స్టూడెంట్ పాస్...ఇక ఈజీ | From July 10 to begin preparations in the bus passes | Sakshi
Sakshi News home page

స్టూడెంట్ పాస్...ఇక ఈజీ

Published Fri, Jun 3 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM

స్టూడెంట్ పాస్...ఇక ఈజీ

స్టూడెంట్ పాస్...ఇక ఈజీ

ఈ నెల 10 నుంచి ఆన్‌లైన్‌లో   బస్‌పాస్‌లకు సన్నాహాలు
విద్యాసంస్థలకు కోడ్ నెంబర్ తప్పనిసరి 
విధివిధానాలు విడుదల చేసిన  గ్రేటర్ ఆర్టీసీ

 
 బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులకో శుభవార్త. ఇకపై బస్‌పాస్‌ల కోసం గంటల తరబడి లైన్లలో నిల్చోవడం, రోజుల తరబడి వాటి కోసం వేచిచూడడం వంటి కష్టాలు ఉండవు. చేతిలో స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్, కంప్యూటర్, ట్యాబ్...దేన్నుంచైనా ఇక తేలిగ్గా బస్‌పాస్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈమేరకు ఆన్‌లైన్‌లో బస్‌పాస్ రెన్యూవల్ దరఖాస్తులు స్వీకరించేందుకు గ్రేటర్ ఆర్టీసీ కార్యాచరణ రూపొందించింది. ఈ నెల 10 నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తోంది.
 

సిటీబ్యూరో : ఈ నెల 10వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో  విద్యార్థుల బస్‌పాస్‌ల రెన్యూవల్ దరఖాస్తులను స్వీకరించేందుకు  గ్రేటర్ ఆర్టీసీ  కార్యాచరణ చేపట్టింది.  బస్‌పాస్ కౌంటర్‌ల వద్ద రద్దీ,  విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ  విద్యాసంవత్సరం నుంచి రెన్యూవల్  పాస్‌లకు  ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించే పద్ధతిని  ప్రవేశపెట్టారు. ఈ విధానంలో ప్రతి  విద్యాసంస్థకు  ఒక కోడ్ నెంబర్‌ను కేటాయిస్తారు. ఈ కోడ్ నెంబర్ ఆధారంగా విద్యార్థులకు ఉచిత, రాయితీ బస్‌పాస్‌లను అందజేస్తారు. రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్న  విద్యార్థులకు  ఒకటి రెండు రోజుల్లో  పాస్‌లు  చేతికి అందుతాయి.  బస్‌పాస్‌ల జారీలో  ఎలాంటి  అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకంగా అమలు చేసేందుకు అన్ని విద్యాసంస్థలు సకాలంలో కోడ్ నెంబర్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ సూచించింది. ఈ నెల  10వ తేదీ నుంచే విద్యార్థులకు బస్‌పాస్‌లు అందజేయనున్న దృష్ట్యా ఎలాంటి జాప్యానికి తావు లేకుండా కోడ్ నెంబర్  తీసుకోవాలని సూచించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పురుషోత్తమ్ శుక్రవారం వెల్లడించారు.

 
విద్యాసంస్థల కోడ్ ఫీజులు ఇలా...

ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలు, విద్యాసంస్థలు మినహాయించి అన్ని ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, వృత్తివిద్యాసంస్థలు, ఇతర సాంకేతిక విద్యాకోర్సులను అందజేసే సంస్థలు  తప్పనిసరిగా కోడ్ నెంబర్ తీసుకోవలసి ఉంటుంది. విద్యార్ధులకు కంఫ్యూటరైజ్డ్ బస్‌పాస్‌లు అందజేస్తున్న దృష్ట్యా నిర్వహణపరమైన ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని విద్యాసంస్థలు చెల్లించవలసి ఉంటుందని ఆర్టీసీ  పేర్కొం ది. కొత్తగా కోడ్ కోసం దరఖాస్తు చేసుకొనే ఇంజనీరింగ్, మెడికల్ విద్యాసంస్థలు కోడ్ కోసం  రూ.6000, రెన్యూవల్ కోసం రూ.5000 చొప్పున చెల్లించవలసి ఉంటుంది. రెగ్యులర్ డిగ్రీ, పీజీ కోర్సులను అందజేసే కళాశాలలు కొత్త కోడ్ నెంబర్ కోసం రూ.5000, పాత కోడ్ రెన్యూవల్ కోసం రూ.4000 చొప్పున చెల్లించాలి. జూనియర్ కాలేజీలు, డిప్లొమా, ఐటీఐ, ఒకేషనల్ కళాశాలలు కొత్త కోడ్ కోసం కోసం రూ. 4000, రెన్యూవల్ కోసం రూ.3000 చొప్పున, స్కూళ్లు కొత్త కోడ్ కోసం రూ.3000, రెన్యూవల్ కోసం రూ.2000 చొప్పున ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించే సమయంలో సదరు విద్యాసంస్థ పేర్లలో మార్పు, చిరునామాలో మార్పు, అందజేసే కోర్సులు, తదితర వివరాలను ఆర్టీసీకి  తెలియజేయాల్సి ఉంటుంది. సకాలంలో కోడ్ పొందిన విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులకు ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
 
 
4 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం...
గేటర్ హైదరాబాద్‌లో వేల సంఖ్యలో విద్యాసంస్థలు ఉన్నాయి. ఘట్‌కేసర్, కీసర, హయత్‌నగర్, బాచుపల్లి, చేవె ళ్ల తదితర ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు ప్రతి రోజు లక్షలాదిగా విద్యార్థులు రాకపోకలు సాగిస్తారు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు  సుమారు 4 లక్షల మంది విద్యార్థులు బస్‌పాస్‌లను వినియోగిస్తున్నట్లు అంచనా. వీరిలో  75 వేల వరకు ఉచిత పాస్‌లు ఉంటాయి. మిగతావి రాయితీపైన అందజేస్తున్నారు. విద్యార్థులు నెలవారీ పాస్‌లు మాత్రమే కాకుండా రూట్ పాస్‌లను పొందేందుకు కూడా అవకాశం ఉంది. ఇలా వివిధ రకాల పాస్‌లపై  ప్రతి నెలా రెన్యూవల్స్ కోసం బస్‌పాస్ కేంద్రాలకు వెళ్లడం వల్ల  తీవ్ర రద్దీ నెలకొంటుంది. సకాలంలో పాస్‌లు లభించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కొత్త పాస్‌లు కాకుండా పాత పాస్‌లను రెన్యూవల్ చేసేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రతి విద్యాసంస్థకు ఒక కోడ్ నెంబర్‌ను కేటాయించే పద్ధతి మొదటి నుంచి అమల్లో ఉన్నప్పటికీ  ప్రస్తుతం బస్‌పాస్‌ల పూర్తిస్థాయి కంఫ్యూటరీకరణ కోసం విద్యాసంస్థలు సకాలంలో కోడ్ రెన్యూవల్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని  అధికారులు సూచించారు. కొత్తగా దరఖాస్తు చేసుకొనేవాళ్లు కూడా ఆ ప్రక్రియను వెంటనే చేపట్టాలని  ఈడీ పురుషోత్తమ్  తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement