సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో రిజర్వేషన్లను యాభై శాతానికి మించి పెంచబోమని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించిందని, ఈ దృష్ట్యా రాష్ట్రంలో ముస్లిం, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు సాధ్యం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కోర్టుకు అఫిడవిట్ ఇచ్చాక కేంద్ర ప్రభుత్వం సైతం రిజర్వేషన్ల పెంపునకు ఒప్పుకునే అవకాశం లేదన్నారు. దీనిపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయకుండా సీఎం కేసీఆర్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సీనియర్ నేత దయాసాగర్‌తో కలిసి గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
ముస్లిం, గిరిజన రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీలతో మాట్లాడతానని కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టారన్నారు. ఏదీ సాధించకుండా రిజర్వేషన్లు 50శాతం దాటకుండా ఆర్డినెన్స్ తెచ్చారన్నారు. జనాభా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు తెస్తానని, సుప్రీంకోర్టుకు వెళ్తానని లేదంటే జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తానన్న ముఖ్యమంత్రి మాటలన్నీ కోతలేనని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను కల్పించిన ఘనత కాంగ్రెస్‌ది అయితే, ఒక్క ఆర్డినెన్స్‌తో బీసీల రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించిన చరిత్ర టీఆర్‌ఎస్‌ది అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ చావలేదు..
ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ పోస్టుమార్టమ్ నిర్వహించిందా? అని అడగ్గా, పార్టీ ఇంకా చావలేదన్నారు. కాంగ్రెస్‌కు 134 ఏళ్ల చరిత్ర ఉందని, పార్టీ ఓటమిపై కేవలం సమీక్ష మాత్రమే చేస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలు కేవలం మోదీ వర్సెస్ రాహుల్ – ధర్మం, అధర్మం మధ్యే ఉంటుందన్నారు. కేసీఆర్ ఎన్ని డబ్బులు పంచినా ఫలితాలు భిన్నంగా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment