పోచారం... తప్పుకో : షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్ : నాసిరకం, నకిలీ విత్తనాలు కొంటే ప్రభుత్వానికి బాధ్యత లేదంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంత్రివర్గం నుంచి వైదొలగాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌తో కలిసి అసెంబ్లీలో మంగళవారం ఆయన మాట్లాడారు.
‘రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రుణాలు దొరకక, నాణ్యమైన విత్తనాలు అందక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. రెండు విడతల రుణమాఫీని ఒకేసారి చేయాలి’ అని షబ్బీర్ విమర్శించారు. ముస్లింలకు ముఖ్యమైన పండుగ రంజాన్ (ఈ నెల 7) నాడు కూడా ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారన్నారు. రంజాన్ సందర్భంగా ఈ నెల 7, 8 తేదీల్లో సెలవులు ప్రకటించాలని సీఎంకు షబ్బీర్‌లేఖ రాశారు.