
'ఎగనామం పెట్టే పనులు చేయొద్దు'
హైదరాబాద్: నదుల అనుసంధానం ఇప్పుడు కాదు ఎప్పుడో జరిగిందని వైఎస్సార్ సీపీ నేత జ్యోతుల నెహ్రూ తెలిపారు. కృష్ణా, గోదావరి అనుసంధానం చేశామని టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఏలూరు దగ్గర కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ఎప్పుడో జరిగిందని గుర్తు చేశారు.
మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టుల ఫలితాలను తమవిగా టీడీపీ ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. మోసపూరిత ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మాయాల గారడీ ప్రభుత్వం ప్రజలను పాలిస్తోంది, దానికి నాయకుడు మహా మాంత్రికుడు అని ఎద్దేవా చేశారు. వాస్తవాలకు దగ్గర ఆలోచన చేయాలని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించాలని సూచించారు. రైతాంగానికి ఎగనామం పెట్టే పనులు చేయొద్దని హితవు పలికారు.