‘ఉపాధి’ అక్రమార్కులు కటకటాలకు
కరీంనగర్ : జిల్లాలో ఉపాధిహామీ పథకంలో అక్రమాలకు పాల్పడిన వారిపై కోర్టు రెండోసారి కన్నెర్ర జేసింది. వరుసగా రెండోసారి శిక్షకు గురైంది భీమదేవరపల్లి మండల ప్రజాప్రతినిధులే కావడం గమనార్హం. ఈ మండలంలోని చాపగానితండా మాజీ సర్పంచ్ మాలోతు జ్యోతి, ఆమె భర్త, ప్రస్తుత జెడ్పీటీసీ రాంచందర్‌నాయక్ 2010లో రూ.2,99,791తో నాలుగు పాత బావుల్లో పూడికతీత చేపట్టారు.
ఇందులో రూ.2,26,812 లెక్క తేలలేదు. ఫీల్డ్ అసిస్టెంట్ రవి ఆరుగురు ట్రాక్టర్ యజమానుల నుంచి తెల్లకాగితంపై రెవెన్యూ స్టాంప్ అతికించి డబ్బులు చెల్లించినట్లు రాతపూర్వకంగా తీసుకోగా, తమకు డబ్బే ఇవ్వలేదని గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 2012లో మాజీ సర్పంచ్ జ్యోతి, ఆమె భర్త రాంచందర్, ఫీల్డ్ అసిస్టెంట్ రవిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా నేరం రుజువైంది. జ్యోతి, రాంచందర్‌కు ఆర్నెల్ల జైలు, రూ.35వేల చొప్పున జరిమానా విధిస్తూ ప్రత్యేక సంచార న్యాయస్థానం జడ్జి కె. వెంకటేశ్వర్‌రావు బుధవారం తీర్పు చెప్పారు. ఫీల్డ్ అసిస్టెంట్ రవికి మూడు నెలల జైలు, రూ.5వేల జరిమానా విధించారు. కాగా, గత డిసెంబరు 31న అదే మండలం వంగర మాజీ సర్పంచ్ నల్లగోని ప్రభాకర్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి వెంకటేశ్వర్‌రావు తీర్పు చెప్పారు. ప్రభాకర్ సర్పంచ్‌గా ఉన్న సమయంలో నాలుగు పాత బావులను పూడ్చేందుకు ఉపాధి హామీ పథకం కింద రూ.12,38,564లతో పనులు మంజూరు చేయించుకుని, ఇందులో రూ.1.10లక్షలను సొంతానికి వాడుకున్నట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్ యజమానులకు తక్కువ మొత్తం చెల్లించాడని ఫిర్యాదు అందగా స్పెషల్ మొబైల్ కోర్టు వంగరలో విచారణ చేపట్టి మాజీ సర్పంచ్‌కు శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించారు.
జిల్లాలో 300 ఫిర్యాదులు.. 60 కేసులు
ఈజీఎస్‌లో అక్రమాలపై సామాజిక తనిఖీ బృందం చేపట్టిన విచారణలో జిల్లాలో మొత్తం 300 ఫిర్యాదులు వచ్చాయి. స్పెషల్ మొబైల్ కోర్టులో 60 కేసులు నమోదయ్యాయి. మెదక్‌లో 30 కేసులు నమోదు కాగా ఏడు కేసుల్లో శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చారు. ఉపాధిహామీ పథకంలో అవినీతి నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం 2012 ఫిబ్రవరి 28న స్పెషల్ మొబైల్ కోర్టులను ప్రారంభించింది.
ఈ మేరకు కరీంనగర్-మెదక్ జిల్లాలకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి జడ్జిగా కె. వెంకటేశ్వర్‌రావు, పీపీగా వెంకటరాములును నియమించింది. రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలోని భీమదేవరపల్లి, చిగురుమామిడి, ఎల్కతుర్తి, మల్హర్, ధర్మపురి మండలాల్లో కేసులు అధికంగా నమోదయ్యాయి. మల్హర్ మండలంలో టెక్నికల్ అసిస్టెంట్ టి.రమేశ్‌రెడ్డిపై అత్యధికంగా తొమ్మిది కేసులు నమోదు కాగా వచ్చే నెల 18న కొయ్యూరులో మల్హర్ మండలానికి చెందిన కేసులను ప్రత్యేక న్యాయస్థానం విచారిస్తుందని ఏపీడీ లీగల్ అరుణ్‌రాజ్ బాపూజీ తెలిపారు.