నేనున్నానని.. | interview on problems of people | Sakshi
Sakshi News home page

నేనున్నానని..

Published Sun, Nov 9 2014 12:24 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

interview on problems of people

టీఆర్‌ఆర్ : బాబు నీ పేరేంటి.. ఏం చేస్తున్నవ్?
 అంజిలయ్య : నేను పది వరకు చదువుకున్నా. పైచదువుకు స్థోమత లేదు. మా కాలనీలో కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదు. మంచినీళ్లు రావు. సాయంత్రమైతే పెద్దపెద్ద దోమలు.. పన్నెండేళ్లుగా ఇక్కడ నరకం అనుభవిస్తున్నాం. కాలనీలో దాదాపు రెండొందల గుడిసెలు, ఇళ్లు ఉన్నాయి. మా కష్టాలు తీర్చాలి సార్..

 టీఆర్‌ఆర్ : అదేంటి..! ఇప్పటివరకు కరెంటు సౌకర్యం లేదా.. తాగునీళ్లు రావట్లేదా?
 బహద్దుర్ : అవును సార్. ఈ కాలనీలో పన్నెండేళ్లుగా ఉంటున్నా. అత్తరు వ్యాపారం చేసుకుని బతుకుతున్నా. మా కాలనీలో కరెంటు, తాగునీరు అనేది లేదు. సాయంత్రమైతే మా బతుకులు చీకట్లోనే. నాలుగు కిలోమీటర్లు నడిచెళ్లి పొలాలకాడనో.. పరిగిలనో నీళ్లు తెచ్చుకుంటం.

 టీఆర్‌ఆర్ : కరెంటు, తాగునీరు కావాలని ఇన్నాళ్లూ అధికారులను, ప్రజాప్రతినిధులను అడగలేదా?
 లక్ష్మి : చాలాసార్లు అడిగినం సార్.. ఇంతకుముందున్న ఎమ్మెల్యేను వందలసార్లు అడిగినం. ఎంపీడీఓ, తహసీల్ అధికార్ల కాడిని వెళ్లి అడిగినా మా గోడు పట్టించుకోలేదు.

 టీఆర్‌ఆర్ : ఏంపని చేస్తవమ్మా..?
 లక్ష్మి : కూలీపని సార్. ఏడాది కాలం నుంచి మాకు పని దొరుకుతలేదు. పూట గడవడమే కష్టమైతాంది..

  టీఆర్‌ఆర్ : ఉపాధి హామీ పనికి పోవట్లేదా..?
 లక్ష్మి : ఏమో సార్.. ఉపాధి పని మాకు తెలియదు. చిత్తుకాగితాలు ఏరుకుని పరిగిలో అమ్ముకుంటం. లేకుంటే కూలీపనికి పోతం. ఈ పనులు తప్ప వేరే పని తెల్వదు.

 టీఆర్‌ఆర్ :  నీ పేరేంటి? ఎం పని చేస్తున్నావ్?.
 నసీరుద్దీన్ :  నాకు 35 ఏళ్లు సార్.. టీటీసీ చేసిన. పెళ్ళైంది.. ముగ్గురు పిల్లలు. డీఎస్సీ కోసం  చూస్తున్నా. ముస్లీంలకు 12శాతం రిజర్వేషన్ ఇస్తామని కేసీఆర్ చెప్పిండు. కనీసం 8శాతం అమలు చేసినా బాగుంటంది.  

 టీఆర్‌ఆర్ : మీ కాలనీలో చాలా సమస్యలున్నట్టున్నాయ్?
 నసీరుద్దీన్ : కాలనీలో కేవలం గుడిసెలు, మనుషులం మాత్రమే ఉన్నాం సర్. కానీ మా వాళ్లకు ఎలాంటి హక్కులు లేవు. కరెంటు లేదు.. నల్లాలు లేవు.. స్కూల్ లేదు.. అంగన్‌వాడీ కేంద్రం లేదు.. ఆస్పత్రి లేదు.. రేషన్ కార్డులు లేదు.. ఆధార్ కార్డులు లేదు. నియోజకవర్గ కేంద్రానికి దగ్గరా ఉంటున్నా.. ఏదో అడవిలో ఉన్నట్టుంటది.

 టీఆర్‌ఆర్ : మీ కాలనీలో పరిస్థితిని ప్రత్యక్షంగా చూస్తున్నా. చాలా భయంగా ఉంది. ఈ సమస్యలపై ఇన్ని రోజులుగా ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు?
 నసీరుద్దీన్ : మా బాధలెవరూ పట్టించుకుంటారు సార్.. అధికారుల్ని అడిగీఅడిగి బేజారొచ్చింది. మా సమస్యలన్నీ పరిష్కరించాలి.. ఇక్కడ బడి, ఆంగన్‌వాడీ కేంద్రం, రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలి.
 
 టీఆర్‌ఆర్ : ఏమమ్మా.. ఎలా ఉన్నవ్?
 పద్మ : నాకు నలుగురు కొడుకులు, ఒక కూతురు సార్. ఇక్కడ బడిలేదు. అందుకే పిల్లల్ని చదవించలేదు. అందరం చిత్తుకాగితాలే ఏరుకుని బతుకుతం. పని లేనప్పుడు పస్తులుంటం. మా బతుకులు ఎప్పుడు బాగుపడతయో ఆ భగవంతుడికే తెలవాలె.

 టీఆర్‌ఆర్ : అమ్మా.. సొంత ఇళ్లు ఉందా?
 బోనమ్మ : లేదుసార్.. వేరేవాళ్ల జాగాలో గుడిసె వేసుకున్నం. వాళ్లు ఖాళీ చేయమంటే రోడ్డు మీద బతకాలె.

 టీఆర్‌ఆర్ : నమస్తే పెద్దాయన.. ఏం పని చేస్తున్నవ్?
 అబ్డుల్ రషీద్ : చిన్న హోటల్ పెట్టుకున్నా. సాయంత్రమైతే నరకంలోకి వెళ్లినట్టే. పాములు, తేళ్లు తిరుగుతయ్. రోడ్లు లేవు, కరెంటు, నల్లాలు లేవు. వారంలో కనీసం ఒకట్రెండు పాముల్నయినా సంపుతం.  క్షణం క్షణం భయం భయంగా బతుకీడుస్తున్నాం.

 టీఆర్‌ఆర్ : నమస్తే భాయ్ సాబ్.. ఎక్కడికో వెళ్లొస్తున్నరు?
 రషీద్ : నమస్తే సారు.. నేను శనగబఠానీలు అమ్ముకుంటా. రోజూ పరిగి వెళ్లొస్తా. పరిగి పోవాలంటే నాలుగు కిలోమీటర్లు సైకిల్‌పైన పోవాలె. అలా చుట్టూ తిరగకుండా నేరుగా పరిగి వెళ్లే మార్గం ఉంది. అయితే కాలువ దాటాలె. బ్రిడ్జి కట్టిస్తే అరకిలోమీటర్ దూరంతో పరిగి పోవొచ్చు.  ఎట్ల అయిన బ్రిడ్జి కట్టియ్యాలె సార్..

 టీఆర్‌ఆర్ : ఏం పెద్దమ్మ.. పింఛన్ వస్తుందా?
 సక్కుబాయ్ : వస్తలేదు సార్.. సర్వేలో పేరు కూడా రాయించిన. రేషన్ కార్డు కూడా లేదు. జర ఆదుకోండి..

 టీఆర్‌ఆర్ : అమ్మా.. ఏం పని చేస్తున్నావ్?
 పద్మ : సార్ నాకు ముగ్గురు పిల్లలు. లివర్ పాడై భర్త చనిపోయాడు. పదేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నా. సౌకర్యాలు లేని ఈ కాలనీలో బతకడమే కష్టంగా ఉంది. ఇక్కడ ప్లాట్ ఉంది. దరఖాస్తు చేసుకున్న కానీ ఇందిరమ్మ ఇళ్లు రాలేదు.

టీఆర్‌ఆర్ : వితంతు పింఛన్ వస్తుందా?
 పద్మ : లేదు సార్. దరఖాస్తు చేసుకున్నా రాలేదు. కూలీ పని చేసుకుని పిల్లల్ని పోషిస్తున్నా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement