అగ్రిగోల్డ్ యాజమాన్యంపై హైకోర్టు ఆగ్రహం
భూముల వేలం పర్యవేక్షణ కమిటీ చైర్మన్‌గా జస్టిస్ సీతాపతి
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ యాజమాన్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును తప్పుదోవ పట్టిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. కోర్టుల సహనాన్ని పరీక్షించవద్దని స్పష్టం చేసింది. తమ ఆస్తులు అమ్మితే రూ.వేల కోట్లు వస్తాయని చెప్పడాన్ని తప్పుపట్టింది. కర్ణాటకలో ఆస్తులు ఉంటే వాటి గురించి ఆంధ్రప్రదేశ్‌లోని పత్రికల్లో ప్రకటనలు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అరెస్ట్‌ను తప్పించుకోవడానికే ఆస్తుల విక్రయం ద్వారా రూ.వేల కోట్లు వస్తాయని అగ్రిగోల్డ్ యాజమాన్యం చెబుతున్నట్లు తమకు అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. అలాగే అగ్రిగోల్డ్ డిపాజిట్ల ఎగవేత వ్యవహారంతో సీఐడీ దర్యాప్తు తీరుపై హైకోర్టు మండిపడింది. అగ్రిగోల్డ్ భూముల వేలం పర్యవేక్షణ కమిటీ చైర్మన్‌గా ఉన్న జస్టిస్ సూర్యారావు మృతి చెందడంతో ఆయన స్థానంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గుర్రం వెంకట సీతాపతిని నియమించింది. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌ల ధర్మాసనం సోమవారం ఆదేశించింది.
ఆస్తుల విలువలో ఎంతో తేడా
అగ్రిగోల్డ్ యాజమాన్యం రూ.6,350 కోట్లను డిపాజిట్లను వసూలు చేసి చేతులెత్తేసిందని, ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని పిల్ దాఖలైన విషయం తెలిసిందే. వీటిని ధర్మాసనం సోమవారం విచారించింది. దర్యాప్తునకు సహకరిస్తున్నందున అగ్రిగోల్డ్ యాజ మాన్యాన్ని అదుపులోకి తీసుకుని విచారించాల్సిన అవసరం రాలేదని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పట్నాయకుని కృష్ణప్రకాశ్ కోర్టుకు నివేదించారు.ఆదంతా తప్పని ధర్మాసనం స్పష్టం చేసింది. దర్యాప్తు తీరు ఇలానే సాగితే సీబీఐకి అప్పగించేందుకు వెనుకాడబోమంది.
కోర్టును తప్పుదోవ పట్టిస్తే తీవ్ర పరిణామాలు
Published Tue, Feb 9 2016 1:47 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement