
అవసరమైతే జైలుకు పంపిస్తాం: పునియా
హైదరాబాద్ : దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై ఎస్సీ కమిషన్ చైర్మన్ పునియా స్పందించారు. సోమవారం ఆయన సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించి ఘటనపై ఆరా తీశారు. హెచ్సీయూ విద్యార్థులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. దళిత విద్యార్థి ఆత్మహత్య చాలా బాధాకరమని పునియా విచారం వ్యక్తం చేశారు.
యూనివర్సిటీలో చోటుచేసుకున్న పరిణామాల్లో రాజకీయ కోణం కనిపిస్తోందంటూ పునియా వ్యాఖ్యానించారు. గతంలో కూడా యూనివర్సిటీలో జరిగిన పరిణామాలపై హెచ్ఆర్సీని నివేదిక కోరామని ఆయన తెలిపారు. రోహిత్ మరణం వెనుక ఎవరున్నా సరే చట్టపరమైన చర్యలు తప్పవని, అవసరమైతే జైలుకు పంపిస్తామని పునియా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రోహిత్ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.