పట్టాలెక్కేనా? | Railway budget | Sakshi
Sakshi News home page

పట్టాలెక్కేనా?

Published Wed, Feb 25 2015 3:18 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

Railway budget

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : మరో 48 గంటల్లో నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా పూర్తిస్థాయిలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఈసారి జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు పెండింగ్ ప్రాజెక్టుల ఆమోదం, కొత్త రైళ్ల మంజూరుపై గంపెడాశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా కొత్తపల్లి-మనోహరాబాద్ రైలు ప్రాజెక్టు పనులకు నిధులు మంజూరవుతాయని గట్టి నమ్మకంతో ఉన్నారు. పలు కొత్త రైళ్లు కూడా మంజూరవుతాయని భావిస్తున్నారు. వాస్తవానికి గత యూపీఏ హయాంలో రైల్వే ప్రాజెక్టుల మంజూరు, కొత్త రైళ్ల అనుమతుల విషయంలో తెలంగాణకు ప్రధానంగా కరీంనగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది.
 
 ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన ఎంపీలు బి.వినోద్‌కుమార్, బాల్క సుమన్‌తోపాటు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈసారి కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే పలు ప్రతిపాదనలు సమర్పించారు. జనవరి 7న హైదరాబాద్‌లో రైల్వే అధికారులతో జరిగిన తెలంగాణ ఎంపీల సమావేశంలోనూ రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు ప్రత్యేకించి కరీంనగర్‌కు జరుగుతున్న అన్యాయంపై ఎంపీలు వినోద్‌కుమార్, సుమన్ గళమెత్తారు. రైల్వేశాఖ సమావేశాలంటే ‘చాయ్ బిస్కెట్ల’కే పరిమితమవుతున్నాయే తప్ప నిర్దిష్ట కార్యాచరణ లేకుండా పోయిందని వినోద్‌కుమార్ బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 
 అటు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా రైల్వే మంత్రితోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులందరినీ కలిసి పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కల్పించాలంటూ ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతిస్తున్న టీఆర్‌ఎస్ ఎంపీలు ఈసారి రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని చెబుతున్నారు. కొత్త రాష్ట్రంలో సరికొత్త ప్రాజెక్టులతోపాటు పెండింగ్ పనులకూ మోక్షం కలిగేలా చేస్తామనే ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎంపీలు సమర్పించిన ప్రతిపాదనలన్నింటికీ కేంద్రం ఆమోదిస్తుందా? లేదా? అనేది 48     గంటల్లో తేలనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement