పసిమనసుపై పైశాచికత్వం..!
చిన్నారులను చిదిమేస్తున్న కామాంధులు
⇒ రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న పిల్లలపై లైంగిక దాడులు
⇒ విభాగాల మధ్య సమన్వయ లోపంతో పెరుగుతున్న కేసులు
⇒ ప్రైవేట్ రెస్క్యూ హోమ్స్‌లోనూ బాధిత చిన్నారులకు ఛీత్కారాలే
⇒ సీఐడీ పరిశీలనలో సంచలనాత్మక వాస్తవాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: మన దేశంలో చిన్నారులను దేవుని ప్రతిరూపాలుగా చూస్తారు. కానీ కొందరు కామాంధులు అభం శుభం తెలియని పసివారిని తమ లైంగిక వాంఛకు బలి తీసుకుంటున్నారు. సామాజిక పరిజ్ఞానం తెలుసుకునే లోపే వేలాది మంది చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై లైంగిక వేధింపులను నియంత్రిస్తు న్న పోలీస్ శాఖ, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులను మాత్రం కట్టడి చేయలేకపోతోంది. దీంతో ఏటా మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులు, లైంగిక వేధింపుల కేసులు రెట్టింపు అవుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు పోలీస్ శాఖ ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతోంది. శాఖల మధ్య సమన్వయ లోపం.. వ్యవస్థలోని లోపాలు.. చట్టాల్లోని లొసుగులు నిందితులు తప్పించుకునేందుకు తోడ్పాటునందిస్తున్నాయి.
సీఐడీ పరిశీలనలో ఆందోళనకర అంశాలు..
లైంగిక దాడులు, వేధింపుల నియంత్రణ, ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపులు, వాటి నియంత్రణపై దృష్టి సారించిన సీఐడీ పలు కీలక అంశాలపై దృష్టి సారించింది. 2015, 2016లో మైనర్ బాలికలపై జరిగిన లైంగిక దాడులు, వేధింపుల కేసులను సీఐడీ ఉన్నతాధికారులు పరిశీలించగా కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగుచూశాయి. తమతో పాటు, అన్ని పోలీస్ యూనిట్లు, మహిళా, శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థలు.. చిన్నారులపై లైంగిక దాడుల నియంత్రణకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎంత అవగాహన కల్పించినా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు తెలిపారు. పోస్కో యాక్ట్ కింద రెండేళ్లలో నమోదైన కేసులు పరిశీలిస్తే.. 2017 జనవరిలోనే 84 చిన్నారులపై లైంగిక దాడుల కేసులు.. 34 లైంగిక వేధింపుల కేసులు నమోదైనట్టు తేలింది. 2015లో మొత్తం 671 లైంగిక దాడుల కేసులు నమోదు కాగా, 2016లో ఈ సంఖ్య 819కి పెరిగింది. ఇక లైంగిక వేధింపుల కేసుల విషయానికొస్తే 2015లో 231 కేసులు నమోదుకాగా, 2016లో 392కు పెరిగినట్టు స్పష్టమైంది.
సమన్వయ లోపం..
మహిళా, శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖల మధ్య సమన్వయ లోపమే చిన్నారులపై లైంగిక దాడులకు ప్రధాన కారణమని ఉన్నతాధి కారులు స్పష్టం చేస్తున్నారు. చిన్నారులపై లైంగిక దాడుల నియంత్రణకు తీసుకో వాల్సిన చర్యలు, చేపట్టాల్సిన అవగాహనా కార్యక్రమాలపై ప్రచారం చేయడంలో రెండు విభాగాలు విఫలమవ్వడమే వీటి పెరుగు దలకు కారణమని స్వచ్ఛంద సంస్థలు ఆరోపి స్తున్నాయి. లైంగికదాడులకు గురైన చిన్నారులను ప్రైవేట్ రెస్క్యూ హోమ్స్‌లో ఉంచడం కూడా వివాదానికి దారి తీస్తోంది. నగరంలోని ఓ రెస్క్యూ హోంలో బాధిత చిన్నారులను సంస్థ ప్రతినిధులు వేధిస్తున్నారని సీఐడీకి ఫిర్యాదులు వచ్చాయి. ప్రైవేటు రెస్క్యూ హోమ్స్‌లో బాధితులకు ఛీత్కారాలు ఎదురవుతున్నాయని, ప్రభుత్వ రెస్క్యూ హోమ్స్‌ను ఎందుకు పటిష్టం చేయడం లేదని ఎన్‌జీఓలు విమర్శిస్తున్నాయి.
లైంగిక దాడుల నియంత్రణపై దృష్టి: సౌమ్యామిశ్రా
రాష్ట్రంలో మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక దాడుల నియం త్రణపై దృష్టి సారించినట్టు సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా తెలిపారు. ఆన్‌లైన్ లో చిన్నారులకు లైంగిక వేధింపులు, నియంత్రణ చర్యలపై గురు, శుక్రవారాల్లో పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, పలు కేటగిరీల వారికి శిక్షణ కల్పిస్తున్నట్టు చెప్పారు. చెన్నైకి చెందిన తులీర్ సంస్థ ఆధ్వర్యంలో మర్ని చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో 2 రోజుల అవగాహనా కార్యక్రమం జరుగుతుందన్నారు. హోంమంత్రి నాయిని, డీజీపీ అనురాగ్ శర్మ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, జాతీయ బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ స్తుతీకక్కర్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, తులీర్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విద్యారెడ్డి తదితరులు పాల్గొంటారన్నారు.