గ్రామపంచాయతీ సర్పంచ్‌ల రిజర్వేషన్ల ప్రక్రియ చేపడుతున్న అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషా, ఆర్డీవో, డీపీవో, అధికారులు
కరీంనగర్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియ మరో అడుగు ముందుకు పడింది. గత కొన్ని రోజులుగా రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠకు గురువారం రాత్రి తెరపడింది. రిజర్వేషన్ల ప్రక్రియకు తుది రూపునిస్తూ అధికార యంత్రాంగం పచ్చజెండా ఊపింది. జెడ్పీ సమావేశ మందిరం వేదికగా అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషాతో పాటు ఆర్‌డీవో ఆనంద్‌కుమార్, డీపీవో మనోజ్‌కుమార్‌లతో పాటు వివిధ శాఖల అధికారులు, రాజకీయ నాయకుల సమక్షంలో జిల్లాలోని 313 గ్రామపంచాయతీలకు ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
హైకోర్టు ఉత్తర్వులకు లోబడి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ విధానాన్ని అమలు చేశారు. కరీంనగర్ జిల్లాలో 16 మండలాలు ఉండగా కరీంనగర్ అర్బన్ మండలాన్ని మినహాయించి 15 మండలాల్లోని 313 గ్రామాలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. వందశాతం ఎస్టీ జనాభా ఉన్న సైదాపూర్ మండలం రాయికల్ తండాను పూర్తిగా వారికే కేటాయించారు. మిగతా 312 గ్రామ పంచాయతీల్లో ఎస్టీలకు 3, ఎస్సీలకు 80, బీసీలకు 73 చొప్పున కేటాయించారు. మిగిలిన 156 స్థానాలను జనరల్ కేటగిరీ కింద రిజర్వేషన్లు ప్రకటించారు.
సగానికి పైగా మహిళలకే....
మహిళలకు అన్ని వర్గాల్లో 50 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ఈ లెక్కన జిల్లాలో మహిళలకు 158 స్థానాలు లభిస్తున్నాయి. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న సైదాపూర్ మండలం రాయికల్ తండాను మొదటిసారి మహిళలకు కేటాయించారు. ఎస్టీలకు మొత్తం మూడు పంచాయతీలు కేటాయిస్తే మహిళలకు రెండు రిజర్వే చేశారు. ఎస్సీలకు 80 పంచాయతీలు కేటాయించగా మహిళలకు 40, బీసీలకు కేటాయించిన 73 పంచాయతీల్లో మహిళలకు 37 గ్రామపంచాయతీల్లో రిజర్వేషన్లు సమకూరాయి. మొత్తానికి జిల్లాలో 313 పంచాయతీలు ఉంటే మహిళలు 158 పంచాయతీల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కానున్నారు. అదేవిధంగా రిజర్వేషన్లలో జనరల్ స్థానాలకు సైతం మహిళలు పోటీ చేసే అవకాశం ఉండడంతో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య మరింత పెరగనుంది.
గ్రామాల్లో నెలకొన్న రాజకీయ సందడి....
గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో పంచాయతీ పోరుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఆయా గ్రామాల్లో చోటామోటా నాయకుల్లో రాజకీయ సందడి నెలకొంది. అనుకూలమైన రిజర్వేషన్లు వచ్చిన ప్రాంతాల్లో నాయకులు తాను పోటీలో ఉంటున్నానని, అందరూ సహకరించాలని అప్పుడే ప్రచారం సైతం మొదలుపెట్టారు. కుల సంఘాల వారీగా పెద్ద మనుషులను కలుస్తూ తనకు మద్దతు పలుకాలని, ఆశీర్వదించాలని అభ్యర్థిస్తూ మందు పార్టీలకు తెరలేపుతున్నారు. ప్రలోభాలకు గురిచేసే ప్రక్రియ మొదలు కానుండడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వెడేక్కింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తు కాకుండా సాధారణ గుర్తులే ఇవ్వనుండడంతో అభ్యర్థుల మంచి చెడులే ప్రామాణికంగా ఓట్లు పడే అవకాశం ఉండడంతో ఆశావహులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో పడ్డారు.
313 పంచాయతీలు, 2,966 వార్డులు...
జిల్లాలోని 328పంచాయతీల్లో 15 విలీన గ్రామపంచాయతీలు మినహా మిగతా 313 పంచాయతీలకు, 2966 వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు అవసరమయ్యే బ్యాలెట్ బా క్సులు 3,985 జిల్లాకు ఇప్పటికే చేరుకున్నాయి. సరిపడా బ్యాలెట్ పత్రాలను సైతం సిద్ధం చేసి ఉంచారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవ్వడంతో 15 విలీన గ్రామపంచాయతీల్లో ఎన్నికల నిర్వహణ ప్రస్తుతానికి లేనట్లే అని చెప్పవచ్చు.
మూడు విడతల్లో ఎన్నికలు...
జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ప్రతి విడతలో ఐదు మండలాల్లో ఎన్నికలు నిర్వహించేలా జిల్లా అధికారులు కసరత్తును పూర్తి చేశారు. 5వేల జనాభాకు ఒకరు చొప్పున 124 మంది రిటర్నింగ్ అధికారులను, ప్రతి పంచాయతీకి ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని నియమించేందుకు 334 మందిని ఎంపిక చేసి ఇప్పటికే వారికి శిక్షణ ఇచ్చారు. జిల్లాలో కరీంనగర్ అర్బన్ మినహా మిగతా 15 మండలాల్లో ప్రతి ఐదు మండలాలకు ఓసారి ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ తయారు చేసినట్లు సమాచారం. మొదటి విడతలో గంగాధర, రామడుగు, చొప్పదండి, కరీంనగర్‌రూరల్, కొత్తపల్లి(హెచ్) మండలాల్లోని 97 గ్రామ పంచాయతీల్లో, రెండవ విడతలో తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లోని 107 గ్రామపంచాయతీల్లో, మూడవ విడతలో హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, సైదాపూర్ మండలాల్లోని 109 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తును పూర్తి చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment