రూ.వెయ్యి ఆదాయమా.. నో బస్ పాస్
రూ.వెయ్యి ఆదాయమా.. నో బస్ పాస్
Published Sat, Jul 15 2017 1:58 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM
- సిబ్బంది తల్లిదండ్రుల పాస్‌పై ఆర్టీసీ వింత నిబంధన
- ఇరవై ఏళ్ల నాటి నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చిన యాజమాన్యం
సాక్షి, హైదరాబాద్: ఇరవై ఏళ్ల క్రితం తీసు కున్న ఓ నిర్ణయాన్ని ఆర్టీసీ ఇప్పుడు అమల్లోకి తెచ్చింది. సిబ్బంది తల్లిదండ్రులు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు జారీ చేసే పాస్ వసతిని తొలగించింది. నెలకు రూ.1000, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉండే తల్లిదండ్రులకు ఇక నుంచి ఈ పాస్ వర్తించదని పేర్కొంటూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఏడాదికి మూడు పర్యాయాలు సిబ్బందికి ఆర్టీసీ పాసులు జారీ చేస్తుంది. ఇందులో ఒక పాసుకు నెల రోజుల గడువు, మిగతా వాటికి రెండు నెలలు చొప్పున గడువు ఉంటుంది. ఒక ప్రాంతానికి వెళ్లి వస్తే ఒక పాస్ గడువు తీరుతుంది. ఇలా మూడు ఉచిత పర్యటనలకు ఇవి వెసులుబాటు కల్పిస్తాయి.
1996 నాటి నిర్ణయం..
ఖర్చు తగ్గించుకునే చర్యల్లో భాగంగా 1996లో సిబ్బంది తల్లిదండ్రులు పాస్‌లపై నియంత్రణ విధించాలని ఆర్టీసీ నిర్ణయిం చింది. నెలకు రూ.వెయ్యి, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉండే తల్లిదండ్రులకు ఇది వర్తించదని ఆర్టీసీ బోర్డులో తీర్మానించింది. అయితే అది అమల్లోకి రాలేదు. తర్వాత దాన్ని అందరూ మరిచిపోయారు. రాయితీ లపై తాజాగా సమీక్షించిన యాజమాన్యం, 1996లో తీసుకున్న నిర్ణయాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించింది. అప్పుడు ఆదాయ పరిమితి రూ.వెయ్యి ఉండగా, దాన్ని యథాతథంగా అమలు చేయాలని నిర్ణయించింది. దీనిపై సిబ్బంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నెలకు రూ.వెయ్యి కంటే తక్కువ ఆదాయం ఎవరికి ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. పేరుకే ఆదాయ పరిమితి షరతు విధించారని, అంత తక్కువ ఆదాయం ఎవరికీ ఉండదు కాబట్టి బస్ పాస్ వసతి సిబ్బంది తల్లిదండ్రులంతా కోల్పోవాల్సిం దేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా సిబ్బంది తల్లిదండ్రుల నెల ఆదాయం రూ.వెయ్యికి తక్కువగా ఉన్నప్పటికీ, వారిని పోషించే కుమారులుంటే ఈ వసతి వర్తించదని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు.
ఆర్టీసీ నిర్ణయం సరికాదు..: ఎన్‌ఎంయూ
ఆర్టీసీ సిబ్బంది తల్లిదండ్రులకు ఇచ్చే బస్సు పాస్ వసతిని రద్దు చేయాలని నిర్ణయించటం సరికాదని ఆర్టీసీ ఎన్‌ఎంయూ పేర్కొంది. రూ.వెయ్యి కంటే వేతనం తక్కువ ఉండే అవకాశమే లేనందున అందరు కార్మికుల తల్లిదండ్రులు ఈ వెసులుబాటును కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని సంఘం నేతలు నాగేశ్వరరావు, కమాల్‌రెడ్డి, నరేందర్, మౌలానా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Advertisement