తిరగబడిన బతుకుబండి | sakshi exclusive on currency demonetization problems in telangana | Sakshi
Sakshi News home page

తిరగబడిన బతుకుబండి

Published Fri, Dec 30 2016 2:21 AM | Last Updated on Sat, Sep 22 2018 7:57 PM

తిరగబడిన బతుకుబండి - Sakshi

తిరగబడిన బతుకుబండి

50 రోజులైనా తీరని కరెన్సీ వెతలు
చితికిపోతున్న చిరు వ్యాపారాలు..
చేతిలో పెట్టుబడులు లేక రైతుల అవస్థలు
అనేక రంగాలు అతలాకుతలం..
జౌళి, జువెలరీ, స్థిరాస్తి.. అన్నీ నేలచూపులే

అప్పు పుట్టక.. వైద్యం అందక..
భార్యను కోల్పోయిన భర్త ఒకరు..
ఆరుగాలం చెమటోడ్చి పండించిన
పంట కష్టాన్ని బ్యాంకు నుంచి
విడిపించుకోలేక తల పట్టుకున్న రైతు ఒకరు..
గిరాకీ మొత్తం తగ్గిపోయింది..
కుటుంబానికి పూట కూడ గడవడం లేదంటూ కళ్లనిండా నీళ్లు నింపుకున్న చిరు వ్యాపారి ఒకరు..
పనుల్లేవ్‌.. పైసల్లేవ్‌.. గోసగోస అయింతందంటూ గోడు వెల్లబోసుకున్న కూలీ ఒకరు..
కాలేజీలో ఫీజు కూడా కట్టలేకపోతున్నానంటూ బాధపడుతున్న విద్యార్థి ఒకరు..


ఇలా ఒక్కరా.. ఇద్దరా.. ఎవరిని కదిపినా కరెన్సీ వెతలే! ఒకటి కాదు.. రెండు కాదు.. యాభై రోజులుగా ఇదే యాతన!! రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద కూలీ నుంచి అంతో ఇంతో జీతంతో కుటుంబాన్ని నడుపుతున్న వేతనజీవి దాకా అందరూ బాధితులే! అటు వ్యాపారాలు కుదేలై ఆర్థికరంగం.. బతుకుచక్రం తిరగబడి జీవనరంగం గాడి తప్పాయి. నవంబర్‌ 8 అర్ధరాత్రి పిడుగులా పడిన ‘కరెన్సీ రద్దు’ నిర్ణయం బడుగుజీవితోపాటు అన్ని రంగాలపై పెను ప్రభావం చూపింది. నేటికి 50 రోజులు గడిచిపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన గడువూ ముగిసింది. కష్టాలు మాత్రం ఎప్పట్లాగే కొనసాగుతున్నాయి. జనం కష్టాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘సాక్షి’పరిశీలన జరిపింది. సామాన్యుల కష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదని ఇందులో స్పష్టమైంది..     

పెద్ద నోట్ల రద్దు దెబ్బకు 50 రోజులుగా లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. బతుకు బండి లాగలేక కుదేలవుతున్నాయి. ఉపాధి కరువై..బతుకు బరువై దిగాలుగా కాలం వెళ్లదీస్తున్నాయి. రెక్కాడితే డొక్కాడని నిరుపేద కూలీల దగ్గరి నుంచి ఆటో వాలా, టిఫిన్‌ సెంటర్, చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, రైతులు.. ఇలా ఎవరిని కదిలించినా గత 50 రోజులుగా పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతున్నారు. తినే తిండికి కూడా తిప్పలవుతోందంటూ కన్నీరు పెడుతున్నారు. సంక్రాంతి పండుగెలా గడుస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసి 50 రోజులు పూర్తవడంతో కూలీల నుంచి చిరు వ్యాపారుల దాకా తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఆ వివరాలివీ.. – సాక్షి నెట్‌వర్క్‌


అప్పు పుట్టక నా భార్య ప్రాణం పోయింది
నా భార్య పేరు వెంకటమ్మ. మాకు 20 ఏళ్ల క్రితం పెళ్లయింది. వ్యవసాయం మీదే ఆధారపడ్డం. ఈ మధ్య వెంకటమ్మకు జబ్బు చేసింది. నెలకింద దేవరకొండ ఆస్పత్రిలో చేర్పించిన. ఎంతకూ తగ్గలే.. డాక్టర్లు ఆపరేషన్‌ చేయాలన్నరు. రూ.4 లక్షలు అయితయని చెప్పిండ్రు. అప్పటికే నోట్లు రద్దయినై. ఎక్కడ తిరిగినా డబ్బు దొరకలే. ఎవల్నడిగినా అప్పు పుట్టలే. చివరకు ఉన్న మూడున్నర ఎకరాల పొలాన్ని బేరం పెట్టిన. ఎకరం నాలుగు లక్షలు పలికే భూమి.. రెండు లక్షలకే అమ్ముతనన్న. ఎవరూ ముందుకు రాలేదు. నా భార్య ఆరోగ్యం విషమించింది. ఉత్త చేతులతోనే హైదరాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రికి తీసుకుపోయిన. చేర్పించిన రోజే కన్నుమూసింది. నా బిడ్డ తల్లిలేనిదయింది. – సిలమల బలరాం, గన్నెర్లపల్లి, నల్లగొండ జిల్లా

చిల్లర లేదంటే వెళ్లిపోతున్నరు..
30 ఏళ్లుగా హోటల్‌ నడుపుతున్న. రెండు నెలలుగా గిరాకీ సగానికి తగ్గిపోయింది. రెండు ప్లేట్లు ఇడ్లీ తిని, టీ తాగి రెండు వేల నోటిస్తే చిల్లర ఎక్కడ నుంచి తేవాలే. ‘చిల్లర ఉందా..’ అని ముందే అడిగితే టిఫిన్‌ చేయకుండానే వెళ్లి పోతున్నరు. స్కూల్‌ ముందు మా హోటల్‌ ఉంది. పిల్లలు పది రూపాయలు తీసుకొని వచ్చి టిఫిన్‌ తీసుకెళ్లేవారు. నోట్లు బంద్‌ అయినప్పటి నుంచి స్కూల్‌ పిల్లలు రావట్లేదు. లాభం రాకున్నా మరో పని చేయలేక హోటల్‌ నడుతున్నా.. – సూరిబాబు, హోటల్‌ యజమాని, జేకే కాలనీ, ఇల్లెందు

పూట గడవడమే కష్టం
వ్యాపారం నడుస్తలేదు.. నోట్లు రద్దు చేసినప్పటి నుంచి సచ్చిపోతున్నం. పూట గడవడమే కష్టంగా ఉంది. కూరగాయలు అమ్ముకుంటేనే కుటుంబం గడుస్తది. రెండు నెలల నుంచి బేరాల్లేవు. మొదట్లో అందరూ పాత రూ.500, రూ.1,000 నోట్లే ఇచ్చారు. వాటికి చిల్లర ఇవ్వలేక బేరాలు పోగొట్టుకున్నాం. పాత నోట్లు తీసుకున్నా.. బ్యాంకులో వేసేందుకు రోజంతా నిలబడాలె. అట్లా కూడా బేరాలు పోయినయి. కొన్ని రోజుల నుంచి 50, 100 రూపాయల కూరగాయలు కొన్నా రెండు వేల నోటు ఇస్తున్నరు. చిల్లర ఎక్కడి నుంచి తేవాలె.
– ఎస్‌కే ముంతాజ్, కూరగాయల వ్యాపారి, సత్తుపల్లి

బాగా తక్లీబ్‌ అయితంది..
బార్‌ పక్కనే పాన్‌షాప్‌ నడిపిస్తున్న.. కిరాయి ఇంట్లో ఉంటం. నోట్లు రద్దయినకాడ్నుంచి గిరాకీ తగ్గింది. పాన్‌ షాపు కిరాయి, ఇల్లు కిరాయి కట్టాలె. తిండికి ఎల్లాలె. నా దగ్గర అంతా ఐదారు రూపాయల పాన్లు, సిగరెట్లు, సోంపులు అమ్ముతయ్‌. చిల్లర ఇయ్యలేక గిరాకీ పోతోంది. మేం సామాన్లు కొనుక్కునే కాడ పాత నోట్లు తీసుకోరాయే. మొన్ననే బ్యాంకు ఖాతా ఓపెన్‌ చేసి.. వచ్చిన చిల్లర అందులో వేసిన. మళ్లీ తీసుకోవడానికి లైన్ల నిలబడినా ఇవ్వరాయె. ఇటు గిరాకీ పోవట్టె.. పైసలు రాకపాయే.. పైసల్లేక సామాను తెచ్చుకునేదానికి లేదాయె. ‘‘బడే నోట్‌ కే బారే మే అబీ లాభ్‌ కిస్కా హై.. లుక్సాన్‌ కిస్కా హై మాలూమ్‌ నహీ.. మగర్‌ బీచ్‌మే హమ్‌కో తక్లీబ్‌ హోరా  (పెద్ద నోట్ల రద్దుతో ఎవరికి లాభమో.. ఎవరికి నష్టమో తెలియదు కానీ.. మధ్యలో మాకు ఇబ్బందులు తప్పడం లేదు).’’
– కత్కర్‌ దిలీప్, పాన్‌షాప్‌ నిర్వాహకుడు, కరీంనగర్‌

ఎవుసానికి తిప్పలైతంది
నోట్లు రద్దు చేసినంక ఎవుసానికి మస్తు కష్టమొచ్చింది. 50 రోజుల నుంచి పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చెప్పుకుంటే ఏడుపొస్తుంది. వానాకాలంలో ఎకరం మక్క, మరో ఎకరంలో వరి వేసిన. మక్కలు దెబ్బతిన్నయ్, వరి కూడా సరిగ రాలే. పంటలు అమ్మితే చెక్కు ఇచ్చిండ్రు. దాన్ని పట్టుకుని బ్యాంకు చుట్టూ తిరిగినా.. రోజుకు రూ.2 వేలే ఇస్తున్నరు. ఇన్ని రోజుల నుంచి తిరిగితే రూ.8 వేలు దొరికినయ్‌. ఆ పైసలు వానాకాలంలో పనిచేసిన కూలీలకే సరిపోయినయ్‌. దాంతోటి చేతిల చిల్లిగవ్వ లేక వరి నాటు ఆలస్యంగా వేసిన. ఇంకా కూరగాయల తోట పెట్టలేదు. ఎరువులు, విత్తనాలు ఉద్దెర తెచ్చినా.. కూలీలకు డబ్బులు ఇవ్వడం ఇబ్బంది అవుతోంది.
– రైతు శిల్వరాజ్, సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్‌

పండుగెట్ల గడిచేది?
నోట్లు బంద్‌ కావడంతో ఇంట్లో అవసరాలకు పరేషాన్‌ అవుతోంది. నా భర్త ఆటో నడుపుతడు. ఇప్పుడు గిరాకీ లేక ఇంటికాడే ఉండాల్సి వస్తోంది. కూరగాయలు, బియ్యం, పప్పులు, ఉప్పు, బట్టలు, పుస్తకాలు, ఇంటి కిరాయి, కరెంటు బిల్లు ఇట్లా చెప్పుకుంట పోతే పైసల కోసం రోజూ ఎదురుచూడక తప్పడం లేదు. సంక్రాంతి పండుగ వస్తోంది. ఇది పైసల్లేని పండుగగా మారుతుందేమో అనిపిస్తోంది. బ్యాంకులో రోజంతా నిల్చున్నా 2 వేల నోటు ఇస్తున్నరు. దానికి చిల్లర దొరుకుతలేదు. ఇలాగైతే ఎట్లా?
– గోపు విజయ, శ్రీభక్త మార్కండేయ వీధి, మహబూబాబాద్‌

చెల్లి పెళ్లి వాయిదా వేశా
నెల రోజుల కింద మా చెల్లెలు పెళ్లి జరగాల్సి ఉన్నా.. నోట్ల రద్దు కారణంగా అప్పు పుట్టక వాయిదా వేయాల్సి వచ్చింది. వ్యాపారం కూడా బాగా పడిపోయింది. ఇంటి కిరాయి కట్టేటన్ని డబ్బులు కూడా రావడం లేదు. పిల్లలకు ఫీజులు, ఇంట్లో తిండి, ఇతర ఖర్చుల కోసం కూడా తిప్పలవుతోంది. రెండు నెలలుగా అప్పులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఈ బాధలు తప్పేదెన్నడు?
– రాజు, పండ్ల వ్యాపారి, హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌

వంద సుత మిగుల్తలేవ్‌..
నోట్లు రద్దు చేసిన కాన్నుంచి జేబుల డబ్బులు ఉంటలేవ్‌. చిల్లర డబ్బుల్లే ఆటో ఎక్కేటోళ్లు తగ్గిండ్లు. అడ్డా మీద ఆటోలు పెట్టుకుని గంటల కొద్ది ఎదురుచూసుడైతంది. నోట్లు రద్దు కాకముందు దినాం 300 రూపాయలు మిగిలేవి. ఇప్పుడు రోజుకు వంద కూడా వస్తలేవు.
– బోగే కుమార్, ఆటోడ్రైవర్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి

గిరాకీలు పడిపోయినయ్‌
మాది ఊట్కూర్‌. రోజూ బైక్‌పై నారాయణపేటకు వచ్చి టీ స్టాల్‌ను నడుపుకుంటా. పెట్రోల్‌కే 50 రూపాయలు ఖర్చయితది. నోట్ల రద్దుతో గిరాకీ పడిపోయింది. చాయ్‌ తాగిన వారు రూ.2 వేల నోటు చూపిస్తున్నారు. చిల్లర లేదంటే ఉద్దెర పెడుతున్నారు. చిల్లర కోసం అవస్థ పడుతున్నాం. ప్రభుత్వం వెంటనే చిల్లర వ్యాపారస్తులకు కావాల్సిన చిల్లరను బ్యాంకుల ద్వారా అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి..
– ఊట్కూర్‌ శంకర్, నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లా

పాల డబ్బులు ఎవరూ ఇస్తలేరు
నాకు ఎకరం పొలం, 10 గేదెలున్నాయి. రోజూ 25 లీటర్ల పాలను తాండూరులో జనానికి అమ్ముతుంటా. పెద్ద నోట్లను రద్దు చేసినంక నెలనెలా ఇవ్వాల్సిన పాల బిల్లులు ఎవరూ ఇస్తలేరు. నవంబర్‌ నెలలో పోసిన పాల పైసలల్ల సగం కూడా రాలె. దాంతోటి చిట్టీ పైసలు, పిల్లల ఫీజులు, ఆటో కిరాయికి కూడ ఇబ్బంది వచ్చింది. ఇంట్లో అవసరాలకు కూడా చేతులో పైసలు లేకుంట పొయినయ్‌. ఇట్లనే ఉంటే శానా పరేషాన్‌ గావాల్సి వస్తది.  – దోర్నాల వెంకటేశం, వికారాబాద్‌ జిల్లా విశ్వనాథపూర్‌

పైసలడిగితే నాయిన కంట్లో నీళ్లు తిరుగుతున్నయ్‌..
నర్సాపూర్‌లోని కాలేజీలో డిగ్రీ ఫైనలియర్‌ చదుతున్నా. మా ఊరు మానెపల్లి నుంచి మంగళపర్తి దాకా ఆటోలో.. అక్కడి నుంచి బస్సులో నర్సాపూర్‌కు వెళ్తా. మా నాన్న ఆంజనేయులు వ్యవసాయం చేస్తారు. పంట ఖర్చులకు, నా ఆటో ఖర్చులు, బస్‌పాస్, ఇంటి ఖర్చుల కోసం ఇంట్లో 40 వేలు పెట్టిండు. నోట్లు రద్దు చేయంగనే ఆ పైసలు తీసుకుపోయి వెల్దుర్తిలోని ఏపీజీవీబీలో జమ చేసిండు. ఇప్పుడు 20 కిలోమీటర్ల దూరమున్న వెల్దుర్తికి పోయి బ్యాంకు క్యూలైన్‌న్‌లో నిలబడినా.. 2 వేలే ఇస్తున్నరు. ఆ పైసలు సరిపోక కష్టమైతోంది. నాకు ఆటో కిరాయి, బస్‌పాస్, చిల్లర ఖర్చులకు పైసల్లేవు. ఇంటి ఖర్చులకు కూడా బాధయితున్నది. డబ్బులు ఉండి కూడా మరొకరి దగ్గర చేయి చాపాల్సి వస్తోంది. పైసలు కావాలని అడిగినప్పుడు మా నాయన కళ్లల్ల నీళ్లు తిరుగుతున్నయ్‌..
– ఆకుల సంతోషి, డిగ్రీ విద్యార్థిని, మెదక్‌ జిల్లా మానెపల్లి

అప్పడిగితే.. ఏటీఎం కార్డు ఇస్తున్నారు!
‘‘కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నా. నా జీతం మీదనే తల్లిదండ్రులను, భార్యా పిల్లలు మొత్తం కుటుంబాన్ని నెట్టుకురావాలి. నోట్ల రద్దుతో మా కుటుంబం పరిస్థితి పరేషానైంది. పొయిన నెల జీతం రాలేదు. నేను కట్టాల్సిన వారెవరికీ చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. వాళ్లు సతాయిస్తున్నారు. ఇగో వస్తయ్‌.. అగో వస్తయ్‌.. అని సర్ది చెప్తున్నా. బయట అప్పు తెచ్చుకుని ఇంట్లోకి సామాను తెచ్చిన. నా కొడుకును హాస్పిటల్‌లో చూపించుదామన్నా పైసల్లేవు. ఇప్పటికే మా దోస్త్‌ దగ్గర ఐదు వేలు అప్పు తీసుకున్నా.. మళ్లీ అడిగితే.. ఇదిగో నా ఏటీఎం కార్డు. పోయి ఏటీఎం సెంటర్‌ కాడ నిల్చుని తీసుకురా అంటుండు..’’
– మధుసూదన్‌రెడ్డి, కాంట్రాక్టు ఉద్యోగి, సిద్దిపేట జిల్లా

పుస్తకాలకూ డబ్బులు లేవు
అవసరం కోసం డబ్బు అందక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నం. చదువుకునేందుకు పుస్తకాలు, ఇతర ఖర్చులకు డబ్బు కావాలి. ఇంట్లో అమ్మనాన్నలను అడిగినా ఇచ్చే పరిస్థితి లేదు. 50 రోజులుగా ఇబ్బందులు పడుతున్నాం. బ్యాంకులకు వెళితే క్యూలైన్లు ఉంటున్నాయి. డబ్బులు దొరకడం లేదు. ఏటీంఎంలు పనిచేయడం లేదు. పుట్టినరోజుకు కొత్త డ్రెస్సు కొనుక్కోలేక పాతవే వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. – నారగోని స్రవంతి, విద్యార్థిని, నకిరేకల్‌


కూలీ దొరుకుత లేదు
నేను అడ్డా కూలిని. నా భార్య బీడీలు చేస్తుంది. ముగ్గురు పిల్లలున్నరు. నోట్లు రద్దయినప్పటి నుంచి అడ్డా మీద కూలి దొరుకుత లేదు. పెద్ద నోట్లు చెల్లక.. చిన్న నోట్లు దొరక్క పనులు చేసేటోళ్లు ఆపేసిండ్రు. వారంలో ఒకటి రెండు రోజులే పని ఉంటోంది. ఆ కూలి పైసలు పొట్టకే చాలట్లేదు. నా భార్య బీడీల పైసలూ వస్తలేవు. వాటిని బ్యాంకు ఖాతాల వేస్తరట. పనిలేక.. పైసల్లేక గోస అయితుంది. ఏ రోజు ఎట్ల ఉంటదోనని భయంగా ఉంది.  – గడప దయాకర్, కూలీ, సిరిసిల్ల

వ్యాపారం పడిపోయింది
కొబ్బరి కాయల ధరలు.. వ్యాపారం సగానికి పైగా పడిపోయాయి. గత 40 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదు. జనం పైసల్లేక పూజలకు, దేవుళ్లకు కొబ్బరికాయలు కొట్టడం తగ్గించినరేమో అనిపిస్తోంది. గతంలో రెండు రోజులకో లారీ కొబ్బరికాయలు అమ్ముడు పోయేవి. నోట్ల రద్దుతో వారం మొత్తంలో కూడా ఒక లారీ కొబ్బరికాయలు అమ్మలేకపోతున్నం. క్యాష్‌ లెస్‌ లావాదేవీలు చేసే పరిస్థితీ లేదు. 50 రోజులు గడిచినా ఇంకా పరిస్థితి నుంచి తేరుకోలేకపోతున్నాం.          – శంకర్, కొబ్బరికాయల హోల్‌సేల్‌ వ్యాపారి, వరంగల్‌

దక్షిణ తరువాత ఇస్తామంటున్నారు
నోట్లు రద్దుతో మా పూజారులకూ కష్టాలు వచ్చాయి. గుడికి వచ్చేవారు కనీసం దక్షిణ కూడా వేయడం లేదు. నెలలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ప్రారంభోత్సవాలు, పూజలు కలిపి 20 వరకు చేస్తా. నవంబర్‌ 9 నుంచి ఇప్పటి వరకు 10 దాకా పెళ్లిళ్లు చేశాను. కానీ డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు. పెళ్లికి డబ్బులు సరిపోలేదు.. తరువాత ఇస్తామంటున్నారు. చిన్నచిన్న ఖర్చులకు కూడా బకాయిలు పెడుతున్నారు. నోట్ల వ్యవహారం తేలేదెన్నడో.. నా డబ్బు నాచేతికి వచ్చేదెన్నడో..!             – శ్రీకాంత్‌ శర్మ, అయ్యప్ప దేవాలయం పూజారి, నాగనూల్, నాగర్‌కర్నూల్‌ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement