పల్లెతల్లి ఒడిలోనే..
పల్లెతల్లి ఒడిలోనే..
Published Sat, Mar 11 2017 1:29 PM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
► పల్లెటూళ్లలోనే 81.02 శాతం కుటుంబాలు
► 18.98 శాతం కుటుంబాలదే పట్టణవాసం
► 17.26 శాతం కుటుంబాల్లో మహిళలదే పెత్తనం
► భూమిలేని కుటుంబాలు 62.38 శాతం
► రోజు కూలీపైనే 62.25 శాతం కుటుంబాల జీవనం
► ఉద్యోగంపై సంపాదిస్తున్నది 4.19 శాతమే..
► 83.88 శాతం కుటుంబాలు ‘హలో’ అంటున్నాయి
► సామాజిక, ఆర్థిక, కులగణన తాజా నివేదికలో వెల్లడి
సాక్షి, కరీంనగర్ :
తెలంగాణ వ్యాప్తంగా చూస్తే అధికశాతం మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికొస్తే 81.02 శాతం కుటంబాలు పల్లెతల్లి ఒడిలోనే సాగిస్తున్నాయి. జిల్లాలో మొత్తంగా 9,27,865 కుటుంబాలకు 7,51,791 (81.02 శాతం) కుటుంబాలు గ్రామీణ ప్రాం తాల్లోనే నివాసం ఉంటున్నాయి. 18.98 శాతం (1,76,074) కుటుంబాలు నగరం, పట్టణాల్లో ఉన్నాయి. నెల మొదట్లో జీతం ముఖం చూసే కుటుం బాలు 31,531 (4.19 శాతం) మాత్రమే. 4,67,959 (62.25 శాతం) కుటుంబాలు రోజు కూలీపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ గణంకాలన్నీ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, కులగణన (ఎస్‌ఈసీసీ) స్పష్టం చేసింది.
గ్రామీణ భారత పరిస్థితులు, వారు గడుపుతున్న జీవితం, ఆదాయ మార్గాల అన్వేషణ, షెడ్యూల్డ్ కులాలు, తెగల్లో ఆర్థిక సాధికారిత, కనీస మౌలిక అవసరాలైన విద్య, వైద్యం, ఉద్యోగం తదితర అంశాలు ఆధారంగా ఈ సర్వే నిర్వహించింది. అధికారులు ఈ నివేదికను ఇటీవలే కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు ఢిల్లీలో అందజేశారు. 2011 మార్చిలో ప్రారంభమైన ఈ సర్వే 2016 డిసెంబర్‌లో పూర్తయ్యింది.
భూమిలేని నిరుపేదలు 62.38 శాతం.. సొంత వ్యవసాయం చేస్తున్నది 37.62 శాతం..
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 57.54 శాతం భూమిలేని నిరుపేద కుటుంబాలు ఉంటే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 62.38 శాతం ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 7,51,791 కుటుంబాలకు గాను.. వీరిలో 62.38 శాతం కుటుంబాలకు చెందిన వారు భూమిలేని నిరుపేదలు. 2,82,837 కుటుంబాలకే భూమి ఉంది. మొత్తం 71,71,158.41 ఎకరాల భూమి ఉంటే 11,29,310 (15.75 శాతం) ఎకరాల భూమి సాగుకు యోగ్యంగా లేదు. 55,83,294 ఎకరాల భూమి సాగుకు యోగ్యంగా ఉండగా... ఇందులో 4,58,552 (6.39 శాతం) ఎకరాల్లోనే రెండు పంటలు సాగవుతున్నాయి.
సొంతంగా వ్యవసాయంపై గ్రామీణ ప్రాంతాల్లో 37.62 శాతం కుటుంబాలు మాత్రమే ఆధారపడుతున్నట్లు సర్వే నివేదికలు చెబుతున్నాయి. కాగా డ్రిప్, స్ప్రింక్లర్లు, ఎలక్ట్రికల్ మోటార్లు తదితర పరికరాలను సొంతంగా వినియోగిస్తున్న రైతు కుటుంబాలు 86,411 (11.49 శాతం) కాగా, 24,559 (3.27 శాతం) కుటుంబాలు వ్యవసాయ యాంత్రీకరణను పాటిస్తున్నాయి. రూ.50 వేలకు పైన పరిమితి ఉన్న కిసా¯ŒS క్రెడిట్ కార్డులు 2,772 (0.45 శాతం) కుటుంబాలకే ఉన్నాయి.
ఉద్యోగం చేస్తున్నది 31,531 కుటుంబాలు.. 62.25 శాతం కుటుంబాలు రోజూ కూలీపైనే..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో 7,51,791 కుటుంబాలకు.. ఉద్యోగం ద్వారా సంపాదిస్తున్నది 31,531 (4.19 శాతం) కుటుంబాలే. ప్రభుత్వ ఉద్యోగులుగా నెల మొదట్లో డబ్బు ముఖం చూసేది ఈ కుటుంబాలే. ఈ 31,531 కుటుంబాల్లో 15562 (2.07 శాతం) కుటుంబాలు ప్రభుత్వ సెక్టారులో, 13,328 కుటుంబాలు ప్రైవేట్ సెక్టారులో ఉద్యోగం చేస్తున్నారు. 5,92,161 కుటుంబాలు రూ.5 వేల కంటే తక్కువ, 1,28,371 కుటుంబాలు రూ.5 వేల నుంచి 10 వేల మధ్యన సంపాదిస్తుండగా, రూ.10 వేలపైన సంపాదిస్తున్న కుటుంబాలు 31,240 మాత్రమే. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 26,011 కుటుంబాలు ఆదాయ, వృత్తి పన్ను చెల్లిస్తుండగా, 17,833 కుటుంబాలు సొంత వ్యాపారాలపై సంపాదిస్తున్నాయి. అత్యధికంగా 4,67,959 (62.25 శాతం) కుటుంబాలు రోజూ కూలీ ద్వారా జీవనం సాగిస్తున్నాయి.
83.88 శాతం ‘హలో’ అంటున్నారు.. పెళ్లికాని వారు 40.17 శాతం..
ఆర్థిక స్థితిగతులు, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నా.. గ్రామీణ ప్రాంతాల్లో 83.88 శాతం మంది మొబైల్ ఫోన్లు వాడుతున్నట్లు సామాజిక, ఆర్థిక, కులగణన నివేదిక తేల్చింది. 6,30,619 (83.88 శాతం) కుటుంబాలు మొబైల్ ఫోన్లు వాడుతుండగా, 6,476 కుటుంబాలు ల్యాండ్‌లైన్ ఫోన్లు, 6,244 కుటుంబాలు ల్యాండ్‌లైన్, మొబైల్ ఫోన్లు వాడుతున్నాయి. ల్యాండ్‌ఫోన్, మొబైల్ ఫోన్లు లేని కుటుంబాల సంఖ్య 1,08,451 (14.43 శాతం)గా ఉంది. ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాలు తదితర వాహనాలను 1,77,052 (23.55 శాతం) కుటుంబాలు వాడుతుండగా, 39,548 (5.26 శాతం) కుటుంబాల్లో ఫ్రిజ్‌లు ఉన్నాయి.
ఇదిలా ఉంటే మొత్తం గ్రామీణ జనాభా 28,70,716 కాగా, స్త్రీ, పురుషులు 14,74,920 మంది వైవాహిక జీవితం గడుపుతుండగా, 11,53,078 (40.17 శాతం) మంది పెళ్లికాని వారు ఉన్నారు. 1,72,451 మంది పెళ్లయి వితంతువులుగా ఉండగా.., 24,655 మంది ఒంటరిగా, 8,040 మంది విడాకులు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతంలో మొత్తంగా 6,21,974 (82.73 శాతం) కుటుంబాలు పురుషుల నేతృత్వంలో సాగుతుండగా, 1,29,791 (17.26 శాతం) కుటుంబాలు మహిళల నేతృత్వంలో నడుస్తున్నాయి.
మూడు గదులకుపైన ఇళ్లు ఉన్న కుటుంబాలు 10.46 శాతమే..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 7,07,184 కుటుంబాలు సొంత ఇళ్లలో.. 5.52 శాతం మంది అద్దె ఇళ్లలో ఉంటున్నారు. 94.07 శాతం మందికి సొంత ఇళ్లున్నా.. మూడు గదులకుపైన ఉన్న కుటుంబాలు 78,642 (10.46 శాతం) మాత్రమే. అత్యధికంగా రెండు గదుల ఇళ్లు 4,32,192 (57.48 శాతం) కాగా, మూడు గదులున్న ఇళ్లు 1,17,386 (15.61 శాతం), ఒక్క గది ఉన్న ఇళ్లు 1,22,082 (16.23 శాతం) ఉన్నాయి. కాగా.. వెదురు, గడ్డి, తాటాకు ఇళ్లలో 4,319 కుటుంబాలు, ప్లాస్టిక్ పాలిథిన్ గుడారాల్లో 800, కర్ర ఇళ్లలో 1,222 కుటుంబాలు జీవనం గడుపుతుండగా.. మట్టి, కాల్చని ఇటుకతో కట్టిన ఇళ్లలో 52,542 కుటుంబాలు బతుకులీడుస్తున్నాయి.
Advertisement
Advertisement