
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్య వ్యాపారీ కరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణను ప్రారంభించింది. సోమవారం దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఈ క్యాంపెయిన్ ను మాజీ మంత్రి, మండలిలో మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ తొలి సంతకం చేసి ప్రారంభించారు. టీపీసీసీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి షబ్బీర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పాఠశాల విద్య భారతదేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే అత్యంత ఖరీదైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు కాంగ్రెస్ ప్రభుత్వం 2009 ఆగస్టులో అమల్లోకి తెచ్చిన ఉత్తర్వులను టీఆర్‌ఎస్ తుంగలో తొక్కింద న్నారు. సీఎం కేసీఆర్ విద్యావ్యాపారంపై ఎప్పుడూ కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని, దాదాపు 52 శాతం మంది పిల్లలు చదువుకుంటున్న ప్రైవేటు విద్యాసంస్థలకు ముకుతాడు వేయడం గురించి ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. టీపీసీసీ మైనార్టీ సెల్ చైర్మన్ అబ్దుల్లా సోహైల్ మాట్లాడుతూ.. రానున్న 2 నెలల్లో 10 లక్షల సంతకాలను సేకరించి గవర్నర్‌కు ఇస్తా మని చెప్పారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు.
విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తొలి సంతకం చేస్తున్న మాజీ మంత్రి షబ్బీర్‌అలీ
Comments
Please login to add a commentAdd a comment