ఫ్రెంచి సంస్థతో ఆర్టీసీ ఒప్పందం
ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం సాఫ్ట్‌వేర్ దిగుమతికి నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం సాఫ్ట్‌వేర్ ఏర్పాటు కోసం ఫ్రాన్స్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థతో టీఎస్‌ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ దేశ పర్యటనకు వెళ్లిన ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ మేరకు దీన్ని హైదరాబాద్ నగరంలో అమలు చేస్తారు. ఏ బస్సు ఎక్కడ ఉంది, ఎంత సేపట్లో నిర్ధారిత బస్టాప్‌నకు చేరుకుంటుంది.. తదితర వివరాలను సోలార్ డిస్‌ప్లే బోర్డుల ద్వారా ప్రయాణికులు తెలుసుకునే వెసులుబాటు ఈ సాఫ్ట్‌వేర్‌తో ఏర్పడుతుంది. పలు దేశాల్లో ఈ తరహా వ్యవస్థ ఇప్పటికే అమలులో ఉంది.
ఈ సాఫ్ట్‌వేర్‌లలో మెరుగైన వ్యవస్థ ఫ్రాన్స్‌లోని ఐఎక్స్‌ఎక్స్‌ఎన్‌ఏఎన్ యూ వద్ద ఉందని ఆర్టీసీ గుర్తించింది. గతంలో ఆ సంస్థ నిర్వాహకులు హైదరాబాద్‌కు ఓ సారి వచ్చి అధికారులకు సాఫ్ట్‌వేర్ గురించి వివరించారు. ఇప్పుడు జర్మ నీ, ఫ్రాన్స్ పర్యటనల్లో ఉన్న ఆర్టీసీ చైర్మన్, ఎండీలు ఆ సంస్థ ప్రతినిధులతో పారిస్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ముగిసిన పర్యటన..
అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండర్ టేకింగ్స్ (ఏఎస్‌ఆర్టీసీయూ) ఆధ్వర్యంలో దేశంలోని పలు రాష్ట్రాల ఆర్టీసీ ప్రతినిధుల బృందం గత నెల 25న జర్మనీ, ఫ్రాన్స్‌లలో పర్యటించింది. సెమినార్‌లు, సదస్సుల్లో పాల్గొనటంతోపాటు ఆయా దేశాల్లో అమలులో ఉన్న పద్ధతులను పరిశీలించింది. అక్టోబర్ ఒకటితో పర్యటన ముగిసింది. జర్మనీలో నిహ్యాన్నోవర్‌లో ఆటోమొబైల్ ఎక్స్‌పోలో వివిధ నమూనాల ఆధునిక బస్సులనూ వీరు పరిశీలించారు. ఆర్టీసీ సికింద్రాబాద్ ఆర్‌ఎం కొమురయ్య కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.