సిరిసిల్ల, న్యూస్‌లైన్ : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆధునికీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మార్కెట్‌లో పోటీ తట్టుకుని నాణ్యమైన గుడ్డ ఉత్పత్తి చేస్తూ మెరుగైన ఉపాధి సాధించే దిశగా నేతన్నలను ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. కాలం చెల్లిన మగ్గాలతో వస్త్ర పరిశ్రమ తరచూ ఆటుపోట్లను ఎదుర్కొంటూ సంక్షోభంలో కూరుకుపోతున్న నేపథ్యంలో పరిశ్రమను ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా బుధవారం సిరిసిల్ల శివనగర్ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఆసాములు, యజమానులతో కేంద్ర జౌళి శాఖ అధికారులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఆధునిక మగ్గాలకు సబ్సిడీ
సిరిసిల్లలో పురాతన మగ్గాలు వస్త్రోత్పత్తి సాగిస్తుండగా, వాటిని ఆధునికీకరించేందుకు కేంద్ర జౌళి శాఖ ఆర్థికసాయం అందిస్తోంది. ఒక్కో మగ్గాన్ని ఆధునికీకరించేందుకు రూ.15 వేలు సబ్సిడీగా ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. ఒక్కో ఆసామి ఎనిమిది మగ్గాల వరకు స్థాపించుకునే అవకాశముంది. అంటే ఒక్కో ఆసామి రూ.1.20 లక్షల మేర సబ్సిడీ పొందవచ్చు. ఒక్కసారిగా మగ్గాలన్నింటినీ మార్పిడి చేయకుండా ఉన్న మగ్గాలపైనే డాబీలు మార్చి, జకాట్లను అమర్చి వస్త్రోత్పత్తి నాణ్యత పెంచే దిశగా జౌళిశాఖ చర్యలు తీసుకోనుంది.
ఉన్న మగ్గాలపైనే మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్త్రాన్ని ఉత్పత్తి చేసేందుకు అవకాశముంటుంది. ఒక్కో మగ్గం ఆధునికీకరణ కోసం రూ.15 వేల సబ్సిడీ ఇవ్వడం ఒక రకంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు శుభవార్తే. సిరిసిల్లలో 34 వేల మరమగ్గాలు ఉండగా, ఇందులో 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్ వస్త్రం ఉత్పత్తవుతుండగా, ఏడు వేల మగ్గాలపై కాటన్ వస్త్రం తయారవుతోంది. ముతక రకం కాటన్, పాలిస్టర్ వస్త్రాలను ఉత్పత్తి చేయడంతో మార్కెట్‌లో డిమాండ్ లేక తరచూ సంక్షోభం ఎదురవుతోంది. మగ్గాలను ఆధునికీకరించడంతో పిక్కుల్లో హెచ్చుతగ్గులు తగ్గి పడుగుపేకల పోగులు తెగినా మగ్గం ఆగకుండా నడిచేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేయనున్నారు. ఉన్న మగ్గాలకే కొన్ని పరికరాలను అమర్చడానికి రూ.30 వేల వరకు ఖర్చవుతుండగా, ఇందులో యాభైశాతం మేర సబ్సిడీ చెల్లించేందుకు కేంద్ర జౌళి శాఖ ముందుకొచ్చింది. కేవలం రూ.15 వేలు వస్త్రోత్పత్తిదారుడు భరిస్తే మగ్గాలను ఆధునికీకరించుకోవచ్చు.
నేడు వస్త్రోత్పత్తిదారులతో
సమావేశం
సిరిసిల్ల శివనగర్ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు కేంద్ర జౌళి శాఖ టెక్నికల్ అధికారి రాజా ఆధ్వర్యంలో వస్త్రోత్పత్తిదారులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మగ్గాలను ఆధునికీకరిస్తే కలిగే ప్రయోజనాలను ఆసాములు, యజమానులకు హైదరాబాద్ మరమగ్గాల సేవా కేంద్రం టెక్నికల్ అధికారులు వివరించనున్నారు. మగ్గాలతోపాటే సైజింగ్‌లను ఆధునికీకరిస్తే సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమకు మంచిరోజులు వచ్చినట్లే. సిరిసిల్ల నేతన్నలు పరిశ్రమ ఆధునికీకరణ దిశగా అడుగులు వేస్తే నాణ్యమైన వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తూ నమ్మకమైన ఉపాధి సాధించుకోవచ్చు.
ఆధునికీకరణ వైపు అడుగులు
Published Wed, Oct 16 2013 3:41 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement