తెలంగాణ సర్కార్కు మరో ఎదురుదెబ్బ
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ 123,124 జీవోలను కొట్టివేస్తూ.. హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం, చెల్లింపులపై గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం ఈ జీవో తెచ్చింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం రుద్రంగి శివారు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. 2013 భూ సేకరణ చట్టం ఉండగా జీవో నెంబర్ 123 ప్రకారం రిజిస్ట్రేషన్లు ఎలా చేసుకుంటారని ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్ను ప్రశ్నించింది.
రైతుల నుంచి నేరుగా భూమిని సేకరించేందుకు ఏర్పాటు చేసిన జీవోలో అనేక లోపాలున్నట్లు రైతులు హైకోర్టుకు విన్నవించారు. దీంతో ఏకీభవించిన ధర్మాసనం 123 జీవోను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవోలో కేవలం రైతులకు మాత్రమే లబ్ధి చేకూరుతోందని.. వాస్తవానికి రైతులతో పాటు రైతు కూలీలకు కూడా నష్టం పరిహారం చెల్లించాలని హైకోర్టు సూచించింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తాజా తీర్పుతో మల్లన్నసాగర్ సహా పలు ప్రాజెక్ట్‌ల భూసేకరణపై ప్రభావం పడనుంది. కాగా 123 జీవో కొట్టివేతపై తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లనున్నట్లు సమాచారం.