సాక్షి, అమరావతి: ఈసారి శాసనసభలో ఎమ్మెల్యేలుగా గెలిచిన అన్నదమ్ములు సందడి చేయనున్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున ఉత్తరాంధ్ర నుంచి ధర్మాన, బొత్స సోదరులు, రాయలసీమ నుంచి పెద్దిరెడ్డి, రాంపురం సోదరులు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించనుండటం ఆసక్తికరంగా మారింది. నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, ఆయన అన్నయ్య ధర్మాన కృష్ణదాస్ 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1989, 1999 ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 ఎన్నికల్లో ఆయన అన్నయ్య కృష్ణదాస్ రాజకీయాల్లోకి వచ్చారు. దాంతో 2004 ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి, కృష్ణదాస్ నరసన్నపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009 ఎన్నికల్లో కూడా అవే నియోజకవర్గాల నుంచి వారిద్దరూ గెలవడం విశేషం. మళ్లీ ఇప్పుడు 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఆ రెండు నియోజకవర్గాల నుంచే పోటీ చేసి విజయం సాధించారు.
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి సోదరులు
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి సోదరులు వైఎస్సార్‌సీపీ తరఫున అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 1989, 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన పుంగనూరు నుంచి, ఆయన సోదరుడు ద్వారకానాథ్‌రెడ్డి తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
ఎమ్మెల్యేలుగా.. ముగ్గురు అన్నదమ్ములు
కాగా, ఈ ఎన్నికల్లో ముగ్గురు అన్నదమ్ములు ఎమ్మెల్యేలుగా గెలవడం విశేషం. రాంపురం సోదరులుగా గుర్తింపు పొందిన సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి, వెంకటరామిరెడ్డి వైఎస్సార్‌సీపీ తరఫున ఈ ఘనత సాధించారు. వారిలో సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి కర్నూలు జిల్లా ఆదోని, మంత్రాలయంల నుంచి, వెంకటరామిరెడ్డి అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడం విశేషం. సాయిప్రసాదరెడ్డి 2004లో కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యేగా గెలిచారు. బాలనాగిరెడ్డి కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి 2009లో టీడీపీ అభ్యర్థిగా, 2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికయ్యారు.
విజయనగరం జిల్లాలో బొత్స సోదరులు
బొత్స సత్యనారాయణ 1999లో విజయనగరం జిల్లాలోని బొబ్బిలి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత 2004, 2009ల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009లోనే బొత్స తమ్ముడు బొత్స అప్పలనరసయ్య గజపతినగరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మళ్లీ ఇప్పుడు బొత్స సోదరులిద్దరూ వైఎస్సార్‌సీపీ తరఫున చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment