెలిపారు.