‘నాన్ బెయిలబుల్’గా పరిగణించడం లేదేం?
- ఇసుక అక్రమ తవ్వకాలపై సర్కార్‌కు హైకోర్టు ప్రశ్న
- పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాను విచారణార్హమైన(కాగ్నిజబుల్), నాన్ బెయిలబుల్ నేరాలుగా ఎందుకు పరిగణించడం లేదో వివరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే ఇసుక అక్రమ తవ్వకాలను, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో కూడా వివరించాలని స్పష్టం చేసింది. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని రెవెన్యూ, గనుల శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ‘ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా మానవాళి మనుగడనే భయపెట్టే విధంగా ఉంటున్నాయి. నదులు ఎండిపోయి ప్రజలు నీళ్ల కోసం గగ్గోలు పెడుతున్నారు.
కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ నేరాల కింద ఇసుక అక్రమ తవ్వకాలను, రవాణాను పరిగణించి కఠిన చర్యలకు ఉపక్రమించకపోతే, జీవ సమతుల్యతకు, పర్యావరణానికి ముప్పు తప్పదు.’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇసుక రవాణా చేస్తున్న తమ వాహనాలను అధికారులు సీజ్ చేశారని, ఈ విషయంలో వారు చట్టం నిర్ధేశించిన ప్రక్రియను అనుసరించలేదని, తమ వాహనాలను విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మెదక్ జిల్లాకు చెందిన బండారి పాపిరెడ్డి మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి విచారించారు. వాదనలు విన్న న్యాయమూర్తి, వాహనాల విడుదల కోసం వారంలోపు అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని పిటిషనర్లకు స్పష్టం చేశారు. ఆ దరఖాస్తులను పరిశీలించి వాహనాల విడుదలపై చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.