సాక్షిప్రతినిధి, కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది.. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. వచ్చేనెల 10లోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు అధికారయంత్రాంగం అంతా సిద్ధం చేస్తోంది. జనవరి 5నాటికి గడువు ముగిసిన అన్ని పంచాయతీలకు ఎన్నికల నిర్వహించాలన్న కోర్టు ఆదేశాలను పాటించేందుకు కసరత్తు చేస్తున్నారు. వాస్తవానికి ఆగస్టులోనే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహించాలని ఏర్పాట్లు చేసినా.. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. దీంతో సర్పంచ్‌ల స్థానంలో ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రెండోసారి అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారులను వేగిరపెడుతోంది. దీంతో నిన్నామొన్నటి వరకు శాసన సభ ఎన్నికల కోసం అహర్నిశలు పనిచేసిన అధికారులు ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగారు.
మూడు విడతలు, ఖరారైన గ్రామాలు.. 15న కులాల వారిగా నోటిఫికేషన్, రిజర్వేషన్లు
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా నిర్వహించనున్నారు. జిల్లాలోని 16 మండలాలకుగాను కరీంనగర్ అర్బన్‌ను మినహాయించి 15 మండలాల్లో మూడు విడతలుగా నిర్వహించే గ్రామాలను ఖరారు చేశారు. మొదటి విడతగా చొప్పదండి, గంగాధర, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, రామడుగు మండలాల్లోని 97 గ్రామాలు, రెండో విడతలో చిగురుమామిడి, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం మండలాల్లోని 107 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. మూడోవిడతలో ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్, సైదాపూర్, వీణవంక మండలాల్లోని 109 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు
అంతా సిద్ధం చేశారు. ఈ ఎన్నికల్లో కొత్త మహిళ స్థానాల ఎంపికను లాటరీ పద్ధతిన చేపట్టనున్నారన్న చర్చ అధికారవర్గాల్లో సాగుతోంది. ఉదాహరణకు ఒక మండలంలో 10 గ్రామ పంచాయతీలను బీసీలకు కేటాయిస్తే ఐదు స్థానాల్లో మహిళలు పోటీ చేస్తారని, ఆ 10 గ్రామ పంచాయతీల పేరుతో చీటివేసి అందులో ఐదింటిని ఎంపిక చేస్తారని అధికారులు చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన స్థానాలలో సైతం ఇదే విధానంలో జరగనుందని సమాచారం. జనవరి 10 నాటికి కచ్చితంగా ఎన్నికలు జరపాల్సిన ఆవశ్యకత ఏర్పడడంతో అధికారులు ఏర్పాట్లు వేగిరం చేశారు.
ఇందులో భాగంగా ఈనె 15న కులాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. బీసీ గణన ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో అందులో కొన్ని తీసివేతలు, మార్పులు చేర్పులు చేసి తుది నోటిఫికేషన్ వెల్లడించనున్నారు. ఈనెల చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిసింది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు ఇటీవలే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశానుసారం ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయాలి. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం కేటాయించాలి. ఇప్పటికే బీసీల గణన పూర్తయిన నేపథ్యంలో.. గురువారం కొలువుతీరిన ప్రభుత్వం నేడోరేపో సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోనుందని సమాచారం.
313 పంచాయతీలు, 2,966 వార్డులు.. 3,985 బాక్సులు, 9.09లక్షల బ్యాలెట్‌పేపర్లు
జిల్లాలోని 16 మండలాల్లోని 313 పంచాయతీలకు సర్పంచ్, 2,966 వార్డు సభ్యుల పదవులకు సమర్థంగా ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఒక్కో విడతకు 90 పంచాయతీల నుంచి 110 వరకు ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ సిద్ధం చేయాలని నిర్ణయించా రు. జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని 4,19,059 (17.05.2018 నాటికి) మంది ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవడానికి అవసరమైన పోలింగ్ కేంద్రాలు, ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని గుర్తించారు. జిల్లాలోని 313 పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకుగాను 4,404 పోలింగ్ స్టేషన్లు గుర్తించారు. ఎన్నికల నిర్వహణకు 4,404 మంది ప్రిసైడింగ్ అధికారులు, అదనపు పోలింగ్ ఆఫీసర్లను నియమించనున్నారు.
మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణ విధుల కోసం రూట్, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ తదితర కేడర్‌లతోపాటు 10 శాతం అదనంగా కలుపుకుని 4,600 మందిని ఎంపిక చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పోలింగ్ నిర్వహణ కోసం ఒక్కో విడతకు 1,350 నుంచి 1,430 వరకు పోలింగ్‌బాక్స్‌లు అవసరమని గుర్తించారు. ఇప్పటికే జిల్లాలో 3,985 పోలింగ్ బాక్స్‌లను, 9,09,800 బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేసిన అధికారులు ప్రభుత్వ గోదాముల్లో భద్రపరిచినట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థికి గులాబీ, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలు కేటాయించనున్నారు. పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు తదితర సిబ్బందికి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ నేతృత్వంలో ఇదివరకే శిక్షణ తరగతులు నిర్వహించారు.
విడత మండలాలు గ్రామాలు
మొదటివిడత 05 97
రెండవ విడత 05 107
మూడోవిడత 05 109
మొత్తం 15 313
నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా సిద్ధం
ఎన్నికల సంఘం నియమావళి, ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం, పర్యవేక్షణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చకాచకా సాగుతున్నాయి. పోలింగ్‌బాక్సులు వచ్చాయి. ఓటర్లు, వార్డుల జాబి తా సవరణ, తుది జాబితాపైనా కసరత్తు జరుగుతోంది. - మనోజ్‌కుమార్, డీపీవో
Comments
Please login to add a commentAdd a comment