సాక్షి, కరీంనగర్ : మండుటెండలు సైతం లెక్కచేయకుండా చమటోడ్చుతున్న ఉపాధిహామీ కూలీలను పట్టించుకునే నాథుడే లేడు. ఫిబ్రవరి రెండో వారం నుంచి పదిహేను రోజుల క్రితం వరకు చేసిన పనికి డబ్బులందక.. చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులుపడుతున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన నిధులను విడుదల చేయడంలో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే.. ఆ తర్వాత రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కారణంగా చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో జిల్లావ్యాప్తంగా కూలీలకు ప్రభుత్వం రూ.30 కోట్లు బకాయి పడింది. సంబంధిత అధికారులు రేపుమాపంటూ తిప్పుకుంటుండటం కూలీలకు ఆగ్రహం తెప్పిస్తోంది. ప్రతిరోజు జిల్లాలో ఏదో ఒకచోట డబ్బుల కోసం కూలీలు అధికారులను నిలదీస్తూ.. ఆందోళనలకు దిగుతున్నారు.
జిల్లావ్యాప్తంగా 6,69,780 జాబ్‌కార్డులుండగా, 1,08,602 పనులు కొనసాగుతున్నాయి. పని చేసినందుకు ప్రతిరోజు ఒక్క కూలీకి రూ.149 చొప్పున ఇవ్వాల్సి ఉంది. ప్రతిరోజు ఇవ్వడం కష్టమవుతుంది కాబట్టి పదిహేను రోజులకోసారి డబ్బులు చెల్లించాలని కేంద్రప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో మూడు నెలల క్రితం వరకు ఇది సక్రమంగానే అమలైంది. ఫిబ్రవరిలో కేంద్రం నిధులు విడుదల చే యలేదు. మార్చి 30 మున్సిపల్, ఏప్రిల్ 6, 11న ప్రాదేశిక, అదేనెల 30న సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ కారణంగా అధికారులు కూలీలకు డబ్బులు చెల్లించలేకపోయారు.
అయినా కూలీలు మాత్రం ఉపాధిహామీ పనులు చేసేందుకు వెనకడుగు వేయలేదు. పనిస్థలాల్లో కనీస సౌకర్యాలు లేకున్నా.. సకాలంలో డబ్బులు రాకున్నా.. మండుటెండల్లోనూ పనులు కొనసాగించారు. అధికారులు కనీసం డ బ్బులు ఎప్పుడొస్తాయో కూడా స్పష్టంగా చెప్పకపోవడంతో కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా వచ్చిన ఎన్నికల్లో పార్టీల తరుపున ప్రచారం చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని కూడా వదులుకుని పనులు చేశామని, తమను ఇబ్బందులకు గురిచేయొద్దని కోరుతున్నారు.
25లోగా చెల్లిస్తాం : కృష్ణ, డ్వామా ఏపీడీ
కూలీలకు డబ్బులు అందని విషయం వాస్తవమే. నిధుల విడుదలకు కేంద్రం నెలరోజులు ఆలస్యం చేసింది. తర్వాత ఎన్నికల నియమావళి కారణంగా డబ్బులు చెల్లించలేకపోయాం. ఈ నెల 25లోగా అందరికీ డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటాం. ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా రూ.24కోట్లు, యాక్సిస్ బ్యాంకు నుంచి రూ.6 కోట్లు కూలీల ఖాతాల్లో జమచేస్తాం.
పైసలిప్పించుండ్రి...
ముస్తఫానగర్(గంభీరావుపేట), న్యూస్‌లైన్ : మూడు నెలలుగా నిలిచిపోయిన ఉపాధిహామీ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గంభీరావుపేట మండలం ముస్తఫానగర్‌కు చెందిన సుమారు వంద మంది కూలీలు గురువారం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
మూన్నెల్లుగా పైసలిత్తలేరు.. ఏం తినుడు.. ఎట్ల బతుకుడు.. గిట్ల సతాయిత్తే ఎట్లా.. అంటూ కూలీకి వెళ్లకుండా డబ్బులు ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన సుమారు 150 మంది ఉపాధిహామీ కూలీలకు మూడు నెలలకు రూ.2.50 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. రేపు మాపు అంటూ అధికారులు డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈనెల 25 లోపే డబ్బులు రావాలని, లేకుంటే ఆ తర్వాత రావని తెలిసి కూలీలు పని బంద్ పెట్ట ధర్నా చేశారు. ఒక్కో కూలీకి సుమారుగా రూ.5వేలకు మించి రావాల్సి ఉందని చెప్పారు.
ఉపాధి.. కూలేది?
Published Fri, May 23 2014 2:30 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement
Advertisement