వీల్స్ ఆన్ దోస్తీ
⇒‘మెట్రో’కు ఆర్టీసీ సేవలు
⇒‘దౌడ్ రెడీ.. మినీ ఏదీ’ కథనంపై ఆర్టీసీ స్పందన
⇒రోడ్డెక్కనున్న 1700 బస్సులు
⇒నవంబర్ నాటికి అంతా సిద్ధం
⇒మెట్రో కారిడార్ల సమీప కాలనీల నుంచి రన్
⇒నాగోల్–అమీర్‌పేట్ మధ్య 760..
⇒మియాపూర్–అమీర్‌పేట్ మధ్య 940 బస్సులు
⇒మెట్రో సమాంతర మార్గాల్లో బస్సులు రద్దు
సిటీబ్యూరో: మెట్రో రైలు తొలిదశలో మియాపూర్–అమీర్‌పేట్, నాగోల్–అమీర్‌పేట్ మెట్రో కారిడార్లలో పరుగులు పెట్టనుంది. ఈ మార్గాలకు అనుబంధంగా ఉన్న కాలనీలకు 1700 బస్సులు నడపాలని గ్రేటర్ ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించింది. తొలిదశలో నవంబర్ నాటికి నాగోల్–అమీర్‌పేట్ కారిడార్‌లో 760 బస్సులు, మియాపూర్–అమీర్‌పేట్ కారిడార్‌లో మరో 940 బస్సులతో మెట్రో రైలు రాకపోకలకు అనుగుణంగా ఆర్టీసీ రవాణా సదుపాయాన్ని కల్పించనున్నారు. ప్రస్తుతం 3,550 బస్సులతో ప్రతి రోజు సుమారు 32 లక్షల మందికి ఆర్టీసీ సేవలందజేస్తోంది. నవంబర్ నుంచి మెట్రో రైలు అందుబాటులోకి వస్తే ప్రస్తుతమున్న ప్రయాణికుల్లో సుమారు 16 లక్షల మంది మెట్రో వైపు వెళ్లే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా గ్రేటర్ ఆర్టీసీ తాజాగా కార్యాచరణ చేపట్టింది. ఇప్పుడు ఉన్న బస్సుల్లో సగం మేర మెట్రో కారిడార్లకు అనుబంధంగా నడిపాలని యోచిస్తున్నారు.
సమాంతర మార్గాల్లో బస్సులు రద్దు..
మెట్రో రైళ్లు తిరిగే మార్గాల్లో ఇక సిటీ బస్సులు ఉండవు. ఉదాహరణకు ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వరకు ప్రతిరోజు 10 బస్సులు 50 ట్రిప్పులకు పైగా తిరుతున్నాయి. అలాగే మియాపూర్ నుంచి అమీర్‌పేట్ వరకు 22 బస్సులు వంద ట్రిప్పులకు పైగా తిరుగుతాయి. మెట్రో రైలు వెళ్లే మార్గంలోనే ఈ బస్సులు నడుస్తున్నందువల్ల వాటిని పూర్తిగా రద్దు చేసి ఫీడర్ రూట్లకు మళ్లిస్తారు. ఉప్పల్ నుంచి చెంగిచెర్ల, ఉప్పల్ నుంచి ఘట్కేసర్, ఉప్పల్–కోఠి, బోరబండ–అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ–అమీర్‌పేట్, శ్రీనగర్‌కాలనీ–అమీర్‌పేట్ వంటి మార్గాల్లో రేడియల్, ఫీడర్ మార్గాల్లో వీటిని నడుపుతారు.
మెట్రో స్టేషన్లకు సిటీ బస్సులు..
మియాపూర్–అమీర్‌పేట్ కారిడార్‌లోని మియాపూర్, జేఎన్‌టీయూ, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, బాలానగర్, భరత్‌నగర్, ఎర్రగడ్డ, ఈఎస్‌ఐ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లకు, అలాగే నాగోల్–అమీర్‌పేట్ కారిడార్‌లోని నాగోల్, ఉప్పల్ క్రాస్‌రోడ్స్, సర్వే ఆఫ్ ఇండియా, హబ్సిగూడ, తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్, పరేడ్‌గ్రౌండ్స్, పారెడైజ్, రసూల్‌పురా, ప్రకాశ్‌నగర్, బేగంపేట్, అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లకు ప్రయాణికులను చేరవేసే మార్గాల్లో సిటీ బస్సులు నడుస్తాయి. ఈ స్టేషన్లకు అనుబంధంగా ఉండే రేడియల్, ఫీడర్ రూట్‌లలో బస్సులను నడుపుతారు.
ఇక నో లాంగ్ రూట్..
మెట్రో అందుబాటులోకి రాగానే లాంగ్ రూట్ సర్వీసులకు ఆర్టీసీ స్వస్తి పలకనుంది. ఎల్‌బీనగర్ నుంచి మియాపూర్, పటాన్‌చెరు వంటి మార్గాల్లో నడిచే బస్సులను తొలగించి వాటిని అటు పటాన్‌చెరు–మియాపూర్ వరకు, ఇటు దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్ నుంచి నాగోల్ వరకు నడుపుతారు. మెట్రో లేని హయత్‌నగర్, సాగర్ రింగ్‌రోడ్డు, శివారు ప్రాంతాలు, ఔటర్ రింగ్‌రోడ్డును ఆనుకొని ఉన్న గ్రామాలకు సిటీ బస్సులను విస్తరించనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం ‘సాక్షి’తో చెప్పారు. అలాగే కోఠి నుంచి పటాన్‌చెరు వైపు వెళ్లే బస్సులను కోఠి–నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్–నాంపల్లి, కోఠి–అమీర్‌పేట్ వంటి మార్గాలకు పరిమితం చేస్తారు.
బస్సులకు పార్కింగ్ అవసరం..
ప్రస్తుతం రెండు కారిడార్లలో అమీర్‌పేట్/ఎస్‌ఆర్‌నగర్, మెట్టుగూడ స్టేషన్‌ల వద్ద మాత్రమే బస్సులు నిలిపేందుకు అనువైన స్థలం ఉంది. మిగతా స్టేషన్లలో పార్కింగ్ సదుపాయం లేదని, మెట్రో రైలుకు ప్రయాణికులను ఫీడ్ చేసే మార్గాల్లో బస్సులు నడపాలంటే అన్ని స్టేషన్‌లలో పార్కింగ్ అవసరమని ఈడీ పురుషోత్తం తెలిపారు. ఈ దిశగా హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఆర్టీసీ, మెట్రో సమన్వయంతో ప్రయాణికులకు సేవలందజేస్తాయని పేర్కొన్నారు.