రక్తమోడిన రహదారులు...ఏడుగురు మృతి
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని రహదారులు రక్తమోడాయి. పలు జిల్లాల్లో మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డుప్రమాదాల్లో ఏడుగురు మృతిగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పశ్చిమ గోదావరి: నల్లజర్లలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.... ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా పెద్దపల్లిపాడు గ్రామానికి చెందిన రియల్‌ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాసరావు, వెంకటకృష్ణ, మరో ఇద్దరు కారులో వెళుతుండగా వెనుక నుంచి తమిళనాడుకు చెందిన లారీ ఢీకొంది. ఈ సంఘటనలో శ్రీనివాసరావు, వెంకటకృష్ణతో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ముందు వెళుతున్న లారీలోంచి పెప్సీ బాటిళ్లు రోడ్డుపై పడిపోవడంతో వెనుక వస్తున్న కారును ఆపారు. వేగంగా వచ్చిన లారీ ఆగి ఉన్న కారును ఢీకొంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికు తరలించారు.
తాడిపత్రి: అనంతపురం జిల్లాలో ఓ కారు బోల్తా పడిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.అనంతపురం నుంచి అంకిరెడ్డిపల్లెకు వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం ముందు టైరు పంక్చరైంది. దాంతో కారు ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న అంకిరెడ్డిపల్లెకు చెందిన తండ్రీకుమారులు వెంకటయ్య(55), ఉదయభాస్కర్(27) అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న అదే కుటుంబానికి చెందిన తిరుపాలమ్మ(50), సుధాకర్(20), ప్రసాద్(23) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు.
నల్లగొండ: చౌటుప్పల్ మండలం లక్కారం వద్ద ఆగి ఉన్న లారీను డీసీఎం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఈ సంఘటనలో డీసీఎంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. సమాచారం అందుక్ను పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు కోదాడకు చెందినవారని పోలీసులు భావిస్తున్నారు.