కేటీరావు.. పెద్ద గాలిరావు
త్యాగాల కుటుంబంతో మీకు పోలికా?: షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ తనపేరును గాలి రావుగా మార్చుకుంటే బాగుంటుందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ నోరు తెరిస్తే అబద్ధాలు, మాయమాటలు, మోసాలు, గాలిమాటలు తప్ప నిజాలు, త్యాగాలు కేసీఆర్ కుటుంబానికి తెలియవని ధ్వజమె త్తారు. అలాంటి కేసీఆర్ కుటుంబాన్ని దేశంకోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబంతో పోల్చుకోవడం సిగ్గుచేటన్నారు.
దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పి, పార్టీకి మెజారిటీ రాగానే సీఎం కుర్చీలో కేసీఆర్ కూర్చున్నారని దుయ్యబట్టారు. పార్టీకి అధికారం వచ్చినా ప్రధాని పదవిని త్యాగం చేసిన చరిత్ర సోనియాగాంధీదన్నారు. అలాంటి కుటుంబానికి చెందిన రాహుల్‌గాంధీతో కేటీఆర్‌కు పోలికా అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని, ఆ వాస్తవాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలని సూచించారు.