అక్రమ ఇసుక రవాణా గుట్టురట్టు
అక్రమ ఇసుక రవాణా గుట్టురట్టు
Published Sat, Oct 22 2016 5:34 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
* 20 ఓవర్ లోడ్ లారీలను పట్టుకున్న పోలీసులు
* జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తమ్ముడి ఇసుక దందా
* ఉచిత ఇసుక పాలసీకి తూట్లు పొడుస్తున్న టీడీపీ నేతలు
తుళ్లూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసుకున్న ఉచిత ఇసుక పాలసీకి తెలుగు తమ్ముళ్లే తూట్లు పొడుస్తున్న విషయం తెలిసిందే. సీఆర్‌డీఏకు ఇసుక సరఫరా పేరుతో జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే తమ్ముడు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. జిల్లా ఎస్పీ అనేక సార్లు హెచ్చరించినా లెక్క చేయలేదు. పేరుకు సీఆర్‌డీఏకు సరఫరా చేస్తున్నట్లు చెబుతూ రోజుకు వందల లారీలను విజయవాడ, జగ్గయ్యపేట చెక్‌పోస్టు మీదుగా తెలంగాణకు తరలిస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు. సీఎం నివాసానికి దగ్గర్లోని లింగాయపాలెం వద్ద నుంచి వందల లారీలు తరలుతుండడంతో కొన్ని రోజులుగా అధికారులు సీరియస్‌గా హెచ్చరించినప్పటికీ పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, గృహ నిర్మాణదారులకు ఇసుక అందని పరిస్థితి తలెత్తింది.
ఈ నేపథ్యంలో జిల్లా రూరల్ ఎస్పీ నారాయణనాయక్ ఆదేశాల మేరకు ఏకకాలంలో ఇసుక రేవులపై జిల్లా పోలీసు యంత్రాంగం దాడులు నిర్వహించింది. అమరావతి సీఐ మురళీకృష్ణ నేతృత్వంలో పోలీసు బలగాలు ఇసుక రేవులపై దాడులు చేశాయి. లింగాయపాలెం ఇసుక రేవుల్లో 12 ఇసుక లారీలు, రాయపూడిలో ఏడు, వెంకటపాలెంలో ఒకటి, మొత్తం 20 ఇసుక లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీకి ఇసుక మాఫీయా తూట్లు పొడవడం వల్లే ఈ దాడులు చేయాల్సి వచ్చిందని, రాజకీయాలకతీతంగా ప్రజలకు ఈ పాలసీ అందించే లక్ష్యంగా దాడులు చేశామని చెప్పారు. అక్రమంగా ఇసుక తోలుతున్న నిర్వాహకులపై నమోదు చేస్తామన్నారు. దాడుల్లో ఎస్సైలు సందీప్, షేక్ షఫీలతోపాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సూత్రధారులు తప్పించుకున్నారు..
ఇసుక దందాకు పాల్పడుతున్న ఎమ్మెల్యే తమ్ముడితోపాటు అనేక మంది అధికార పార్టీ నేతలు ఇసుక దందాకు సూత్రధారులుగా ఉన్నారు. దాడుల సమయంలో అక్కడ ఉన్న లారీడ్రైవర్లు, వారి అనుయాయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సూత్రధారులను అరెస్టు చేయలేదు. వీరి ద్వారా తీగలాగితే ఇసుక దందాకు పాల్పడుతున్న అసలు అక్రమ రవాణా దారులు బయటకు వస్తారు. ఇప్పటికైనా పోలీసులు చిత్తశుద్ధితో విచారణ జరిపి అసలు ఇసుక దందాకు పాల్పడిన వారిని అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది.
Advertisement
Advertisement