ఎస్‌సీ వర్గీక‘రణం’ | SC classification in Nizam PG Law College | Sakshi
Sakshi News home page

ఎస్‌సీ వర్గీక‘రణం’

Published Sat, Aug 6 2016 1:36 AM | Last Updated on Mon, Oct 8 2018 8:45 PM

ఎస్‌సీ వర్గీక‘రణం’ - Sakshi

ఎస్‌సీ వర్గీక‘రణం’

నిర్వాహకులు, మాల జేఏసీ నాయకుల బాహాబాహీ
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా హైదరాబాద్‌లోని నిజాం పీజీ న్యాయ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. భేటీ నిర్వాహకులకు, మాల జేఏసీ, మాల సంక్షేమ సంఘం నాయకులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల వాగ్వాదాలు, తోపులాటలు, పరస్పర దాడులతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కొదండరాం, ప్రజాగాయకుడు గద్దర్ సమక్షంలోనే ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఈ దాడుల్లో నిజాం లా కళాశాల ప్రిన్సిపాల్, సదస్సు నిర్వాహకుడు గాలి వినోద్‌కుమార్, మాలల జేఏసీ నాయకుడు ఆగమయ్యకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

తెలంగాణకు దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మాట మార్చిన కేసీఆర్ ను ఎందుకు ప్రశ్నించడం లేదంటూ కొందరు మాల నాయకులు కోదండరాం నిలదీయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇది క్రమంగా ఇరు వర్గాల బాహాబాహీకి దారితీసింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేశారు.
 
ఘర్షణ మొదలైందిలా..: నిజాం లా కాలేజీలోని అంబేడ్కర్ సెమినార్ హాల్‌లో శుక్రవారం ‘ఎస్సీ వర్గీకరణ ప్రజాస్వామిక డిమాండ్’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.వర్గీకరణ సంఘీభావ కమిటీ కన్వీనర్, నిజాం లా కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ నేతృత్వంలో ఈ సమావేశం ప్రారంభమైనట్లు తెలుసుకున్న మాలల జేఏసీ చైర్మన్ దీపక్ కుమార్, మాల మహానాడు రాష్ట్ర నాయకులు బత్తుల రాంప్రసాద్, జంగం శ్రీనివాస్, ఆగమయ్యలతోపాటు పలువురు అక్కడికి చేరుకున్నారు.

తమకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. చాలాసేపటి వరకు అవకాశం రాకపోవడంతో తమనెందుకు మాట్లాడనివ్వరంటూ మాలల ప్రతినిధులు నిర్వాహకులను ప్రశ్నిం చారు.అప్పటికే ప్రొఫెసర్ కోదండరాం తన ప్రసంగం ముగించి వెళ్తుండగా మాలల జేఏసీ నాయకులు ఆయన్ను నిలదీశారు. దళిత సీఎం హామీపై మాట తప్పిన కేసీఆర్ దళితులకు ఎంతో అన్యాయం చేశాడని, ఆ విషయంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. దళితుల మధ్య చిచ్చు పెట్టొద్దని, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిందన్నారు.

టీజేఏసీ చైర్మన్‌గా అన్ని వర్గాలకు అండగా ఉండాలన్నారు. గద్దర్ ప్రసంగాన్ని సైతం అడ్డుకున్నారు. దీంతో నిర్వాహకులు జోక్యం చేసుకోవడంతో ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో కొందరు కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. దాడుల్లో గాలి వినోద్‌కుమార్ తలకు గాయాలయ్యాయి. ఆయన తలకు నాలుగు కుట్లు వేశారు. ఆగమయ్యకు కూడా గాయపడడంతో ఇరువురినీ ఆస్పత్రికి తరలించారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో గాలి వినోద్‌కుమార్, ఆగమయ్యతోపాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
సామరస్యంగా పరిష్కరించుకోవాలి
కోదండరాం, గద్దర్

వర్గీకరణ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, ప్రజా గాయకుడు గద్దర్ సూచించారు. సభలో ఘర్షణ వాతావారణానికి ముందు వారు మాట్లాడారు. పాలకుల తీరు వల్లే ఎస్సీల మధ్య వైషమ్యాలు చోటు చేసుకున్నాయని కోదండరాం అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం మాదిరి ఏపీ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ఎందుకు ఎందుకు తీర్మానం చేయడంలేదన్నారు. త్వరలో వెయ్యి డప్పులు లక్ష గొంతులతో ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం వర్గీకరణ సంఘీభావ కమిటీ కన్వీనర్‌గా గద్దర్‌ను ఎన్నుకున్నారు. ఈ నెల 7న ప్రధానిని కలిసి పార్లమెంట్‌లో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వనున్నట్లు  తీర్మానించారు.
 
సమావేశం అప్రజాస్వామికం
వర్గీకరణ ప్రజాస్వామిక డిమాండ్ అన్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో మాకు కూడా అవకాశం ఇవ్వాల్సింది. సమావేశ మందిరంలోకి వెళ్లగానే గాలి వినోద్ అనుచరులు మాపై దాడులకు పాల్పడ్డారు. నిజాం లా కాలేజీలో ఎలాంటి అనుమతులు లేకుండా సమావేశం ఏర్పాటు చేసిన గాలి వినోద్‌ను సీఎం సస్పెండ్ చేయాలి. కుటుంబంలోని సమస్య అన్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కూర్చుని చర్చించుకోవాలి కానీ మేధావుల పేరుతో అగ్రకులాల వారిని పిలిచి ఎలా చర్చిస్తారు?
- బత్తుల రాంప్రసాద్, రాష్ట్ర మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు
 
దాడి అప్రజాస్వామికం
ఇది యావత్ ప్రజాస్వామికవాదులపై జరిగిన దాడిగా గుర్తించాలి. దాడికి పాల్పడిన వ్యక్తులు తమ తప్పును తెలుసుకోవాలని కోరుతున్నాను. జనాభా దామాషా ప్రకారం అందరికీ సమన్యాయం జరిగేలా అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారనే విషయాన్ని మరవద్దు. నిజమైన అంబే డ్కర్‌వాదులు వర్గీకరణకు అనుకూలంగా ముందుకు రావాలి.
- ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్
 
వర్గీకరణ వద్దు.. ఐక్యంగా ఉందాం
బహుజనులను ఏకం చేసి రాజ్యాధికారం వైపు నడిపించాలి కానీ దళితుల మధ్య చిచ్చుపెట్టడం ఎంతవరకు సమంజసం? వర్గీకరణ అంశంపై ఇరువర్గాల ప్రతినిధులతో బహిరంగ చర్చపెడితే బాగుండేది. కానీ కొంతమంది వ్యక్తులతో సమావేశం ఏర్పాటు చేసి మాలలు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారని ప్రకటించడం సరికాదు.
- మాలల జేఏసీ చైర్మన్ బి.దీపక్ కుమార్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement