రూ.కోటి విలువైన ఏనుగు దంతాల పట్టివేత
ముగ్గురి అరెస్టు
అల్వాల్ : కోటి రూపాయల విలువైన ఏనుగు దంతాలను అల్వాల్ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సైబరాబాద్ ఎస్‌ఓటీ అడిషనల్ డీసీపీ ఈ.రామచంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వైజాగ్‌కు చెందిన వీకేఎస్ బోస్ తన వద్ద ఉన్న ఏనుగు దంతాలను అమ్మిపెడితే కమీషన్ ఇస్తానని కుంచర్లపాటి సూర్యనారాయణ రాజుకు చెప్పాడు. సూర్యనారాయణ రాజు నగరంలోని అమీన్‌పూర్‌కు చెందిన మున్నూర్ ఫణీందర్(26) ద్వారా మోతీనగర్‌కు చెందిన రియల్టర్ నున్న అరవింద్‌రెడ్డికి ఏనుగు దంతాల గురించి తెలియజేశాడు. అతను ఏనుగు దంతాలు తీసుకొని రమ్మని చెప్పడంతో సూర్యనారాయణరాజు వైజాగ్ నుంచి ఏనుగుదంతాలను నగరానికి తెచ్చి.. అల్వాల్ గ్రీన్‌ఫీల్డ్స్‌లో ఉన్న అరవింద్‌కుమార్‌ను కలిశాడు.
విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నిందితులు సూర్యనారాయణరాజు, ఫణీందర్, అరవింద్‌రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలు, 5 సెల్‌ఫోన్లు, మారుతీ స్విఫ్టు కారు స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేశారు. మరో నిందితుడు వైజాగ్‌కు చెందిన వీకేఎస్ బోస్ పరారీలో ఉన్నాడు. ఈ దాడిలో ఇన్‌స్పెక్టర్‌లో కె.నరసింగరావు, ఎన్‌సీహెచ్ రంగస్వామి, ఎ.రాములు ఎస్‌ఓటీ ఈస్ట్‌జోన్ సిబ్బంది, మల్కాజగిరి పోలీసులు పాల్గొన్నారు.