చదువులో గోల్డ్‌మెడల్.. అందాల మోడల్
స్టడీస్‌లో వీక్‌గా ఉంటేనో, మెరిట్ ఆధారిత కెరీర్‌లో అవకాశాలు లేకపోతేనో.. మోడలింగ్‌ను ఎంచుకుంటారనేది చాలా మంది అభిప్రాయం. అటు పేరెంట్స్ మాత్రమే కాదు ఇటు స్టూడెంట్స్ కూడా అలాగే భావిస్తారు. అయితే సాక్షి అగర్వాల్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. చదువులో టాపర్‌గా తనను తాను నిరూపించుకుని, ఎంతో మంచి కెరీర్ ఊరిస్తున్నా ఆసక్తికి అనుగుణంగా మోడలింగ్ ఎంచుకుందీ అమ్మాయి. గ్లామర్ రంగంలో అడుగుపెట్టి తక్కువ టైమ్‌లోనే పాపులారిటీ దక్కించుకుని మోడల్‌గానే కాదు సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో సైతం దూసుకుపోతున్న సిటీ అమ్మాయి సాక్షి అగర్వాల్ చెప్పిన ముచ్చట్లివి...
చదువులో టాపర్...
మా నాన్న వ్యాపారవేత్త. అమ్మ గృహిణి. చెల్లెలు స్కూల్ విద్యార్థిని. నేను చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో బి.టెక్ గోల్డ్‌మెడలిస్ట్‌ని. బెంగళూరులోని ఎక్స్‌ఎమ్‌ఈ వర్సిటీలో ఎంబీఏ మార్కెటింగ్ చేశాను. అక్కడా టాపర్‌గా నిలిచాను. పెద్ద కంపెనీల్లో ఐదంకెల జీతంతో పెద్ద హోదాతో జాబ్ ఆఫర్స్ వచ్చినా... గ్లామర్ రంగం నన్ను ఆకట్టుకోవడంతో గోల్డ్‌మెడళ్లూ, మెరిట్ లిస్ట్‌లూ పక్కన పెట్టి... ఫ్యాషన్ రంగంలో ఓనమాలు దిద్డడానికి సిద్ధపడ్డాను.
ఫ్యాషన్‌లో సూపర్...
ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకుంటుండగానే మోడలింగ్‌లో ఆఫర్లు వచ్చాయి. షట్టర్ క్లిక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫొటోగ్రఫీ నుంచి ఫొటోస్మార్ట్ టైటిల్ గెలిచాను. ఫ్యాషన్ డైరీకి బెస్ట్ ఫేస్‌గా ఎన్నికయ్యాను. తిరుపూర్ ఫ్యాషన్ షోలో బ్యూటీ విత్ బ్రెయిన్స్ టైటిల్ గెలిచాను. ఈ టైటిల్స్ ఫలితంగా ఫ్యాషన్ పరిశ్రమలో మోడల్‌గా ఫెమినా, డీఎన్‌ఏ, శరవణ స్టోర్స్, మలబార్‌గోల్డ్.. వంటి పలు ప్రముఖ బ్రాండ్స్ అవకాశాలు అందుకున్నాను. మరిన్ని మంచి సంస్థలకు చేయాలనేది నా కోరిక.
అలా సినిమాస్టార్...
మోడలింగ్ నుంచి సినిమా అవకాశాలూ వచ్చాయి. రాజారాణి, నోపార్కింగ్ (తమిళం), హెద్దరి (కన్నడం) సినిమాల్లో నటించాను. తద్వారా లెదర్ కౌన్సిల్ బెస్ట్ అప్‌కమింగ్ యాక్ట్రెస్ ఆఫ్ ది సీజన్ 2013 అవార్డు గెలుచుకున్నాను. చిట్టారా మేగజైన్ ద్వారా మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్, బిఒఎఫ్ నుంచి ప్రామిసింగ్ ఉమెన్ అవార్డు దక్కించుకున్నాను. గలాట్లా స్టూడియో స్క్రీనింగ్‌కు చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యాను. అంబేద్కర్ కాలేజ్‌లో, కేంబ్రిడ్జి కాలేజ్, డ్రీమ్‌జోన్... సెలబ్ జడ్జిగా వ్యవహరించాను. షార్ట్ ఫిల్మ్స్‌లోనూ, మ్యూజిక్ వీడియోల్లోనూ చేశాను.
టాలీవుడ్... నా ఫ్యూచర్
మన దేశంలోనే అత్యధిక సంఖ్యలో సినిమాలు నిర్మించే టాలీవుడ్‌లో నన్ను నేను నిరూపించుకోవాలని ఉంది. మహేష్‌బాబు, రాజమౌళి వంటి సినీ ప్రముఖులతో పాటు సరైన ఆఫర్ వస్తే ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి రెడీ. దీపిక పదుకునే నా రోల్‌మోడల్. ఆమె స్థిరంగా తనను తాను నిరూపించుకుంటూ ఎదుగుతోంది. అంతేకాకుండా వ్యక్తిగానూ తన మర్యాదను నిలబెట్టుకుంటోంది. ఏ అమ్మాయైనా తన వరకూ తాను ఒక వ్యక్తిగత గుర్తింపును సాధించాలి. నేను కూడా సాక్షి అగర్వాల్‌గా గుర్తుండిపోవాలనుకుంటున్నాను. ఒక గొప్ప అందమైన నటిగా, డ్యాన్సర్‌గా బయటి ప్రపంచంలోనూ, ఓ మంచి మనిషిగా సన్నిహిత ప్రపంచంలోనూ పేరు తెచ్చుకోవడమే ఆశయం. ఎంచుకున్న ప్రతి రంగంలోనూ అత్యున్నత శిఖరాలను అధిరోహించాలన్నదే నా లక్ష్యం.