నిందితుల వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు
హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం): సహ విద్యార్థినిపై అత్యాచారం చేసి.. ఆ దృశ్యాలను చిత్రీకరించి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు బీటెక్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను నూజివీడు డీఎస్పీ ప్రసాదరావు శనివారం హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలోని ఎన్నారై ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థినిని.. సీనియర్ విద్యార్థులైన కొత్త శివారెడ్డి(ప్రకాశం జిల్లా ఉప్పలపాడు), పిన్నబోయిన కృష్ణవంశీ(విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు) జన్మదిన వేడుకలకంటూ గతేడాది ఫిబ్రవరిలో తమ రూమ్‌కు పిలిచారు. తీరా రూమ్‌కు వచ్చిన తర్వాత ఎవ్వరూ లేకపోవటంతో కంగారుపడ్డ ఆ విద్యార్థిని.. వెంటనే వారిని ప్రశ్నించింది. ఇంతలో వారు ఆమెను బలవంతంగా నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఎవరికైనా చెబితే.. వీడియాలను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. దీంతో ఎంతో మానసిక క్షోభ అనుభవించిన ఆ విద్యార్థిని చివరకు శివారెడ్డి, కృష్ణవంశీల వేధింపులు తట్టుకోలేక.. కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. కానీ కాలేజీ యాజమాన్యం శివారెడ్డి, కృష్ణవంశీని మందలించి.. వారి ఫోన్లలోని వీడియోలను డిలీట్ చేయించి వదిలివేసింది. ఈ విషయం బయటపడితే కాలేజీ అప్రతిష్ట పాలవుతుందని, భవిష్యత్‌లో ఈ తరహా ఘటనలు పునరావృతం కానివ్వబోమని విద్యార్థినికి నచ్చజెప్పారు. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న శివారెడ్డి, కృష్ణవంశీ ఇటీవల తమ ఫోన్లలో ఆయా వీడియోలను రికవరీ చేసుకోవటమే కాక ఆగిరిపల్లి మండలం బొద్దనపల్లికి చెందిన దొడ్ల ప్రవీణ్‌కుమార్‌కు వాట్సాప్ ద్వారా పంపించారు. దీంతో ప్రవీణ్ తన కామ వాంఛ తీర్చాలని.. లేకపోతే వీడియోలను బయటపెడతానంటూ విద్యార్థినిని వేధించడం మొదలుపెట్టాడు.
రూ.10 లక్షలు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆ విద్యార్థిని.. రెండ్రోజుల క్రితం ఆగిరిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సీఐ నాయుడు నిందితులైన కృష్ణవంశీ, శివారెడ్డి, ప్రవీణ్‌ను శనివారం అరెస్ట్ చేశారు. వీరిపై ఐపీసీ 376 డీ, 354 ఏ, ఐటీ యాక్ట్ సెక్షన్ 67 క్రింద కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. వీరిని నూజివీడు కోర్టులో ప్రవేశపెట్టి.. దర్యాప్తు కోసం రిమాండ్ కోరుతామని చెప్పారు. అత్యాచారం ఘటనను కప్పిపుచ్చేందుకు, నేరాన్ని మాఫీ చేసేందుకు ప్రయత్నించిన ఎన్నారై ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యానికి కూడా నోటిసులిస్తామని డీఎస్పీ ప్రసాదరావు చెప్పారు. విద్యార్థిని పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిని కాపాడటం చట్టరీత్యా నేరమేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment