ఒకటి ఓకే!
కేశవాపూర్‌కు మల్లన్న సాగర్ నుంచి నీటి లింక్..
అసెంబ్లీలో సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో స్పష్టత..
మల్కాపూర్ రిజర్వాయర్ నిర్మాణంపైనే స్పష్టత కరువు..
సిటీబ్యూరో: ‘మహా’నగర దాహార్తిని తీర్చేందుకు నగర శివార్లలోని శామీర్‌పేట్ మండలం కేశవాపూర్‌లో నిర్మించతలపెట్టిన భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మాణంపై మరింత స్పష్టత వచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేశవాపూర్ రిజర్వాయర్‌కు మెదక్ జిల్లాలో నిర్మించతల పెట్టిన కొమురెల్లి మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించి ఈ రిజర్వాయర్‌లో నిల్వచేస్తామని ప్రకటించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో మహానగరానికి భవిష్యత్‌లో తీవ్ర నీటి ఎద్దడిసమస్య ఉండదని స్పష్టం చేయడం విశేషం. ఇక నల్లగొండ జిల్లా మల్కాపూర్ వద్ద నిర్మించతలపెట్టిన భారీ రిజర్వాయర్‌పై మాత్రం ఈసారి ఎలాంటి ప్రకటన చేయలేదు.
ప్రైవేటు సహకారంతో..!
కాగా ప్రైవేటు సంస్థలుతమ సొంత నిధులతో ఈ రిజర్వాయర్‌ను నిర్మించే (యాన్యుటీ బేసిస్) అంశంపై దృష్టిసారించాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ రిజర్వాయర్ నిర్మాణం కోసం వ్యాప్కోస్ సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేస్తున్న విషయం విదితమే. ఈ నివేదిక అందగానే ప్రైవేటు సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణకు టెండర్లు పిలవనున్నట్లు సమాచారం. కాగా నగర శివార్లలో నల్లగొండ జిల్లా దేవులమ్మనాగారం(మల్కాపూర్ పరిసరాలు)లోనూ భారీ రిజర్వాయర్‌ను నిర్మించాలనుకున్నప్పటికీ తొలివిడతగా కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ రిజర్వాయర్‌కు కరీంనగర్ జిల్లా కాళేశ్వరం-మిడ్‌మానేరు-కొమురెల్లిమల్లన్న సాగర్(మెదక్) మీదుగా 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించే అవకాశం ఉంది. నూతనంగా నిర్మించ తలపెట్టిన కొమురెల్లి మల్లన్న సాగర్(కుక్నూరుపల్లి-మెదక్)లో సుమారు 50 టీఎంసీల మేర గోదావరి జలాలను నింపనున్నట్లు సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో అక్కడి నుంచి 42 కి.మీ దూరంలో ఉన్న కేశవాపూర్ రిజర్వాయర్‌కు 25 కిలోమీటర్ల మేర గ్రావిటీ (భూమ్యాకర్షణశక్తి), మరో 17 కి.మీ మార్గంలో పంపింగ్ ద్వారా 20 టీఎంసీల నీటిని దశలవారీగా తరలించి నింపవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రూ.1660 కోట్లతో కేశవాపురం రిజర్వాయర్..
రంగారెడ్డిజిల్లా శామీర్‌పేట్ మండలం కేశవాపురం వద్ద రూ.1660 కోట్ల అంచనా వ్యయంతో 20 టీఎంసీల గోదావరి జలాల నిల్వకు అవసరమైన భారీ స్టోరేజి రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన 3600 ఎకరాల మేర ప్రభుత్వ, అటవీ భూమి అందుబాటులో ఉంది.
ఈ జలాశయాన్ని భూమట్టం నుంచి 60 మీటర్ల ఎత్తులో కాంక్రీట్ డ్యామ్ నిర్మించనున్నారు. ఈ జలాశయంలో గోదావరి మంచినీటి పథకం మొదటి, రెండవ, మూడవ దశల ద్వారా తరలించనున్న నీటితో ఈ జలాశయాన్ని నింపే అవకాశం ఉంటుందని, గోదావరి నదిలో సమృద్ధిగా వరద ప్రవాహం ఉన్నప్పుడే ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి జలకళ సంతరించుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. వర్షాకాలంలో గోదావరిలో వరద ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు ఈ రిజర్వాయర్‌కు 20 టీఎంసీల నీటిని తరలించి నిల్వచేస్తే ఏడాది పొడవునా మహానగర తాగునీటికి అవస్థలు ఉండవని చెబుతున్నారు.
మల్కాపూర్ రిజర్వాయర్‌పై స్పష్టత కరువు?
నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారం-మల్కాపూర్ సరిహద్దుల్లో రూ.1500 కోట్ల అంచనా వ్యయంతో భారీ స్టోరేజి రిజర్వాయర్‌ను నిర్మించాలని సర్కారు యోచిస్తోంది. అయితే ఈ నిర్మాణం విషయంపై స్పష్టత కరువైంది. ఈ ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన రెండువేల ఎకరాల మేర ప్రభుత్వ, అటవీ,అసైన్డ్‌భూములు అందుబాటులో ఉన్నాయి. ఈ జలాశయాన్ని కాంక్రీటుతో భూ మట్టానికి 70-80 మీటర్ల ఎత్తులో నిర్మించాలని యోచిస్తున్నారు. కానీ ఈ జలాశయానికి పాలమూరు ఎత్తిపోతల లేదా డిండి పథకం ద్వారా నీటి లింక్ ఏర్పాటు, నిధుల వ్యయం ఎవరు చేయాలన్న అంశంపై స్పష్టత కరువైంది. వర్షాకాలంలో నీటిలభ్యత అధికంగా ఉన్నప్పుడే ఈ భారీ జలాశయాన్ని పూర్తిస్థాయిలో నింపే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.