mla brother
-
ఎమ్మెల్యేలుగా గెలిచిన అన్నదమ్ములు వీరే..
సాక్షి, అమరావతి: ఈసారి శాసనసభలో ఎమ్మెల్యేలుగా గెలిచిన అన్నదమ్ములు సందడి చేయనున్నారు. వైఎస్సార్సీపీ తరఫున ఉత్తరాంధ్ర నుంచి ధర్మాన, బొత్స సోదరులు, రాయలసీమ నుంచి పెద్దిరెడ్డి, రాంపురం సోదరులు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించనుండటం ఆసక్తికరంగా మారింది. నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, ఆయన అన్నయ్య ధర్మాన కృష్ణదాస్ 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1989, 1999 ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 ఎన్నికల్లో ఆయన అన్నయ్య కృష్ణదాస్ రాజకీయాల్లోకి వచ్చారు. దాంతో 2004 ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి, కృష్ణదాస్ నరసన్నపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009 ఎన్నికల్లో కూడా అవే నియోజకవర్గాల నుంచి వారిద్దరూ గెలవడం విశేషం. మళ్లీ ఇప్పుడు 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఆ రెండు నియోజకవర్గాల నుంచే పోటీ చేసి విజయం సాధించారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి సోదరులు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి సోదరులు వైఎస్సార్సీపీ తరఫున అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 1989, 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన పుంగనూరు నుంచి, ఆయన సోదరుడు ద్వారకానాథ్‌రెడ్డి తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేలుగా.. ముగ్గురు అన్నదమ్ములు కాగా, ఈ ఎన్నికల్లో ముగ్గురు అన్నదమ్ములు ఎమ్మెల్యేలుగా గెలవడం విశేషం. రాంపురం సోదరులుగా గుర్తింపు పొందిన సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి, వెంకటరామిరెడ్డి వైఎస్సార్సీపీ తరఫున ఈ ఘనత సాధించారు. వారిలో సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి కర్నూలు జిల్లా ఆదోని, మంత్రాలయంల నుంచి, వెంకటరామిరెడ్డి అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడం విశేషం. సాయిప్రసాదరెడ్డి 2004లో కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యేగా గెలిచారు. బాలనాగిరెడ్డి కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి 2009లో టీడీపీ అభ్యర్థిగా, 2014లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. విజయనగరం జిల్లాలో బొత్స సోదరులు బొత్స సత్యనారాయణ 1999లో విజయనగరం జిల్లాలోని బొబ్బిలి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత 2004, 2009ల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009లోనే బొత్స తమ్ముడు బొత్స అప్పలనరసయ్య గజపతినగరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మళ్లీ ఇప్పుడు బొత్స సోదరులిద్దరూ వైఎస్సార్సీపీ తరఫున చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. -
అక్రమ ఇసుక రవాణా గుట్టురట్టు
* 20 ఓవర్ లోడ్ లారీలను పట్టుకున్న పోలీసులు * జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తమ్ముడి ఇసుక దందా * ఉచిత ఇసుక పాలసీకి తూట్లు పొడుస్తున్న టీడీపీ నేతలు తుళ్లూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసుకున్న ఉచిత ఇసుక పాలసీకి తెలుగు తమ్ముళ్లే తూట్లు పొడుస్తున్న విషయం తెలిసిందే. సీఆర్డీఏకు ఇసుక సరఫరా పేరుతో జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే తమ్ముడు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. జిల్లా ఎస్పీ అనేక సార్లు హెచ్చరించినా లెక్క చేయలేదు. పేరుకు సీఆర్డీఏకు సరఫరా చేస్తున్నట్లు చెబుతూ రోజుకు వందల లారీలను విజయవాడ, జగ్గయ్యపేట చెక్‌పోస్టు మీదుగా తెలంగాణకు తరలిస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు. సీఎం నివాసానికి దగ్గర్లోని లింగాయపాలెం వద్ద నుంచి వందల లారీలు తరలుతుండడంతో కొన్ని రోజులుగా అధికారులు సీరియస్‌గా హెచ్చరించినప్పటికీ పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, గృహ నిర్మాణదారులకు ఇసుక అందని పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో జిల్లా రూరల్ ఎస్పీ నారాయణనాయక్ ఆదేశాల మేరకు ఏకకాలంలో ఇసుక రేవులపై జిల్లా పోలీసు యంత్రాంగం దాడులు నిర్వహించింది. అమరావతి సీఐ మురళీకృష్ణ నేతృత్వంలో పోలీసు బలగాలు ఇసుక రేవులపై దాడులు చేశాయి. లింగాయపాలెం ఇసుక రేవుల్లో 12 ఇసుక లారీలు, రాయపూడిలో ఏడు, వెంకటపాలెంలో ఒకటి, మొత్తం 20 ఇసుక లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీకి ఇసుక మాఫీయా తూట్లు పొడవడం వల్లే ఈ దాడులు చేయాల్సి వచ్చిందని, రాజకీయాలకతీతంగా ప్రజలకు ఈ పాలసీ అందించే లక్ష్యంగా దాడులు చేశామని చెప్పారు. అక్రమంగా ఇసుక తోలుతున్న నిర్వాహకులపై నమోదు చేస్తామన్నారు. దాడుల్లో ఎస్సైలు సందీప్, షేక్ షఫీలతోపాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సూత్రధారులు తప్పించుకున్నారు.. ఇసుక దందాకు పాల్పడుతున్న ఎమ్మెల్యే తమ్ముడితోపాటు అనేక మంది అధికార పార్టీ నేతలు ఇసుక దందాకు సూత్రధారులుగా ఉన్నారు. దాడుల సమయంలో అక్కడ ఉన్న లారీడ్రైవర్లు, వారి అనుయాయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సూత్రధారులను అరెస్టు చేయలేదు. వీరి ద్వారా తీగలాగితే ఇసుక దందాకు పాల్పడుతున్న అసలు అక్రమ రవాణా దారులు బయటకు వస్తారు. ఇప్పటికైనా పోలీసులు చిత్తశుద్ధితో విచారణ జరిపి అసలు ఇసుక దందాకు పాల్పడిన వారిని అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది. -
ఎమ్మెల్యే సోదరుడినంటూ వీరంగం
బస్సు డ్రైవర్‌పై దాడి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మెహిదీపట్నంలో ఘటన గోల్కొండ: ‘ఎమ్మెల్యే సోదరుడిని.. నాకే సైడ్ ఇయ్యవా?’ అని దూషిస్తూ ఓ యువకుడు మరో యువకుడితో కలిసి ఆర్టీసీ డ్రైవర్‌ను చితకబాదారు. బస్సు అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. బస్సు డ్రైవర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..ఉప్పల్ డిపోకు చెందిన (రూట్ నం.113ఎం) బస్సు (ఏపీ29జెడ్-3680) మంగళవారం రాత్రి ఉప్పల్ నుంచి మెహిదీపట్నం వచ్చింది. మెహిదీపట్నం ప్రధాన బస్టాప్‌లోని పాయింట్లో ఆపడానికి డ్రైవర్ ముత్యంరెడ్డి పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 22 వద్ద బస్సును యూటర్న్ తీసుకుంటున్నాడు. అదే సమయంలో స్కూటీపై ఉన్న ఓ ఇద్దరు వ్యక్తులు యూటర్న్ తీసుకుంటున్నారు. పూర్తిగా బస్సు ముందుకు వచ్చి స్కూటీని ఆపారు. షాహెద్, జాహెద్ అనే ఈ ఇద్దరు బస్సులోకి చొచ్చుకెళ్లి డ్రైవర్‌ను దుర్భాషలాడుతూ పిడి గుద్దులు కురిపించారు. వారిలో ఒకరు ‘నేను ఎమ్మెల్యే సోదరుడిని’ అంటూ బెదిరించి బస్సు దిగిపోయాడు. బస్సు పాయింట్ వద్దకు వచ్చి ఆగగానే మళ్లీ బస్సులోకి వచ్చిన ఆ యువకులు డ్రైవర్ ముత్యంరెడ్డిని చితకబాదారు. ఈ క్రమంలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో డ్రైవర్ ముత్యంరెడ్డి హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్ ముందు బస్సు ఆపి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన జరిగింది ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనిది అంటూ హుమాయూన్‌నగర్ పోలీసులు ముత్యంరెడ్డితో అన్నారు. దీంతో ముత్యంరెడ్డి బస్సు కండక్టర్ రామలింగంతో కలిసి ఆసిఫ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రైవర్‌పై దాడి చేసినవారు ఓ ఎమ్మెల్యే బంధువులు అని చెబుతుండడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరించారు. దాడిచేసిన షాహెద్, జాహెద్ లు ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ లో ఉండగా మరికొందరు అక్కడకు వచ్చి తమ వారినే ప్రశ్నిస్తారా? అంటూ ఇన్స్పెక్టర్తో వాగ్వాదానికి దిగి వీరంగం సృష్టించారు. ఇదే సమయంలో ఏసీపీ డి.శ్రీనివాస్ అక్కడకు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. డ్రైవర్ ముత్యంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన షాహెద్, జాహెద్లను అదుపులోకి తీసుకున్నారు. వీరు పాతబస్తీలోని తలాబ్ కట్టకు చెందిన వారని, బట్టల వ్యాపారం చేస్తుంటారని తెలిసింది.