సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఆశావహుల్లో నెలకొన్న ఉత్కంఠ మరో రెండురోజుల్లో వీడనుంది. ఈనెల 28న జనాభా, ఓటర్ల ప్రాతిపదికన ఆయా పంచాయతీల వివరాలను పూర్తి చేసి 29న ప్రకటించనున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్ల కోటాను ప్రభుత్వం ఖరారు చేయగా, తదనుగుణంగా జరుగుతున్న కసరత్తును 28న పూర్తి చేసి, రిజర్వేషన్ కేటగిరీల వారీగా కేటాయించిన పంచాయతీలు, వార్డుల వివరాలను ప్రకటించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని 1508 గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఎస్టీ జనాభా గల ఏజెన్సీ ప్రాంతంలోని 60 జీపీలలో ఎస్టీలే సర్పంచులుగా, వార్డు సభ్యులుగా పోటీ చేయాల్సి ఉంటుంది.
ఇక షెడ్యూల్ ఏరియా పరిధిలోని 445 జీపీల్లో ఎస్సీ వర్గానికి చెందిన వారే సర్పంచులుగా పోటీ చేయాల్సి ఉంటుంది. ఆయా పంచాయతీల్లో వందశాతం ఎస్సీలే ఉంటే వార్డు సభ్యులుగా కూడా ఎస్సీలే పోటీ చేస్తారు. ఒకవేళా ఇతర కులాలు కూడా షెడ్యూల్డ్ ఏరియా పంచాయతీల్లో నివసిస్తూ ఉంటే 50 శాతం వార్డులను ఎస్సీలకు కేటాయించి, మిగతా 50 శాతాన్ని ప్రభుత్వ రిజర్వేషన్ విధానం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్ రిజర్వుడ్ స్థానాలుగా వార్డుల విభజన జరుగుతుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆయా జిల్లాల ఆర్డీవోలు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియలో మునిగిపోయారు.
1,003 జీపీల సర్పంచులకే రిజర్వేషన్ విధానం
ఉమ్మడి జిల్లాలోని 1508 గ్రామపంచాయతీల్లో వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న 60 పంచాయతీలు, షెడ్యూల్డ్ ఏరియాలోని 445 జీపీలు కలిపి 505 స్థానాల్లో సర్పంచులకు రిజర్వేషన్ ఉండదు. వాటిని ఎస్టీ, ఎస్సీలకే కేటాయిస్తారు. మిగతా 1,003 పంచాయతీల్లో 50 శాతం అన్ రిజర్వుడ్ కేటగిరీ కింద 503 జీపీలను ఇప్పటికే నిర్ణయించా రు. మిగతా 500 పంచాయతీలను ఎస్టీలకు 6.68 శాతం, ఎస్సీలకు 20.53 శాతం, బీసీలకు 22.79 శాతం కింద రిజర్వేషన్ ప్రక్రియను అమలు చేస్తున్నారు. ఈ ప్రకారం ఎవరెవరెకి ఎన్ని సర్పంచు స్థానాలు కేటాయిస్తారనే విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయితే అవి ఏవేవీ అనే విషయంపై కసరత్తు శరవేగంగా సాగుతుంది. ఎస్సీ, ఎస్టీలను జనాభా ప్రాతిపదికన, బీసీలను ఓటర్ల జాబితా ప్రకారం నిర్ణయించి తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. ఈసారి ప్రకటించిన రిజర్వేషన్ విధానం మరో విడత ఎన్నికలకు కూడా కొనసాగనుంది.
మహిళలకు లాటరీ పద్ధతిన రిజర్వేషన్
లాటరీ విధానమే...
స్థానిక సంస్థల ఎన్నికలల్లో 50 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలనే నిర్ణయం మేరకు ఆ సంఖ్యను కూడా ఖరారు చేశారు. జిల్లాల వారీగా ఆదిలాబాద్‌లో 467 జీపీల్లో 234 మహిళలకు కేటాయించారు. కుమురంభీంలోని 334 జీపీల్లో 166, మంచిర్యాలలోని 311లో 154, నిర్మల్‌లోని 396 జీపీల్లో 199 మహిళలకు కేటాయించారు. అయితే ఏయే పంచాయతీలు, వార్డులు మహిళలకు కేటాయించాలన్న అంశంపై అధికారుల వ ద్ద నిర్ధిష్ట గైడ్‌లైన్స్ లేవు. ఇదే విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లడంతో పురోగతి లభించింది. మహిళా ఓటర్ల సంఖ్యలో ఎక్కువగా ఉన్న పంచాయతీల నుంచి (డిసెండింగ్ ఆర్డర్‌లో) లాటరీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. తదనుగుణంగానే జీపీలు, వార్డులను కేటాయించాలని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కలెక్టర్ నేతత్వంలో ఆర్డీఓలు లాటరీ విధానంలో ఆయా జీపీ లను మహిళలకు రిజర్వ్ చేయనున్నారు.
29లోపు కసరత్తు పూర్తి..
గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను ఈనెల 29లోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు అధికారులు కసరత్తును ముమ్మరం చేశా రు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే కలెక్టర్ ద్వా రా ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తారు. ఈ నివేదికలను ప్రభుత్వం ఎన్నికల సంఘానికి పంపిన వెంటనే గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్ పరిధిలోని గ్రామపంచాయతీలకు ఒక్కో విడతలో ఎన్నికలను నిర్వహించాలని జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
తుది దశలో..
పంచాయతీలకు రిజర్వేషన్ల వర్తింపుపై యం త్రాంగం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అన్ని మండలాలకు సంబంధించి కేటగిరీల వారీగా రిజర్వేషన్ల సంఖ్యను కలెక్టర్ ఖరారు చే యగా.. పంచాయతీల వారీగా వార్డుల రిజర్వేష న్ల సంఖ్యను ఆర్డీవోలు ఫైనల్ చేసినట్లు తెలిసింది. జీపీలకు ఆయా కేటగిరీల కింద రిజర్వ్ చేసే అం శం ఆర్డీవోల పరిధిలో ఉంది. ఇదే తరహాలో వా ర్డులను సంబంధిత ఎంపీడీవోలు కేటగిరీల వా రీగా రిజర్వ్ చేయనున్నారు. ఆయా వార్డుల్లో ఓటర్ల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు.
బేసి సంఖ్య ఉంటే ఎలా..
ఆయా జీపీల్లో వార్డులు బేసి సంఖ్యలో ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మహిళా కోటా కింద 50 శాతం వార్డులు పోగా అన్‌రిజర్వ్‌డ్ కింద ఒక వా ర్డు అదనంగా మిగులుతోంది. ఈ స్థానాన్ని మహిళలకు రిజర్వ్ చేయాలా.. లేక జనరల్‌కు కేటా యించాలా? అనే అంశంపై అధికారుల వద్ద స్పష్టత లేదు. ఉదాహరణ కు ఒక పంచాయతీలో 23 వార్డులు ఉంటే.. మహిళలకు 50 శాతం కోటా కింద 11.5 వార్డులను కేటాయించడం అసాధ్యం. అంటే మహిళలకు 11 లేదా 12 కేటాయించాల్సి ఉంటుంది. ఇలా బేసి అంకెగా మిగులుతున్న వార్డుని ఎవరికి కేటా యించాలని ప్రభుత్వాన్ని యంత్రాంగం కోరినట్లు తెలిసింది. దీనిపై బుధవారం స్పష్టత వచ్చే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత వార్డుల రిజర్వ్ ప్రక్రియ కూడా పూర్తి కానుంది.
Comments
Please login to add a commentAdd a comment