నీడలేని ఉపాధి | students feeling incomfort in hot | Sakshi
Sakshi News home page

నీడలేని ఉపాధి

Published Fri, May 9 2014 2:33 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

students feeling incomfort in hot

ఎర్రటెండలతో ఉపాధి కూలీలు ఉక్కిరిబికివుతున్నారు. పని స్థలాల్లో కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్నారు. నిబంధనల ప్రకారం నీడ ఏర్పాటు చేయకపోవడంతో సమీపంలోని చెట్లు.. పొదల కింద సేదతీరు తున్నారు. తాగునీరు, ఎండదెబ్బ తగిలితే అందించేందుకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, గాయపడితే వైద్యం చేసేందుకు ప్రథమ చికిత్స కిట్లు మచ్చుకు కూడా కనిపించడం లేదు.
 
 సాక్షి, కరీంనగర్ : ఉపాధిహామీ పథకంలో భాగంగా జాబ్‌కార్డు ఉన్న ప్రతి కూలీ రోజుకు ఆరుగంటల పనిచేయాలి. పని చేసిన సమయం... కొలతలను బట్టి వీరికి డబ్బులు ఇస్తారు. రోజువారి కూలి రూ.169 అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 6,69,780 మందికి జాబ్‌కార్డులు ఉండగా.. 1,08,602 పనులు కొనసాగుతున్నాయి. 27,865 మంది స్వయం సహాయక సంఘ సభ్యులు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారు. వేసవికి ముందు కూలీలందరూ ఉదయం 9, 10 గంటలకు పనిబాట పట్టేవారు. ఇప్పుడు ఎండలు మండుతుండడంతో ఉదయమే పనులకు బయల్దేరుతున్నారు. నిబంధనల ప్రకారం పని స్థలాల్లో టెంట్లు, తాగేందుకు
 నీరు అందుబాటులో ఉంచాలి. వడదెబ్బకు గురైతే వెంటనే శక్తినిచ్చేందుకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లు ఉంచాలి.
 
 కానీ, ఎక్కడా ఈ సౌకర్యాలు కల్పించడం లేదు. కూలీల భద్రత తమ బాధ్యత కాదన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో కూలీలు ఉదయం 6 గంటలకే పనిస్థలాలకు వెళ్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకల్లా పని ముగించుకుని ఇళ్లకు వస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి ఆరు గంటల పాటు పని చేస్తున్నారు. అధికారులు మాత్రం కూలీలు ఉదయం పూటే పనికి వెళ్తున్నారని, 12 గంటలకే పని పూర్తవుతుందనే భావనతో పని స్థలాల్లో టెంటు వసతి కల్పించడం లేదు. కొన్ని చోట్ల మాత్రమే తాగునీటి వసతి కల్పిస్తున్నారు. చాలాచోట్ల కూలీలే ఇళ్లనుంచి బాటిళ్లలో నీళ్లు తీసుకెళ్తున్నారు.
 
 7గంటలకే సూర్యుడు ప్రతాపం చూపుతుండడంతో 12 గంటల వరకు కూలీలు ఎండలోనే పని చేస్తున్నారు. ఎండ  భయంతో పని చేయకపోతే.. కూలి తక్కువగా వస్తుంద నే భావనతో పనులు కొనసాగిస్తున్నారు. అలసటకు గురై కాసేపు సేదదీరుదామనుకుంటే అక్కడ ఎలాంటి వసతులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పనులు కొనసాగిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. భానుడి ప్రతాపానికి ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఐదుగురు కూలీలు మృత్యువాతపడ్డారు. పగలు పనికి వెళ్లి, ఇంటికొచ్చిన తర్వాత వాంతులు చేసుకుని కొందరు చనిపోతే... పనిస్థలం వద్దే ఇంకొందరు ప్రాణాలొదిలారు. జిల్లాలో ఉష్ణోగ్రత ప్రతీరోజు 42 డిగ్రీలకు పైనే నమోదవుతోంది.
 
 అందని కూలి
 నిత్యం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా కూలీలకు డబ్బులు మాత్రం సకాలంలో ఇవ్వడం లేదు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో చాలాచోట్ల కూలీలు వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. మూడు నెలలుగా చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని చోట్ల ఏడాది క్రితం చేసిన పనుల వేతనాలు కూడా ఇవ్వలేదని కూలీలు పేర్కొంటున్నారు.
 తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో గురువారం 88 మంది కూలీలు పని చేయగా ఫస్ట్ ఎయిడ్ బాక్సు కానరాలేదు. మూడు చోట్ల టార్పాలిన్ కవర్ల నీడ ఏర్పాటు చేశారు. ఏడాది నుంచి కూలీ డబ్బులు రాలేదని, గత మార్చి నుంచి పని చేసినా చిట్టీలు ఇవ్వలేదని కూలీలు చెప్పారు. గడ్డపారలు గ్రూపుకొక్కటి ఇచ్చారని, దీంతో పనులు చేయడం ఇబ్బంది అవుతుందని చెప్పారు.  ఇంటి నుంచి తెచ్చుకునే నీరు సరిపోవడం లేదని, పని చోటే తాగునీటి సౌకర్యం కల్పించాలని కూలీలు కోరారు.
 
 మండుటెండలో పని చేస్తున్నం...
 ఉదయం 6 గంటలకు పనికి వచ్చి 11 వరకు మండుటెండలో పని చేత్తన్నం. పని చేసే కాడ టెంట్లు, నీళ్లు పెడుతన్నం అని సార్లు ఎన్నోమార్లు చెప్పిండ్రు. కానీ, మాకైతే ఎక్కడ కనిపియ్యలేదు. ఎండల పనిచేసుడు తోటి దూప బాగ అయితంది. పొద్దుగాల పనికి వచ్చేటప్పుడే నీళ్లు తెచ్చుకుంటున్నం. కానీ, అవి సరిపోతలేవు. మేం ఎండల పొద్దంత కట్టపడి పనిచేసినా పైసలు మాత్రం  బరాబరి ఇస్తలేరు.   
 - డోలి కిష్టయ్య, ఉపాధి కూలి, మద్దులపల్లి, కాటారం
 
 వసతులు
 కల్పిస్తున్నాం
 జిల్లాలో ఉపాధి కూలీలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఉదయం పూట పని చేసే స్థలాల్లో మాత్రం టెంట్లు వేస్తలేం. అవసరమున్న చోట కచ్చితంగా వేస్తున్నాం. అన్ని పని స్థలాల్లో తాగునీరు అందుబాటులో ఉంచుతున్నాం.
 - కృష్ణ, డ్వామా ఏపీడీ
 
 ఇంట్లోనుంచే నీళ్లు
 ఉపాధి పనికి పోయేటప్పుడే ఇంట్లనుంచి నీళ్లు బాటిళ్లల్ల తీసుకచ్చుకుంటన్నం. అడవిలో పనికాడ నీళ్ల సౌకర్యం ఉండదు. ఎండలో పనిచేసేటోళ్లం... నీళ్లు లేకపోతే ఏట్లా? రెండు లీటర్ల వాటర్ బాటిల్‌లో నీళ్లు తీసుకపోతేనే సరిపోతయ్. లేకపోతే సగం పొంటెకు కూడా రావు. మేం పనిచేసేకాడనే నీళ్లు ఇచ్చే ఏర్పాటు చేయాలె.
 - బుర్రి గంగనర్సయ్య, భూషణరావుపేట, కథలాపూర్
 
 సౌలత్‌లెక్కడియి
 ఎప్పుడన్న దెబ్బ తగిలితే ఇచ్చే చిన్న పట్టీలు తప్పిదే ఏ సౌలతూ లేదిక్కడ. ఎండ బాగా కొట్టి నీరసమనిపిచ్చినప్పుడు జెరసేపు దమ్ము తీసుకుందామంటే నీడకోసం ఏం ఏత్తలేరు. మొదట్ల తాగెతందుకు నీళ్లిత్తురు. ఇప్పుడదిగూడా దిక్కులేదు. ఇదేంది సారూ... అంటే చేసిందానికి బుక్కిందే కూలన్నట్లు జవాబిస్తున్నరు.
 - బూర దేవవ్వ, మారుపాక, వేములవాడ
 
 నీడ లేదు.. నీళ్లు లేవు
 ఎర్రటి ఎండల పని చేత్తన్నం. కొద్ది సేపన్న నీడ పట్టున కూసుందామంటే టెంట్లు ఏత్తలేరు ఏం ఏత్తలేరు. ఎండదెబ్బ తలుగకుంట అప్పుడప్పుడు చెట్ల కింద నీడల కూసుంటన్నం. తాగుదామంటే మంచినీళ్లు ఇత్తలేరు. ఇంటికాన్నించే బాటిళ్లల్ల నీళ్లు తెచ్చుకుంటున్నం. ఉపాధి పనులు జరిగేకాడ అన్ని     వసతులు కల్పించాలె.
 - వెల్ది సమ్మక్క, ఉపాధి కూలీ, కమలాపూర్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement