బంజారాహిల్స్ లో ఆదివారంఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఓ కొడుకును వృద్ధురాలైన కన్న తల్లికి దూరం చేసింది. హృదయవిదారకమైన ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిగూడ ఆర్‌బీఐ క్వార్టర్స్ సమీపంలో ఉన్న జయప్రకాశ్‌నగర్ సాయి కేశవ్ హోమ్స్‌లో నివసించే పడాల అనిల్‌కుమార్‌రెడ్డి(70) ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో స్కూటీపై బంజారాహిల్స్ రోడ్ నెం.7 నుంచి సరూర్‌నగర్‌లోని ఎన్‌ఎస్ వృద్ధాశ్రమంలో వసతి పొందుతున్న తల్లి ప్రమీల(93) వద్దకు టిఫిన్ తీసుకొని వెళ్తున్నాడు.
సరిగ్గా రోడ్ నెం. 7లోని ఓవర్‌సీస్ బ్యాంకు ముందు టర్నింగ్ తీసుకుంటుండగా గుర్తు తెలియని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనిల్‌కుమార్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. వరంగల్‌కు చెందిన అనిల్‌కుమార్‌రెడ్డి తన సోదరులు అశ్వినికుమార్‌రెడ్డి, అజయ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు. వీరంతా ప్రతి ఆదివారం వృద్ధాశ్రమంలో ఉండే తల్లి వద్దకు వెళ్లి రెండు, మూడు గంటలు అక్కడే గడుపుతారు. ఇందులో భాగంగానే ఆయన ఆదివారం ఉదయం తల్లి వద్దకు వెళ్తుండగా మృత్యువు కారు రూపంలో వచ్చికాటేసింది.
మృతుడు ప్రముఖ కెమెరామెన్ సమీర్‌రెడ్డి తండ్రి. ఆరుష్ బిల్డింగ్ మెటీరియల్స్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా పని చేస్తున్న అనిల్‌కుమార్‌రెడ్డి మృతి ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. భార్య జ్యోతికుమారి, కొడుకు, కూతురు కన్నీరు మున్నీరయ్యారు. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఘటనకు కారణమైన వాహనం కోసం పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అయితే కారు మాత్రమే కనిపిస్తుండగా నంబర్‌ప్లేట్ కెమెరాలో చిక్కక పోవడంతో ముందున్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.