ఓట్లు.. గెలుపు పాట్లు..
క్లాస్ కాలనీల్లో అభ్యర్థుల సెలైంట్ ప్రచారం
కాలింగ్‌బెల్ నొక్కాలంటే దడ
అంబర్‌పేట: ఖద్దరు చొక్కా తొడుక్కుని.. వెనుక పదిమందిని వేసుకుని స్కార్పియోలో తిరిగిన నాయకులు ఇప్పుడు ఓట్లకోసం పాట్లు పడుతున్నారు. ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం అన్న చందంగా తిరుగుతున్నారు. బస్తీలు, మధ్య తరగతి ప్రాంతాల్లో సాఫీగా సాగిన ప్రచారం.. అపార్ట్‌మెంట్ల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. బస్తీల్లో బ్యాండ్ బాజాలతో తిరిగినవారు.. క్లాస్ ఏరియాలకు వచ్చేసరికి సెలైంట్ అయిపోతున్నారు. బరిలో ఉన్న సీనియర్ అభ్యర్థులు సైతం తలుపు తడితే.. ఓటర్లు కనీసం ముందున్న ఇనుప గ్రిల్ కూడా తీయకుండా సమాధానమిస్తున్నారు.
తలుపు తీయకుండానే సమాధానం..
క్లాస్ కాలనీలో ప్రచారానికి వెళ్లిన అభ్యర్థి ఏ ఇంటి తలుపు తట్టాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి. కాలింగ్ బెల్ నొక్కి చాలాసేపు ఎదురు చూస్తేగాని తలుపు తెరుచుకోవడం లేదు. ప్రచార కరపత్రం అందిస్తే.. ‘ఓ.. ఇదా..!’ అంటూ నిట్టూర్పు విడుస్తున్న సంఘటనలతో అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోచోట చిన్న పిల్లలు తలుపు తీస్తే వారు పెద్దలకు చెప్పడం.. ఇంట్లో ఉండి ‘సరే ఓటు వేస్తామని చెప్పు’ అని పంపించేస్తున్నారు. అంతే కాకుండా అపార్ట్‌మెంట్లలో మెట్లు ఎక్కి దిగడం అభ్యర్థులకు పరీక్షగా మారింది. కొన్ని సందర్భాల్లో ఓటు అడగడానికి వస్తే తలుపు తీయకుండానే ఓటేస్తామని సమాధామచ్చేస్తున్నారు. కొన్నిసందర్భాల్లో ‘మీకు ఎందుకు ఓటేయాలి.. ఇతర పార్టీలకు ఎందుకు వేయకూడదు.. ఎంత వరకు చదువుకున్నారు’.. వంటి ప్రశ్నలు గుప్పిస్తుండడంతో అభ్యర్థులు సమాధానం చెప్పలేక తెల్లమొహం వేయాల్సి వస్తోంది.
చిరాకు పడినా నవ్వుతూ ప్రచారం
సాధరణంగా గ్రేటర్ ఎన్నికల్లో 70 శాతం ఎన్నికల ప్రచారం బస్తీల చుట్టే తిరుగుతుంది. మాస్ ఓటర్లను నమ్ముకుని మూడు, నాలుగు బస్తీలను ఎంచుకొని దాదాపు అన్ని పార్టీ అభ్యర్థులు వాటిపైనే దృష్టిపెట్టి రాజకీయాలు చేస్తారు. డివిజన్‌లోని కాలనీల్లో ఆశతోనే ప్రచారం చేస్తున్నారే తప్ప పెద్దగా ఆశలు పెట్టుకోరు. అయితే, గెలుపును నిర్ణయించేది ఈ క్లాస్ కాలనీ, అపార్ట్‌మెంట్ ఓటర్లే కావడంతో అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. క్లాస్ ఓటర్లు చిరాకు పడినా.. మొహం మీదే తలుపేసినా చిరునవ్వు పులుముకుని సాగిపోతున్నారు.