ఆబ్కారీ శాఖలో కాసుల గలగల
రెండు నెలల్లోనే రూ. 2,391 కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంవత్సరం ఆరంభమైన రెండు నెలల్లోనే ఆబ్కారీ శాఖ రికార్డు స్థాయి ఆదాయం సమకూర్చుకుంది. వేసవి కాలంలో పెరిగిన బీర్ల అమ్మకాలు, మద్యం దుకాణాల లెసైన్సు ఫీజు వాయిదాల మొత్తంతో పాటు డిస్టిలరీలు, బ్రూవరీల నుంచి ఎక్సైజ్ సుంకాల వసూళ్లతో రూ. 2,391. 17 కోట్ల రెవెన్యూ సాధించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బడ్జెట్ అంచనాల్లో ఆబ్కారీ శాఖకు నిర్దేశించిన మొత్తం కన్నా ఇది 6 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఆబ్కారీ శాఖ సాధించిన రూ. 2391. 17 కోట్ల రెవెన్యూ నుంచి ‘వ్యాట్ బై ఎక్సైజ్’ రూపంలో ప్రభుత్వ ఖజానాకు నేరుగా రూ. 1,540 కోట్లు చేరనుండగా, మిగతా మొత్తం వివిధ పద్దుల రూపంలో జమ కానుంది.
వార్షిక లక్ష్యం రూ. 14,161 కోట్లు
మద్యం అమ్మకాల ద్వారా 2016 -17 ఆర్థిక సంవత్సరానికి రూ. 14,161 కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఇది 2015-16 ఆర్థిక సంవత్సరం సాధించిన రెవెన్యూ మొత్తం రూ. 12,200.79 కన్నా సుమారు రూ. 2వేల కోట్లు అధికం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం తొలి నెల నుంచే ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి వసూళ్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో బడ్జెట్ అంచనాల లక్ష్యాని కన్నా 16 శాతం వృద్ధితో రూ. 969.29 కోట్లు రెవెన్యూ సాధించింది. ఇక మేలో రూ. 1,421 .86 కోట్లు సమకూరాయి. దీంతో రెండు నెలల్లోనే రూ. 2,391 కోట్లు వసూలయ్యాయి.
మే నెలాఖరులోగా చెల్లించాల్సిన మద్యం దుకాణాల మూడో విడత లెసైన్సు ఫీజు వాయిదా కింద రూ. 498 కోట్లు సమకూరగా, బ్రూవరీలు, డిస్టిలరీల నుంచి ఎక్సైజ్ సుంకం కింద రెండు నెలల్లో రూ. 301 కోట్లు వసూలయింది. ఇతర మార్గాల ద్వారా మరో 14.44 కోట్లు ఎక్సైజ్ శాఖకు వచ్చి చేరింది. కాగా జూన్ నెలాఖరులోగా బార్ల లెసైన్సులను రెన్యువల్ చేయించుకోవలసి ఉంది. రాష్ట్రంలోని 804 బార్లు, 17 క్లబ్బులు, 9 పర్యాటక ప్రాంతాలోని బార్ల నుంచి లెసైన్సు ఫీజు వసూలు చేయాల్సి ఉంది. ఈ లెక్కన జూన్‌లో కూడా దాదాపు రూ. 1,400 కోట్ల వరకు వసూలయ్యే అవకాశం ఉంది.