11 ప్రాజెక్టులకు రూ.9 వేల కోట్లు
- పీఎంకేఎస్‌వై కింద కేంద్రం ఆర్థిక సాయం
- గ్రాంటుగా రూ.1,299 కోట్లు
- నాబార్డు రుణం రూ.7,889.99 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) కింద రాష్ట్రం నుంచి ఎంపికైన 11 పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు రూ.9 వేల కోట్ల మేర సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. దీని కింద దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 ప్రాజెక్టుల పూర్తికి నిధుల సమీకరణకు కేంద్రం, నాబార్డు మధ్య గతనెల 7న ఢిల్లీలో ఒప్పందం కుదరడం తెలిసిందే. దీంతో రాష్ర్టం లోని 11 పెండింగ్ ప్రాజెక్టులకు ఆర్థికసాయం అందనుంది.
కేంద్ర ప్రభుత్వం గ్రాంటు కింద రూ.1,299.19 కోట్లను, నాబార్డు రుణంగా రూ.7,889.99 కోట్లను ఇవ్వనున్నాయి. 2016-17లోనే కేంద్ర సాయం కింద రూ.993.88 కోట్లు అందనుం డగా మిగతాది వచ్చే ఏడాది లోగా అందనుంది. నాబార్డు నుంచి ఈ ఆర్థిక ఏడాదిలోనే రూ.5,832.31 కోట్ల రుణం రానుండగా 2017-18లో రూ.1,375 కోట్లు, 2018-19 ఏడాదిలో రూ.681 కోట్ల మేర రుణం అందించేందుకు కేం ద్రం సానుకూలత తెలిపింది. నాబార్డు రుణంపై రాష్ట్ర నీటిపారుదలశాఖ సోమవారం కేంద్ర ఆర్థికశాఖకు పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించగానే రుణ మంజూరు జరగనుంది. పీఎంకేఎస్‌వై కింద రాష్ట్రంలోని కొమురం భీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ-2, దేవాదుల, జగన్నాథ్‌పూర్ , భీమా, వరద కాల్వ ప్రాజెక్టులను గుర్తించడం తెలిసిందే. నిర్మాణానికి అవసర మైన రూ.25,159.20 కోట్లలో ప్రభుత్వం ఇప్పటికే 15,969.29 కోట్లను ఖర్చు చేసింది.