
అనితపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు
♦ చేయని వ్యాఖ్యలకు బాధపడితే... వాటిని ఉపసంహరించుకుంటా
♦ సభా హక్కుల సంఘం ముందు ఎమ్మెల్యే రోజా వివరణ
♦ అసెంబ్లీలో తప్పుగా మాట్లాడలేదని స్పష్టీకరణ
♦ ఎమ్మెల్యే అనితను అడ్డం పెట్టుకొని తనను వేధిస్తున్నారని అనుమానం
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనితపై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా చెప్పారు. చేయని వ్యాఖ్యలను చేసినట్లుగా భావించి బాధపడితే, వాటిని ఉపసంహరించుకుంటానని స్పష్టం చేశారు. ఆమె బుధవారం అసెంబ్లీలో సభా హక్కుల సంఘం(ప్రివిలేజెస్ కమిటీ) ముందు హాజరై తన వివరణ ఇచ్చారు. తనపై రోజా డిసెంబర్ 18న అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనిత ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరపాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభా హక్కుల సంఘాన్ని ఆదేశించారు. ఏడాదిపాటు సభ నుంచి సస్పెన్షన్‌కు గురైన రోజాను గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ప్రివిలేజెస్ కమిటీ మూడుసార్లు విచారణకు పిలవగా ఆమె అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయారు. బుధవారం కమిటీ ముందు హాజరైన రోజా గంటకు పైగా సుదీర్ఘంగా తన వివరణ ఇచ్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి....
అనిత అంటే ద్వేషం లేదు
భగవద్గీత సాక్షిగా తాను అసెంబ్లీలో ఏ తప్పూ చేయలేదని రోజా పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనితను అగౌరవపర్చలేదని, మహిళల హక్కుల కోసం పోరాడుతున్న తాను మరో మహిళను ఎలా కించపరుస్తానని అన్నారు. అనిత అంటే తనకు ద్వేషం లేదని కమిటీకి నివేదించారు. విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య, కాల్‌మనీ వ్యవహారంపై పోరాటం చేస్తున్న తనను కొందరు వ్యక్తులు అనితను అడ్డం పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని కమిటీ ముందు రోజా అనుమానం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వాయిదా పడిన తరువాత చోటుచేసుకున్న సంఘటనల వీడియో క్లిప్పింగ్‌లు ఎలా లీకయ్యాయి? సోషల్ మీడియాలో ఎలా వచ్చాయి? అని అసెంబ్లీ కార్యదర్శిని ఆమె గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం.
నేను తప్పు మాట్లాడినట్లు సంకేతాలు పంపారు
అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై రోజా సవివరంగా, నిబంధనల సహితంగా సభ్యుల ముందు వివరణ ఇచ్చారు. తాను తప్పు మాట్లాడకపోయినా ఏదో తప్పు మాట్లాడినట్లుగా చిత్రీకరిస్తూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి వైఖరిని ఆమె ప్రశ్నించారు. తన సస్పెన్షన్‌పై న్యాయపోరాటం చేస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టుకు తిరుగుతూ ఉన్నప్పుడే సభా సంఘం ముందు హాజరు కావాలని లేఖలు ఎలా పంపుతారని అన్నారు. మొత్తం మీద ఈ వ్యవహారంలో బలవుతున్నది ఇద్దరు మహిళలేనని వాపోయారు.
తాను అనని మాటలను అన్నట్లుగా అనిత బాధపడి ఉంటే ఉపసంహరించుకుంటానని పేర్కొన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మంత్రి అచ్చెన్నాయుడు సభలో తమను ఉద్దేశించి పదేపదే చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రోజా ప్రస్తావించారు. ‘పాతేస్తాం’ అంటూ ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి అధికార పక్ష సభ్యులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను సభా హక్కుల సంఘం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. వంగలపూడి అనిత ఇచ్చిన సభా హక్కుల నోటీసుకు సంబంధించి మాత్రమే దర్యాప్తు చేయాలని స్పీకర్ తమను ఆదేశించారని, అధికార పక్ష సభ్యులు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమ పరిధిలోకి రావని రోజాకు కమిటీ సభ్యులు వివరించినట్లు తెలిసింది. తాను తప్పు చేయలేదనడానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ రోజా హక్కుల సంఘం ముందుంచారు.
వారంలోగా నివేదిక ఇస్తాం: గొల్లపల్లి
ఎమ్మెల్యే రోజా ఇచ్చిన వివరణను పూర్తిగా రికార్డు చేశామని, వారంలోగా స్పీకర్‌కు నివేదిస్తామని సభా హక్కుల సంఘం చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు మీడియాతో చెప్పారు. ఈ దశలో ఇంతకంటే ఎక్కువ చెప్పలేనన్నారు. స్పీకర్ సూచనల ప్రకారం తాము ఈ దర్యాప్తును చేపట్టామన్నారు. గతంలో కూడా రోజాను కమిటీ ముందుకు రావాల్సిందిగా కోరితే అనివార్య కారణాల వల్ల రాలేకపోయానంటూ వివరణ ఇచ్చారని తెలిపారు. కమిటీ ముందు గంటకు పైగా ఆమె ఇచ్చిన వివరణను పరిశీలించామని, మరోమారు సమావేశం కావాలని నిర్ణయించామన్నారు.వివాదం సమసినట్లేనా? అని విలేకరులు ప్రశ్నించగా... స్పీకర్‌కు సమర్పించాక నివేదిక శాసనసభకు వెళుతుందని, అప్పుడు నిర్ణయం జరుగుతుందని గొల్లపల్లి పేర్కొన్నారు. సంఘం సభ్యులు కె.రామకృష్ణ, బీసీ జనార్దన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బండారు సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.