పుష్కలంగా రెవెన్యూ స్టాంపులు
* 8.28 కోట్ల స్టాంపులను సిద్ధం చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ
* పోస్టాఫీసులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ అమ్మకాలు
* బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ స్టాంపుల కొరత ఏర్పడడంతో రిజిస్ట్రేషన్ల శాఖ అప్రమత్తమైంది. మహారాష్ట్రలోని స్టాం పుల ముద్రణాలయం నుంచి 8.28 కోట్ల రెవెన్యూ స్టాంపులను కొనుగోలు చేసింది. ఇందులో సుమారు 4 కోట్ల మేర స్టాంపులను మంగళవారం పోస్టల్ శాఖకు అందజేయనున్నట్లు రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులు తెలి పారు. వాస్తవానికి రెవెన్యూ స్టాంపులను విక్రయించే పోస్టల్ సిబ్బంది సకాలంలో రిజిస్ట్రేషన్ల శాఖకు సమాచారం అందించకపోవడమే రాష్ట్రవ్యాప్తంగా కొరత ఏర్పడడానికి కార ణంగా తెలుస్తోంది.
రెండు నెలలుగా అన్ని జిల్లాల్లోనూ రెవెన్యూ స్టాంపులు లభించక వినియోగదారులు ఒక రూపాయి విలువైన స్టాంపును బ్లాక్ మార్కెట్‌లో రూ.5లకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెవెన్యూ స్టాంపుల బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టేందుకోసం అన్ని జిల్లాల్లో వినియోగదారులకు స్టాంపులను పుష్కలంగా అందుబాట్లో ఉంచాలని రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. పోస్టల్‌శాఖ పరిధిలోని అన్ని పోస్టాఫీసులతో పాటు రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ రెవెన్యూ స్టాంపులను వినియోగదారులకు అందుబాట్లో ఉంచాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడంతో పాటు స్టాంపులను బ్లాక్ చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి రూ.5వేలకు పైగా విలువైన చెల్లింపు రశీదులకు, ప్రామిసరీ నోటులకు తప్పనిసరిగా ఒక రూపాయి రెవెన్యూ స్టాంపు అవసరమౌతోంది.
రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ చట్టం ప్రకారం ఆయా లావాదేవీలకు ఒక రూపాయి స్టాంప్‌డ్యూటీ చెల్లించాల్సి ఉంది. ఈ విధంగా రూపాయి రెవెన్యూ స్టాంప్‌పై సంతకం చేసిన డాక్యుమెంట్లనే న్యాయస్థానం సరైన(వ్యాలిడ్) పత్రాలుగా భావిస్తుంది. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కావడంతో రైతులు బ్యాంకుల నుంచి, ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల నుంచి అప్పులు పొందేందుకు కూడా రెవెన్యూ స్టాంపుల అవసరమేర్పడింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లశాఖ రెవెన్యూ స్టాంపులను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెస్తుండడంతో ఒకట్రెండు రోజుల్లోనే స్టాంపుల బ్లాక్ మార్కెట్‌కు తెరపడనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
అలాగే రెవెన్యూ స్టాంపులతో పాటు రిజిస్ట్రేషన్ స్టాంపులను కూడా మార్కె ట్లో పుష్కలంగా అందుబాటులో ఉంచామని, ఎంత విలువైన స్టాంపులనైనా వినియోగదారులు బ్లాక్‌మార్కెట్‌లో కొనే అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు.