హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సంక్రాంతి సెలవు దినాలు తెలంగాణ ప్రభుత్వానికి పరీక్షగా మారాయి. జనవరి 14న భోగి, 15న సంక్రాంతి పండుగ.. వరుసగా ఈ రెండ్రోజులు ప్రభుత్వ సెలవు దినాలు. ఇదే వారంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూలు వెలువడితే.. ఈ రెండు సెలవులు కీలకమైన నామినేషన్ల ఘట్టంలోఅడ్డంకిగా మారే అవకాశముంది. అందుకే సెలవు దినాల విషయంలో ప్రభుత్వం తల పట్టుకుంటోంది.
నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకు ఎన్నికల ప్రక్రియ గడువును మూడు వారాల నుంచి రెండు వారాలకు కుదిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు వీలుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టాన్ని సవరించింది. కానీ ఎన్నికల షెడ్యూలులో కీలకమైన నామినేషన్ల దాఖలు, నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు నిర్దేశించిన తేదీల్లో ప్రభుత్వ సెలవు దినాలుంటే.. మరుసటి వర్కింగ్ డే రోజున వాటిని అనుమతించాలని ఇదే చట్టంలో సెక్షన్ 40 స్పష్టం చేస్తోంది.
దీంతో ఎన్నికల ప్రక్రియకు నిర్దేశించిన గడువులో మూడు, నాలుగు రోజులు సెలవు దినాలు వస్తే.. ఈ వ్యవధిని కుదించిన ప్రయోజనం నెరవేరకుండా పోతుంది. అందుకే ఈ సెలవుల గందరగోళానికి తెర దింపేందుకు మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. అడ్డంకిగా ఉన్న ఈ సెక్షన్‌ను సైతం మారుస్తూ చట్టాన్ని సవరించాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. బుధవారం ఈ ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయి. దీని ప్రకారం నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ గడువులో ఉన్న సెలవు దినాలున్నా.. వాటిని సైతం ఎన్నికల ప్రక్రియలో భాగంగా వర్కింగ్ డేలుగానే పరిగణిస్తారు.