
ఆ డబ్బులు ఎవరిచ్చారు?
అది ఎవరి ఖాతాలోని సొమ్ము?..‘బాస్’ సంగతేంటి?
♦ రేవంత్‌ను ప్రశ్నించిన ఏసీబీ ఆధారాలకు బలం చేకూర్చే వివరాల సేకరణ
♦ ఓటుకు నోటు కేసులో నేడు ముగియనున్న కస్టడీ
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఏసీబీ ప్రయత్నించింది.
ఈ కేసులో ఏసీబీ కస్టడీలో ఉన్న టీడీపీ నేత రేవంత్‌రెడ్డిని ఆయన లాయర్ సమక్షంలో మూడోరోజు కూడా అధికారులు ప్రశ్నించారు. ఆ సొమ్మును ఏ ‘బాస్’ పంపితే వచ్చిందో రేవంత్ ద్వారానే తెలుసుకునేందుకు ప్రయత్నించారు. తమ వద్ద ఉన్న ఆధారాలకు బలం చేకూర్చేలా ఆయన నుంచి వాస్తవాలు రాబట్టే యత్నంలో విచారణాధికారులు సఫలమైనట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి ఏసీబీకి లభించిన ఆడియో, వీడియో ఫుటేజీల్లోని సంభాషణ ఆధారంగా సోమవారం రేవంత్‌ను ప్రశ్నించారు.
నాలుగు రోజుల కస్టడీ మంగళవారం ముగుస్తోంది. సాయంత్రం 4 గంటల్లోపు నిందితులను కోర్టులో హాజరు పరచాల్సి ఉన్నందున వారి నుంచి వీలైనంత మేర వివరాలను రాబట్టే ప్రయత్నం చేశారు. ఏసీబీ స్వాధీనం చేసుకున్న రూ. 50 లక్షలతోపాటు టీడీపీ నేతలు డ్రా చేసినట్లుగా చె బుతున్న రూ. 2.50 కోట్లను ఎవరెవరికి ఇచ్చారనే దానిపైనా అధికారులు ఆరా తీశారు. స్టీఫెన్‌సన్‌తో ‘బాస్’ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా మాట్లాడిన టేపులు వెల్లడైన విషయాన్ని రేవంత్‌కు వివరించారు.
ముగ్గురు నిందితుల కాల్‌లిస్టులతోపాటు ఇతర అనుమానిత నేతల ఫోన్ల ఆధారంగా కూడా కుట్రలోని అన్ని కోణాలను ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. దర్యాప్తు సంస్థ అన్ని కోణాల్లో విచారణ సాగిస్తుందని, ఆ డబ్బు ఏ బ్యాంకు నుంచి, ఎవరి ఖాతా నుంచి డ్రా అయ్యాయో విచారణలో తేలిందని, నిజాలు వెల్లడిస్తే కేసు తీవ్రత తగ్గుతుందని రేవంత్‌తో అధికారులు అన్నట్లు తెలిసింది. కాల్‌లిస్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నప్పుడు మళ్లీ తనను ప్రశ్నించాల్సిన అవసరమేంటని రేవంత్ తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం.
తాను ఎమ్మెల్యేతో మాట్లాడేందుకే వెళ్లానని, ఇంకే వివరాలు తనకు తెలియవని మొండికేశారు. అయితే వెంటవెంటనే అడిగిన ప్రశ్నలనే అడుగుతున్న సమయంలో ఆయన నోరు జారినట్లు తెలిసింది. కాగా రేవంత్‌రెడ్డి విచారణను వీడియోలో రికార్డు చేస్తున్నారు. ఇక ఈ కేసులో ఇతర నిందితులు సెబాస్టియన్, ఉదయ్ సింహ వెల్లడించిన విషయాల ఆధారంగా కూడా ప్రశ్నల పరంపర కొనసాగింది. ‘బాస్’పై స్పష్టత కోసం అధికారులు ప్రశ్నల పరంపర కొనసాగించినట్లు సమాచారం.
బాస్ ఆడియో టేపులు కూడా వెల్లడైన విషయాన్ని వివరించి రేవంత్‌ను ఆందోళనలోకి నెట్టేలా ఏసీబీ మైండ్‌గేమ్ ఆడినట్లు తెలిసింది. ఇక ఆడియో టేపుల ఆధారంగా చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే అంశాలపై ఏసీబీ డీజీ ఎ.కె.ఖాన్ సోమవారం అధికారులు, న్యాయ నిపుణులతో చర్చించారు. బుధవారం నిందితుల బెయిల్ పిటిషన్ విచారణకు రానున్న దృష్ట్యా అనుసరించాల్సిన వ్యూహాన్ని ఆయన ఖరారు చేసే పనిలో ఉన్నారు.
రేవంత్‌కు ఉస్మానియాలో వైద్య పరీక్షలు
రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహలకు సోమవారం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీ క్షలు నిర్వహించారు. సిట్ కార్యాలయం నుంచి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించే ముం దు వారిని అధికారులు ఉస్మానియాకు తీసుకెళ్లారు. రేవంత్‌కు రక్తపోటు ఎక్కువగా ఉందని, గొంతునొప్పితో బాధపడుతుండడంతో వైద్యం అందించామని, ఉదయ సింహకు రక్తపోటు ఎక్కువగా ఉందని, సెబాస్టియన్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
రేవంత్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన కోర్టు
రేవంత్‌రెడ్డికి ఏసీబీ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. ఏసీబీ కస్టడీ ముగిసిన తర్వాత తనను చర్లపల్లి జైలుకు తరలించేలా ఆదేశించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కస్టడీ సమయంలో ఆయనను ఏసీబీ సిట్ అధికారుల అధీనంలోనే ఉంచుకోవచ్చని, అయితే అవసరమైన వైద్య చికిత్సలు అందివ్వాలని ఆదేశించారు.
తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడని రేవంత్ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. ఉదయం కస్టడీకి తీసుకునే ముందు, కస్టడీ ముగిసిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించాలని దర్యాప్తు అధికారులకు జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కాగా బెయిల్ పిటిషన్‌పై బుధవారం కౌంటర్ దాఖలు చేసేందుకు అనుమతించాలని ఏసీబీ తరఫున స్పెషల్ పీపీ వి.సురేందర్‌రావు నివేదించారు. ఇందుకు అనుమతించని కోర్టు.. 10న కౌంటర్ దాఖలు చేసి వాదనలు వినిపించాలని స్పష్టం చేసింది.