ఎమ్మెల్యే సోదరుడినంటూ వీరంగం
బస్సు డ్రైవర్‌పై దాడి
ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మెహిదీపట్నంలో ఘటన
గోల్కొండ: ‘ఎమ్మెల్యే సోదరుడిని.. నాకే సైడ్ ఇయ్యవా?’ అని దూషిస్తూ ఓ యువకుడు మరో యువకుడితో కలిసి ఆర్టీసీ డ్రైవర్‌ను చితకబాదారు. బస్సు అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. బస్సు డ్రైవర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..ఉప్పల్ డిపోకు చెందిన (రూట్ నం.113ఎం) బస్సు (ఏపీ29జెడ్-3680) మంగళవారం రాత్రి ఉప్పల్ నుంచి మెహిదీపట్నం వచ్చింది. మెహిదీపట్నం ప్రధాన బస్టాప్‌లోని పాయింట్‌లో ఆపడానికి డ్రైవర్ ముత్యంరెడ్డి పీవీ ఎక్స్‌ప్రెస్వే పిల్లర్ నంబర్ 22 వద్ద బస్సును యూటర్న్ తీసుకుంటున్నాడు.
అదే సమయంలో స్కూటీపై ఉన్న ఓ ఇద్దరు వ్యక్తులు యూటర్న్ తీసుకుంటున్నారు. పూర్తిగా బస్సు ముందుకు వచ్చి స్కూటీని ఆపారు. షాహెద్, జాహెద్ అనే ఈ ఇద్దరు బస్సులోకి చొచ్చుకెళ్లి డ్రైవర్‌ను దుర్భాషలాడుతూ పిడి గుద్దులు కురిపించారు. వారిలో ఒకరు ‘నేను ఎమ్మెల్యే సోదరుడిని’ అంటూ బెదిరించి బస్సు దిగిపోయాడు. బస్సు పాయింట్ వద్దకు వచ్చి ఆగగానే మళ్లీ బస్సులోకి వచ్చిన ఆ యువకులు డ్రైవర్ ముత్యంరెడ్డిని చితకబాదారు. ఈ క్రమంలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో డ్రైవర్ ముత్యంరెడ్డి హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్ ముందు బస్సు ఆపి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సంఘటన జరిగింది ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనిది అంటూ హుమాయూన్‌నగర్ పోలీసులు ముత్యంరెడ్డితో అన్నారు. దీంతో ముత్యంరెడ్డి బస్సు కండక్టర్ రామలింగంతో కలిసి ఆసిఫ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రైవర్‌పై దాడి చేసినవారు ఓ ఎమ్మెల్యే బంధువులు అని చెబుతుండడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరించారు. దాడిచేసిన షాహెద్, జాహెద్ లు ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ లో ఉండగా మరికొందరు అక్కడకు వచ్చి తమ వారినే ప్రశ్నిస్తారా? అంటూ ఇన్‌స్పెక్టర్‌తో వాగ్వాదానికి దిగి వీరంగం సృష్టించారు.
ఇదే సమయంలో ఏసీపీ డి.శ్రీనివాస్ అక్కడకు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. డ్రైవర్ ముత్యంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన షాహెద్, జాహెద్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరు పాతబస్తీలోని తలాబ్ కట్టకు చెందిన వారని, బట్టల వ్యాపారం చేస్తుంటారని తెలిసింది.