
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో విజయం వైఎస్సార్‌సీపీదేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఉదారంగా ఆలోచించి పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తెచ్చారని.. దాని ప్రకారం ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు ఎక్కువగా నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు.
ఎన్నిక ఏకగ్రీవమైన పంచాయతీలకు రెండు వేల వరకూ జనాభా ఉంటే రూ.5 లక్షలు, ఐదు వేల జనాభా ఉంటే రూ.10 లక్షలు, 10 వేల పైన జనాభా ఉంటే రూ.15 లక్షలు, ఆ పైన జనాభాను బట్టి రూ.20 లక్షల చొప్పున ఇవ్వడం జరుగుతోందని చెప్పారు. ఈ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నాయని, గ్రామీణ ప్రజలంతా ఏకమై ఏకగ్రీవం చేసుకోవాలన్నారు. ఈ సారి చట్టంలో మార్పులు చేసి ధనం, మద్యం, డబ్బు, ప్రలోభాలతో ఎవరైనా ఎన్నికైతే అనర్హుల్ని చేయడమే కాకుండా రెండేళ్ల వరకూ శిక్ష పడేలా చట్టంలో మార్పులు తెచ్చామని పేర్కొన్నారు. ఈ మార్పులన్నీ ప్రజలు గమనించి శాంతియుతంగా ఎన్నికలకు వెళదామనే ఆలోచన చేయాలన్నారు.
కేంద్రానికి లేఖ రాస్తున్నాం
సుప్రీం కోర్టు తీర్పును పూర్తిగా స్వాగతిస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం మేరకు కేంద్రానికి లేఖ రాస్తున్నామని చెప్పారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ తరువాత కొంత అబ్జర్వేషన్ చేయాల్సిన పరిస్ధితి ఉందని, ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ఏ విధంగా చేయాలి, ఎన్నికలు ఎలా నిర్వహించాలి అనే విషయాలను లేఖ ద్వారా కేంద్రానికి తెలియజేస్తామన్నారు. కేంద్రం నుంచి వచ్చిన సమాధానం మేరకు ముందుకెళతామని తెలిపారు. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్నదే ప్రభుత్వ తాపత్రయమని, ప్రజల భద్రత తమకు ముఖ్యమని పేర్కొన్నారు. ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment